వరల్డ్ కప్లో నేపాల్ కొత్త చరిత్ర
ఫతుల్లా: అండర్-19 వరల్డ్ కప్ లో నేపాల్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గ్రూప్-డిలో భాగంగా ఆదివారం ఐర్లాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్ లో నేపాల్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో అండర్-19 క్రికెట్ చరిత్రలో తొలిసారి క్వార్టర్స్ చేరి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఓడించిన నేపాల్.. ఈరోజు జరిగిన రెండో మ్యాచ్ లో ఐర్లాండ్ ను మట్టికరిపించింది. ఐర్లాండ్ విసిరిన 132 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన నేపాల్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 25.3 ఓవర్లలో గెలిచింది. నేపాల్ ఓపెనర్లు సునార్(0), ధామాలా(28)లు ఆదిలో పెవిలియన్ చేరినా, కర్కి(61నాటౌట్), అరిఫ్ షేక్(31 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జట్టును క్వార్టర్స్ కు చేర్చారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50.0 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఆటగాళ్లలో జాక్ టెక్టార్(27), డెన్నిసన్(21), దోహ్నీ(14), టుక్కర్(15), హర్రీ టెక్టార్(30నాటౌట్)లు మినహా ఎవరూ రెండంకెల మార్కును చేరకపోవడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. నేపాల్ బౌలర్లలో లామిచాన్ని ఐదు వికెట్లు తీసి ఐర్లాండ్ వెన్నువిరిచాడు. గ్రూప్ డి నుంచి నేపాల్ తో పాటు, భారత్ క్వార్టర్స్ కు చేరగా, గ్రూప్-బి నుంచి పాకిస్తాన్, శ్రీలంకలు క్వార్టర్స్ కు చేరాయి.