మన అమ్మాయిలు అదరగొట్టారు... అద్భుతమైన ఆటతో ఆది నుంచీ ఆధిపత్యం ప్రదర్శించిన మహిళా బృందం చివరకు అగ్రభాగాన నిలిచింది... సీనియర్ స్థాయిలో ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీ గెలవని నిరాశను దూరం చేస్తూ ‘యువ’బృందం చిరస్మరణీయ ఫలితాన్ని సాధించింది. తొలిసారి నిర్వహించిన అండర్–19 ప్రపంచకప్‌లో కొత్త చరిత్రను సృష్టిస్తూ టీమిండియా మహిళలు విశ్వవిజేతగా నిలిచారు. ఏకపక్షంగా సాగిన తుది పోరులో ఇంగ్లండ్ ఆట కట్టించిన మన బృందం జగజ్జేతగా అవతరించింది... మహిళల క్రికెట్‌లో కొత్త తరానికి ప్రతినిధులుగా దూసుకొచ్చిన అమ్మాయిలు మొదటి ప్రయత్నంలోనే శిఖరాన నిలిచి మన మహిళల క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉందనే భరోసాను మరింత పెంచారు.
పోష్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): మహిళల తొలి అండర్–19 ప్రపంచకప్ విజేతగా భారత్ తమ పేరును ఘనంగా లిఖించుకుంది. 16 జట్లు పాల్గొన్న ఈ టి20 టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ అండర్ –19పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 14 ఓవర్లలో 3 వికెట్లకు 69 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ప్రస్తుతం పురుషుల అండర్–19 వరల్డ్‌కప్ విజేత భారత్ కాగా... ఇప్పుడు మహిళల జట్టు కూడా జత చేరడం విశేషం. ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో తెలంగాణ నుంచి గొంగడి త్రిష, యశశ్రీ, ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయి షబ్నమ్ సభ్యులుగా ఉన్నారు.
ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో కూడా 99 పరుగులకే కుప్పకూలి అదృష్టవశాత్తూ విజయంతో బయటపడ్డ ఇంగ్లండ్ బ్యాటింగ్ బలహీనత ఫైనల్లోనూ కనిపించింది. ఒకరితో మరొకరు పోటీ పడి విఫలం కావడంతో జట్టు సాధారణ స్కోరు కూడా చేయలేకపోయింది. టిటాస్ సాధు, అర్చన, పార్శవి ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ర్యానా మెక్‌డొనాల్డ్ (24 బంతుల్లో 19; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా... ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లే నమోదయ్యాయి. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ దూసుకుపోయింది. షఫాలీ వర్మ (15), శ్వేత సెహ్రావత్ (5) విఫలమైనా... గొంగడి త్రిష (29 బంతుల్లో 24; 3 ఫోర్లు), సౌమ్య (37 బంతు ల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. 6 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన టిటాస్ సాధు ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’గా నిలిచింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ అండర్–19 ఇన్నింగ్స్: స్క్రివెన్స్ (సి) త్రిష (బి) అర్చన దేవి 4; హీప్ (సి అండ్ బి) టిటాస్ సాధు 0; హాలండ్ (బి) అర్చన దేవి 10; సెరెన్ స్మేల్ (బి) టిటాస్ సాధు 3; ర్యానా మెక్‌డొనాల్డ్ (సి) అర్చన దేవి (బి) పార్శవి 19; పేవ్లీ (ఎల్బీ) (బి) పార్శవి 2; స్టోన్‌హౌస్ (సి) సోనమ్ (బి) మన్నత్ 11; గ్రోవ్స్ (రనౌట్) 4; బేకర్ (సి) రిచా ఘోష్ (బి) షఫాలి 0; సోఫియా స్మేల్ (సి అండ్ బి) సోనమ్ 11; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.1 ఓవర్లలో ఆలౌట్) 68.
వికెట్ల పతనం: 1–1, 2–15, 3–16, 4–22, 5–39, 6–43, 7–53, 8–53, 9–68, 10–68.
బౌలింగ్: టిటాస్ సాధు 4–0–6–2, అర్చనా దేవి 3–0–17–2, పార్శవి చోప్రా 4–0–13–2, మన్నత్ కశ్యప్ 3–0–13–1, షఫాలీ 2–0–16–1, సోనమ్ 1.1–0–3–1.
భారత్ అండర్–19 ఇన్నింగ్స్: షఫాలీ (సి) స్టోన్‌హౌస్ (బి) బేకర్ 15; శ్వేత (సి) బేకర్ (బి) స్క్రివెన్స్ 5; సౌమ్య (నాటౌట్) 24; త్రిష (బి) స్టోన్‌హౌస్ 24; రిషిత (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో 3 వికెట్లకు) 69.
వికెట్ల పతనం: 1–16, 2–20, 3–66.
బౌలింగ్: బేకర్ 4–1–13–1, సోఫియా స్మేల్ 2–0–16–0, స్క్రివెన్స్ 3–0–13–1, గ్రోవ్స్ 2–0–9–0, స్టోన్‌హౌస్ 2–0–8–1, అండర్సన్ 1–0–10–0.
Under 19 Womens T20 World Cup 2023: జగజ్జేతగా అవతరించిన టీమిండియా
Published Sun, Jan 29 2023 7:42 PM | Last Updated on Mon, Jan 30 2023 8:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment