సమఉజ్జీల సమరం | Cricket World Cup 2019 Australia vs England | Sakshi
Sakshi News home page

సమఉజ్జీల సమరం

Published Tue, Jun 25 2019 5:00 AM | Last Updated on Tue, Jun 25 2019 5:00 AM

Cricket World Cup 2019 Australia vs England - Sakshi

మోర్గాన్‌, ఫించ్‌

లార్డ్స్‌: క్రికెట్‌ మక్కాగా పిలవబడే లార్డ్స్‌ మైదానం సమఉజ్జీల సమరానికి వేదిక కానుంది. ప్రపంచ కప్‌లో భాగంగా నేడు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు తలపడనుంది. ఇంగ్లండ్‌పై గెలిచి సెమీస్‌ బెర్త్‌ను సొంతం చేసుకోవాలని ఆసీస్‌.. శ్రీలంక చేతిలో ఎదురైన అనూహ్య పరాజయాన్ని మర్చిపోయి మళ్లీ విజయాల బాట పట్టాలని ఇంగ్లండ్‌ భావిస్తున్నాయి. 1992 తర్వాత ప్రపంచ కప్‌ వేదికపై ఆస్ట్రేలియాను ఇంగ్లండ్‌ ఇప్పటి వరకు ఓడించలేదు. గత రికార్డులతో సంబంధం లేకుండా ఈ మ్యాచ్‌లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగి విజయం సాధించాలనే లక్ష్యంతో మోర్గాన్‌ బృందం ఉంది. ఏదేమైనా రెండు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో నేటి మ్యాచ్‌ ప్రేక్షకులను కనువిందు చేయడం ఖాయం.

ఓపెనర్ల బెంగ..
ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ తొడ కండరాల గాయంతో దూరమైనప్పటి నుంచి ఇంగ్లండ్‌కు ఓపెనింగ్‌ బెంగ మొదలైంది. రాయ్‌ స్థానంలో వచ్చిన విన్స్‌ గత రెండు మ్యాచ్‌లలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. అయితే సోమవారం చేసిన స్కానింగ్‌లో రాయ్‌ గాయం తగ్గిందని నిర్ధారణ అయింది. అదే విధంగా రాయ్‌ సోమవారం నెట్స్‌లో సాధన కూడా చేశాడు. ఆసీస్‌పై 47.43 సగటుతో 759 పరుగులు చేసిన ఈ ఓపెనర్‌కు మంచి రికార్డుంది. నేటి మ్యాచ్‌లో రాయ్‌ బరిలోకి దిగితే ఇంగ్లండ్‌ ఓపెనింగ్‌ కష్టాలు తీరినట్టే.  

గెలుపు తప్పనిసరి...
శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలో దిగిన ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌ చేరే సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. శ్రీలంకపై బెన్‌ స్టోక్స్‌ ఒంటరి పోరాటం చేసినా ఇతర సభ్యుల నుంచి సహకారం లభించకపోవడంతో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ప్రస్తుతం 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిని గెలవాల్సిన పరిస్థితి. ఒక మ్యాచ్‌ గెలిచినా వెళ్తుంది కానీ అప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఈ ప్రపంచ నంబర్‌వన్‌  జట్టుకు ఏర్పడుతుంది. అయితే ఇంగ్లండ్‌ తమ తదుపరి మ్యాచ్‌లను పటిష్టమైన ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్‌లతో ఆడాలి. ఇటువంటి పరిస్థితిల్లో నేడు జరిగే ఆస్ట్రేలియా చేతిలో ఓడితే ఇంగ్లండ్‌ పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. అదే విధంగా స్లో వికెట్‌లపై తడబడుతుండటం మోర్గాన్‌ సేనకు ప్రతికూలాంశం.  

ఆత్మవిశ్వాసంతో కంగారులు...
మరోవైపు టోర్నీలో కేవలం భారత్‌ చేతిలో మాత్రమే ఓడిన ఆస్ట్రేలియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఓటమి అనంతరం హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసిన కంగారులు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నారు. వార్నర్, ఫించ్‌లు సూపర్‌ ఫామ్‌లో ఉండడం, స్మిత్, ఖాజాలు నిలకడగా రాణిస్తుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. చివర్లో ఫినిష్‌ చేయడానికి మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, క్యారీలు ఉండనే ఉన్నారు. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో 381 పరుగులు చేసినా కేవలం 48 పరుగులతో గెలవడంతో బౌలింగ్‌పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఆసీస్‌కు ఏర్పడింది. మిచెల్‌ స్టార్క్‌ (15 వికెట్లు), కమిన్స్, కూల్టర్‌ నైల్‌ రాణిస్తున్నా లెగ్‌ స్పిన్నర్‌ జంపా మాత్రం భారీగా పరుగులిస్తుండటం ఆసీస్‌ను ఇబ్బంది పెట్టే అంశం. అతని స్థానంలో నాథన్‌ లయన్‌కి చాన్స్‌ దొరికే అవకాశం ఉంది.

పిచ్, వాతావరణం
బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై గత మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 308 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 259 పరుగులు చేసింది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. లార్డ్స్‌లో మంగళవారం వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చిరుజల్లులు కురిసినా మ్యాచ్‌కు వర్షం ఆటంకం కాకపోవచ్చు.

 
ముఖాముఖి రికార్డు
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటివరకు 147 వన్డేలు జరిగాయి. ఇంగ్లండ్‌ 81 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 61 మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండు మ్యాచ్‌లు ‘టై’కాగా... మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు ఇంగ్లండ్, ఐదుసార్లు ఆస్ట్రేలియా గెలిచాయి.  

ఇంగ్లండ్‌ నెట్స్‌లో అర్జున్‌ టెండూల్కర్‌
ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న ఇంగ్లండ్‌కు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ తనవంతు సహాయం చేశాడు. సోమవారం జరిగిన నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్స్‌లో అర్జున్‌ ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేశాడు. ఎడంచేతి ఫాస్ట్‌ బౌలర్‌ అయిన అర్జున్‌ ఇంగ్లండ్‌ స్పిన్‌ సలహాదారుడు సక్లాయిన్‌ ముస్తాక్‌ పర్యవేక్షణలో బౌలింగ్‌ చేశాడు.

ఇంగ్లండ్‌ జట్టుకు నెట్స్‌లో బౌలింగ్‌ చేయడం అర్జున్‌కు కొత్తేం కాదు. ఇది వరకు 2015 యాషెస్‌ సందర్భంగా కూడా అర్జున్‌ ఇంగ్లండ్‌కు నెట్స్‌లో బౌలింగ్‌ చేశాడు. ఇటీవల మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ)తరపున బరిలో దిగిన 19 ఏళ్ల అర్జున్‌.. సర్రే సెకండ్‌ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. 11 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకున్నాడు.   

జట్లు (అంచనా)
ఇంగ్లండ్‌: మోర్గాన్‌     (కెప్టెన్‌), బెయిర్‌స్టో, విన్స్‌/జేసన్‌ రాయ్, జో రూట్, బెన్‌ స్టోక్స్, బట్లర్, మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్, ఆదిల్‌ రషీద్, ఆర్చర్, ప్లంకెట్‌/వుడ్‌.

ఆస్ట్రేలియా: ఫించ్‌        (కెప్టెన్‌), వార్నర్, ఖాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, అలెక్స్‌ క్యారీ, కూల్టర్‌ నైల్, కమిన్స్, స్టార్క్, జంపా/నాథన్‌ లయన్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement