ఆసీస్‌ విలాసం ఇంగ్లండ్‌ విలాపం | Australia beat England by 64 runs | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ విలాసం ఇంగ్లండ్‌ విలాపం

Published Wed, Jun 26 2019 4:37 AM | Last Updated on Wed, Jun 26 2019 8:08 AM

Australia beat England by 64 runs - Sakshi

వరల్డ్‌ నంబర్‌వన్‌ జట్టు హోదాలో, సొంతగడ్డపై ప్రపంచకప్‌ ఫేవరెట్‌గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కోటకు బీటలు పడుతున్నాయి. గత మ్యాచ్‌లో అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓడిన మోర్గాన్‌ సేన ఇప్పుడు చిరకాల ప్రత్యర్థి ఆసీస్‌ చేతిలోనూ చావుదెబ్బ తింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక, కనీసం పూర్తి ఓవర్లు ఆడలేక ఆ జట్టు చతికిల పడింది. ఒకరితో పోటీ పడి మరో బ్యాట్స్‌మన్‌ విఫలం కావడంతో టోర్నీలో మూడో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది.

ఫలితంగా సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టం చేసుకుంది. అటు ఆస్ట్రేలియా మాత్రం అదరగొట్టే ఆటతో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మ్యాచ్‌ మ్యాచ్‌కూ రాటుదేలుతున్న కంగారూ సేన వరుసగా నాలుగో విజయాన్ని అందుకొని ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలిచింది. బ్యాటింగ్‌లో ఫించ్, వార్నర్‌ జట్టును ముందుండి నడిపిస్తే బౌలింగ్‌లో బెహ్రన్‌డార్ఫ్‌ ఐదు వికెట్లకు తోడు స్టార్క్‌ అద్భుత బంతులు ఆసీస్‌ను గెలిపించాయి. 1992 తర్వాత ఇంగ్లండ్‌ చేతిలో ఓడని తమ రికార్డును ఈసారి కూడా ఆస్ట్రేలియా నిలబెట్టుకోవడం విశేషం.

  
లండన్‌: ప్రపంచకప్‌లో తొలి సెమీస్‌ స్థానం ఖాయమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా టోర్నీలో ఆరో విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం లార్డ్స్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్‌ ఫించ్‌ (116 బంతుల్లో 100; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. వార్నర్‌ (61 బంతుల్లో 53; 6 ఫోర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇంగ్లండ్‌ 44.4 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్‌ (115 బంతుల్లో 89; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. బెహ్రన్‌డార్ఫ్‌ (5/44), మిషెల్‌ స్టార్క్‌ (4/43) ప్రత్యర్థిని కుప్పకూల్చారు. 
 
రాణించిన వార్నర్‌...
ఆస్ట్రేలియాకు ఫించ్, వార్నర్‌ మరోసారి అదిరే ఆరంభం అందించారు. పిచ్‌ బౌలింగ్‌కు కొంత అనుకూలంగా కనిపించినా... ఇంగ్లండ్‌ పేసర్లు ఆ అవకాశాన్ని ఉపయోగించు కోలేకపోవడంతో కంగారూల ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోయింది. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫించ్‌ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను విన్స్‌ వదిలేయడం, 18 వద్ద ఇంగ్లండ్‌ ఎల్బీ అప్పీల్‌ను అంపైర్‌ తిరస్కరించడం ఆసీస్‌కు కలిసొచ్చింది. అంపైర్‌ నిర్ణయాన్ని ఇంగ్లండ్‌ రివ్యూ చేసినా లాభం లేకపోయింది.

తొలి పవర్‌ప్లేలో ఆసీస్‌ 44 పరుగులు చేయగా... ఓపెనర్లు ఇద్దరూ ఒకరితో మరొకరు పోటీ పడి చకచకా పరుగులు సాధించారు. ఈ క్రమంలో ఫించ్‌ 61 బంతుల్లో, వార్నర్‌ 52 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 17.5 ఓవర్లలో భాగస్వామ్యం వంద పరుగులకు చేరింది. చివరకు వార్నర్‌ను ఔట్‌ చేసి స్పిన్నర్‌ అలీ ఈ జోడీని విడదీశాడు. మరోవైపు ఫించ్‌ దూకుడు తగ్గించలేదు. 9 పరుగుల వద్ద బట్లర్‌ స్టంపింగ్‌ వదిలేయడంతో బతికిపోయిన ఖాజా (23) కెప్టెన్‌కు అండగా నిలిచాడు.

వీరిద్దరు 50 పరుగులు జత చేసిన తర్వాత ఖాజా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ఆశించినంత వేగంగా సాగకపోవడంతో స్కోరు 300 పరుగులకు కూడా చేరలేదు. 115 బంతుల్లో ఈ ప్రపంచకప్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఫించ్‌ వెనుదిరగ్గా... స్టీవ్‌ స్మిత్‌ (34 బంతుల్లో 38; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చివర్లో క్యారీ (27 బంతుల్లో 38 నాటౌట్‌; 5 ఫోర్లు) వేగంగా ఆడటంతో ఆసీస్‌ చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయగలిగింది.  

స్టోక్స్‌ మినహా...
26 పరుగులకు 3 వికెట్లు... లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు లభించిన ఆరంభం ఇది!  ఇన్నింగ్స్‌ రెండో బంతికే విన్స్‌ (0)ను బెహ్రన్‌డార్ఫ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయగా, స్టార్క్‌ అద్భుత బంతికి రూట్‌ (8) వికెట్ల ముందు దొరికిపోయాడు. పుల్‌ షాట్‌ ఆడబోయి మోర్గాన్‌ (4) వెనుదిరిగాడు. ఈ దశలో బెయిర్‌స్టో (27) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా చెత్త షాట్‌తో నిష్క్రమించాడు. స్టోక్స్, బట్లర్‌ (25) ఐదో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం తప్పించున్న బట్లర్‌ ఇన్నింగ్స్‌... డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో ఖాజా అద్భుత క్యాచ్‌తో ముగిసింది.

స్టోక్స్‌ మాత్రం కండరాల నొప్పితో బాధపడుతూనే చికిత్స తీసుకుంటూ తన పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన అతను 75 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రిస్‌ వోక్స్‌ (26) నుంచి అతనికి కొంత సహకారం లభించింది. మ్యాక్స్‌వెల్‌ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు, కమిన్స్‌ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన స్టోక్స్‌ను బౌల్డ్‌ చేసి స్టార్క్‌ ఆసీస్‌ అడ్డుగోడను తప్పించాడు. అతను వేసిన ఈ యార్కర్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ పతనం కావడానికి ఎంతో సేపు పట్టలేదు.  

స్కోరు వివరాలు  
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: ఫించ్‌ (సి) వోక్స్‌ (బి) ఆర్చర్‌ 100; వార్నర్‌ (సి) రూట్‌ (బి) అలీ 53; ఖాజా (బి) స్టోక్స్‌ 23; స్మిత్‌ (సి) ఆర్చర్‌ (బి) వోక్స్‌ 38; మ్యాక్స్‌వెల్‌ (సి) బట్లర్‌ (బి) వుడ్‌ 12; స్టొయినిస్‌ (రనౌట్‌) 8; క్యారీ (నాటౌట్‌) 38; కమిన్స్‌ (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 1; స్టార్క్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 285.  

వికెట్ల పతనం: 1–123, 2–173, 3–185, 4–213, 5–228, 6–250, 7–259.

బౌలింగ్‌: వోక్స్‌ 10–0–46–2, ఆర్చర్‌ 9–0–56–1, వుడ్‌ 9–0–59–1, స్టోక్స్‌ 6–0– 29–1, అలీ 6–0–42–1, రషీద్‌ 10–0–49–0.  

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (సి) కమిన్స్‌ (బి) బెహ్రన్‌డార్ఫ్‌ 27; విన్స్‌ (బి) బెహ్రన్‌డార్ఫ్‌ 0; రూట్‌ (ఎల్బీ) (బి) స్టార్క్‌ 8; మోర్గాన్‌ (సి) కమిన్స్‌ (బి) స్టార్క్‌ 4; స్టోక్స్‌ (బి) స్టార్క్‌ 89; బట్లర్‌ (సి) ఖాజా (బి) స్టొయినిస్‌ 25; వోక్స్‌ (సి) ఫించ్‌ (బి) బెహ్రన్‌డార్ఫ్‌ 26; అలీ (సి) క్యారీ (బి) బెహ్రన్‌డార్ఫ్‌ 6; రషీద్‌ (సి) స్టొయినిస్‌ (బి) స్టార్క్‌ 25; ఆర్చర్‌ (సి) వార్నర్‌ (బి) బెహ్రన్‌డార్ఫ్‌ 1; వుడ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (44.4 ఓవర్లలో ఆలౌట్‌) 221.  

వికెట్ల పతనం: 1–0, 2–15, 3–26, 4–53, 5–124, 6–177, 7–189, 8–202, 9–211, 10–221.

బౌలింగ్‌: బెహ్రన్‌డార్ఫ్‌ 10–0–44–5, స్టార్క్‌ 8.4–1–43–4, కమిన్స్‌ 8–1–41–0, లయన్‌ 9–0–43–0, స్టొయినిస్‌ 7–0–29–1, మ్యాక్స్‌వెల్‌ 2–0–15–0.

బెహ్రన్‌డార్ఫ్‌

7: ప్రపంచకప్‌లో ఒకే జట్టుపై రెండు సెంచరీలు చేసిన ఏడో బ్యాట్స్‌మన్‌గా ఆరోన్‌ ఫించ్‌ గుర్తింపు పొందాడు. డివిలియర్స్‌ అత్యధికంగా వెస్టిండీస్‌పై మూడు సెంచరీలు నమోదు చేశాడు. సచిన్‌ టెండూల్కర్‌ (కెన్యాపై), బ్రియాన్‌ లారా (దక్షిణాఫ్రికాపై), గంగూలీ (కెన్యాపై), స్కాట్‌ స్టయిరిస్‌ (శ్రీలంకపై), రికీ పాంటింగ్‌ (భారత్‌పై) రెండేసి సెంచరీలు సాధించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement