సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్‌కప్‌లో యువ భారత్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సౌతాఫ్రికాతో ఇవాళ (ఫిబ్రవరి 6) జరిగిన తొలి సెమీఫైనల్లో ఉదయ్ సహారన్ సేన సంచలన విజయం సాధించి, ఆతిథ్య జట్టుకు గుండెకోతను మిగిల్చింది. 245 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ను సచిన్ దాస్ (95), కెప్టెన్ ఉదయ్ సహారన్ (81) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. వీరు ఐదో వికెట్‌కు 171 పరుగులు జోడించి సౌతాఫ్రికా చేతల నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (76), రిచర్డ్ సెలెట్‌స్వేన్ (64) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఆఖర్లో ట్రిస్టన్ లూస్ (23 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. కెప్టెన్ జుయాన్ జేమ్స్ (24) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలరల్లో రాజ్ లింబాని 3, ముషీర్ ఖాన్ 2, నమన్ తివారి, సౌమీ పాండే తలో వికెట్ పడగొట్టారు.
245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. సౌతాఫ్రికా సంచలన పేసర్ మపాకా ఆదర్శ్ సింగ్‌ను తొలి బంతికే ఔట్ చేశాడు. ఆతర్వాత నాలుగో ఓవర్‌లో టీమిండియాకు అతి భారీ షాక్ తగిలింది. భీకర ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్‌ను (4) ట్రిస్టన్ లూస్ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత భారత్ 10, 12 ఓవర్లలో అర్షిన్ కులకర్ణి (12), ప్రియాన్షు మోలియా (5) వికెట్లు కోల్పోయింది. ట్రిస్టన్ లూసే వీరిద్దరి వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో జతకట్టిన ఉదయ్ సహారన్, సచిన్ దాస్ జోడీ సౌతాఫ్రికా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని వారి నుంచి మ్యాచ్ లాగేసుకుంది.
చివర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడికి లోనైనప్పటికీ.. రాజ్ లింబానీ (13 నాటౌట్) బౌండరీ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్లోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 8న జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment