క్వీన్స్‌టౌన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)-అండర్ 19 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ లాయడ్ పోప్ సరికొత్త సృష్టించాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లాయడ్ పోప్ 35 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు సాధించాడు. ఫలితంగా అండర్ 19 వరల్డ్ కప్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. కాగా, ఈ వరల్ఢ్ కప్‌లో పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌కు చెందిన జాసన్ రాల్‌స్టాన్(7/15) నెలకొల్పిన రికార్డును లాయడ్ పోప్ స్వల్ప వ్యవధిలో బద్దలు కొట్టడం ఇక్కడ విశేషం. మరొకవైపు లిస్ట్-ఎ క్రికెట్‌లో ఎనిమిది వికెట్లు సాధించిన రెండో ఆసీస్ క్రికెటర్‌గా లాయడ్ ఘనత సాధించాడు. 2003-04 సీజన్‌లో తస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో షాన్ టాయిట్ ఎనిమిది వికెట్లు సాధించిన తొలి ఆసీస్ క్రికెటర్.
ఆసీస్ నిర్దేశించిన 127 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు లాయడ్ పోప్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ లియామ్ బాంక్స్(3)ను అవుట్ చేసిన పోప్.. ఆపై మరుసటి బంతికి ఫస్ట్ డౌన్‌లో వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ హర్రీ బ్రూక్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. అటు తరువాత తన స్పిన్ మాయాజాలాన్ని కొనసాగించిన లాయడ్ పోప్ ఇంగ్లండ్‌ను ఏ దశలోనూ కోలుకోనీయలేదు. మొత్తంగా ఎనిమిది వికెట్లను సాధించి సత్తాచాటాడు. దాంతో 23.4 ఓవర్లలో 96 పరుగులకే పరిమితమైన ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్ టామ్ బాన్‌టాన్(58) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించగా, ఇంగ్లండ్ టోర్నీ నుంచి భారంగా నిష్ర్కమించింది.
Comments
Please login to add a commentAdd a comment