ICC U19 Women T20 WC 2023: తొలిసారి జరుగుతున్న ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఖంగుతినిపించిన భారత అమ్మాయిలు.. ఇవాళ (జనవరి 16) యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 122 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. ఫలితంగా 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో గ్రూప్-డిలో అగ్రస్థానంలో నిలిచారు.
యూఏఈతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్లు శ్వేత సెహ్రావత్ (49 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు), షఫాలీ వర్మ (34 బంతుల్లో 78; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్ల) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది.
తెలుగమ్మాయి గొంగడి త్రిష (5 బంతుల్లో 11; 2 ఫోర్లు) భారీ షాట్లు ఆడే క్రమంలో వికెట్ కోల్పోగా.. సోనియా మెంధియా 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. యూఏఈ బౌలర్లలో ఇందుజ నందకుమార్, మహిక గౌర్, సమైరా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ.. భారత బౌలర్లు షబ్నమ్ (1/21), టిటాస్ సాధు (1/14), మన్నత్ కశ్యప్ (1/14), పర్శవి చోప్రా (1/13) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 97 పరుగులకు మాత్రమే పరిమితమైంది.
యూఏఈ ఇన్నింగ్స్‌లో లావణ్య కెనీ (24), తీర్థ సతీష్ (16), మహిక గౌర్ (26) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ భారత ఓపెనర్లు శ్వేత సెహ్రావత్ (57 బంతుల్లో 92 నాటౌట్; 20 ఫోర్లు), షఫాలీ వర్మ (16 బంతుల్లో 45; 9 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన విషయం తెలిసిందే. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో (జనవరి 18) స్కాట్లాండ్‌ను ఢీకొట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment