అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను వరుసగా రెండోసారి సాధించిన భారత జట్టులోని పలువురు ప్లేయర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్‌లో చోటు దక్కింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత అమ్మాయిల జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించిన సంగతి తెలిసిందే.
ఈ టోర్నీ ఆసాంతం విశేషంగా రాణించిన తెలంగాణ స్టార్ ఓపెనర్ గొంగడి త్రిష సహా మొత్తం నలుగురు భారత క్రికెటర్లకు ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’లో స్థానం లభించింది. త్రిష ఓపెనింగ్ భాగస్వామి కమలిని, లెఫ్టార్మ్ స్పిన్ ద్వయం వైష్ణవి శర్మ, ఆయుశి శుక్లాలు కూడా ఐసీసీ ఎంపిక చేసిన జట్టులో ఉన్నారు. హార్డ్ హిట్టర్ త్రిష ఈ టోర్నీ చరిత్రలోనే తొలి సెంచరీ సహా 309 పరుగులు చేసింది.
లెగ్‌స్పిన్‌తో 7 వికెట్లను కూడా పడగొట్టింది. ఆమెతో జోడీగా దిగిన కమలిని 143 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో కమలిని (50 బంతుల్లో 56 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. భారత స్పిన్నర్లలో ఆయుశి 14 వికెట్లను చేజిక్కించుకోగా, వైష్ణవి 17 వికెట్లతో టోర్నీలోనే అగ్రస్థానంలో ఉంది. మలేసియాపై ‘హ్యాట్రిక్’తో ఆమె (5/5) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది.
ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీ: కైలా రేనెకె (కెప్టెన్; దక్షిణాఫ్రికా), జెమ్మా బోతా (దక్షిణాఫ్రికా), త్రిష, కమలిని, ఆయుశి శుక్లా, వైష్ణవి శర్మ (భారత్), డేవినా పెరిన్, కేటీ జోన్స్ (ఇంగ్లండ్), కావొంహె బ్రే (ఆ్రస్టేలియా), చమొది ప్రబొద (శ్రీలంక), పూజ మహతో (నేపాల్), 12వ ప్లేయర్: ఎన్‌తబిసెంగ్ నిని (దక్షిణాఫ్రికా).
చదవండి: అదరగొడుతున్న ‘అభి’
Comments
Please login to add a commentAdd a comment