
‘రికార్డు సెంచరీ’పై గొంగడి త్రిష వ్యాఖ్య
కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష... తన ప్రదర్శనపై దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ ప్రభావం ఉందని వెల్లడించింది. వరల్డ్‌కప్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో ‘సూపర్ సిక్స్’ పోరులో 59 బంతులాడి అజేయంగా 110 పరుగులు చేసిన త్రిష... ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలో హైదరాబాదీ స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్‌ను చూసి నేర్చుకున్నానని వెల్లడించింది.
2023 మహిళల అండర్–19 ప్రపంచకప్‌తో పాటు, గతేడాది అండర్–19 ఆసియాకప్‌లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన త్రిష... తాజా సెంచరీని తండ్రి రామిరెడ్డికి అంకితమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘మిథాలీ రాజ్‌ను చూస్తూ పెరిగాను. ఆమె ఇన్నింగ్స్‌ను నిర్మించే తీరు నాకెంతో ఇష్టం. నేను కూడా అలాగే చేయాలని ఎప్పటి నుంచో అనుకునే దాన్ని. నా ఆదర్శ క్రికెటర్ మిథాలీ.
ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే భారీ ఇన్నింగ్స్ ఆడాలనుకున్నా. మొత్తానికి అది స్కాట్లాండ్‌పై సాధ్యపడింది. తొలుత బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా. అప్పుడే మొత్తం 20 ఓవర్లు ఆడి భారీ స్కోరు చేసేందుకు వీలుంటుంది. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడంతో ఆ అవకాశం దక్కింది. క్రీజులో ఉన్నప్పుడు వ్యక్తిగత స్కోరును పట్టించుకోను. సహచరులు సంబరాలు చేసుకునేంత వరకు సెంచరీ పూర్తి చేసుకున్నానని గుర్తించలేదు.
చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఈ సెంచరీని ఆయనకే అంకితమిస్తున్నా. అమ్మానాన్న సహకారం లేకుంటే ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు’అని త్రిష వెల్లడించింది. తాజా ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న త్రిష... వరుసగా రెండో సారి కప్పు ముద్దాడడమే తమ లక్ష్యమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment