ఇంగ్లండ్‌ అదరహో | England beat Bangladesh by 106 runs at Cricket World Cup | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ అదరహో

Published Sun, Jun 9 2019 5:18 AM | Last Updated on Sun, Jun 9 2019 8:31 AM

England beat Bangladesh by 106 runs at Cricket World Cup - Sakshi

జేసన్‌ రాయ్‌

కార్డిఫ్‌: పాకిస్తాన్‌తో ఎదురైన షాక్‌ నుంచి ఇంగ్లండ్‌ వెంటనే తేరుకుంది. శనివారం జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ భరతం పట్టింది. 106 పరుగుల తేడాతో ఘన  విజయం సాధించింది. విధ్వంసక ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (121 బంతుల్లో 153; 14 ఫోర్లు, 5 సిక్స్‌లు) బంగ్లా బౌలింగ్‌ను చీల్చి చెండాడటంతో మొదట ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 386 పరుగులు చేసింది. బట్లర్‌ (44 బంతుల్లో 64; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెయిర్‌స్టో (50 బంతుల్లో 51; 6 ఫోర్లు) రాణించారు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 48.5 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (119 బంతుల్లో 121; 12 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్, స్టోక్స్‌ చెరో 3 వికెట్లు తీశారు. జేసన్‌ రాయ్‌కి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.  

రాయ్‌ వీర విహారం...
టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొలి ఓవర్లో ఒక పరుగు మాత్రమే చేసింది. తర్వాత నుంచి జేసన్‌ రాయ్, బెయిర్‌స్టో దూకుడుతో స్కోరుబోర్డు పరుగుపెట్టింది. ముఖ్యంగా రాయ్‌ నిలదొక్కుకున్నాక షాట్లపై కన్నేశాడు. లాంగాన్, డీప్‌ మిడ్‌ వికెట్, లాంగాఫ్, కవర్స్, ఎక్స్‌ట్రా కవర్స్‌ ఇలా మైదానంలో ఏ ప్రాంతాన్ని వదలకుండా కళ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన జేసన్, బెయిర్‌స్టోతో కలిసి తొలి వికెట్‌కు 128 పరుగులు జోడించి ఘనమైన ఆరంభాన్నిచ్చాడు. బెయిర్‌స్టో ఫిఫ్టీ కాగానే ఔటయ్యాడు. రూట్‌ (21) పెద్దగా పరుగులు చేయలేదు.

బట్లర్‌ రాకతో మళ్లీ పరుగుల ప్రవాహం జోరందుకుంది. రాయ్‌ 92 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకోగా, జట్టు 30.4ఓవర్లలోనే 200 స్కోరు చేసింది. సెంచరీ తర్వాత జేసన్‌ సిక్సర్లతో విరుచుకుపడటంతో అతడి డబుల్‌ సెంచరీ ఖాయమనిపించింది. అయితే మెహదీహసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌ వరుసగా 6, 6, 6 కొట్టిన రాయ్‌ మరో భారీషాట్‌ కొట్టే ప్రయత్నంలో నిష్క్ర మించాడు. కెప్టెన్‌ మోర్గాన్‌ 35 పరుగులు చేయగా, స్టోక్స్‌ (6) విఫలమయ్యాడు. చివర్లో ప్లంకెట్‌ (9 బంతుల్లో 27 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), వోక్స్‌ (18 నాటౌట్‌) 17 బంతుల్లో 45 పరుగులు జోడించారు.  

షకీబ్‌ పోరాటం...
అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఆరంభంలోనే ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌ (2) వికెట్‌ను కోల్పోయింది. ఈ  దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షకీబ్‌ అల్‌ హసన్‌ చక్కని పోరాటం చేశాడు. ముందుగా ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (19)తో కలిసి రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. తర్వాత ముష్ఫీకర్‌ రహీమ్‌ (50 బంతుల్లో 44; 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన షకీబ్‌ 53 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. షకీబ్, రహీమ్‌ జోడీ మూడో వికెట్‌కు 106 పరుగులను జతచేసింది. మొహమ్మద్‌ మిథున్‌ (0) డకౌట్‌ కాగా... మహ్మూదుల్లా (28) అండతో షకీబ్‌ 95 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇతని పోరాటానికి స్టోక్స్‌ బౌలింగ్‌లో చుక్కెదురైంది. తర్వాత వచ్చిన వారిలో మొసద్దిక్‌ 26, మెహదీహసన్‌ మిరాజ్‌ 12 పరుగులు చేశారు.
 



స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) మొర్తజా (బి) మిరాజ్‌ 153; బెయిర్‌స్టో (సి) మిరాజ్‌ (బి) మొర్తజా 51; రూట్‌ (బి) సైఫుద్దీన్‌ 21; బట్లర్‌ (సి) సర్కార్‌ (బి) సైఫుద్దీన్‌ 64; మోర్గాన్‌ (సి) సర్కార్‌ (బి) మిరాజ్‌ 35; స్టోక్స్‌ (సి) మొర్తజా (బి) ముస్తఫిజుర్‌ 6; వోక్స్‌ (నాటౌట్‌) 18; ప్లంకెట్‌ (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 386.

వికెట్ల పతనం: 1–128, 2–205, 3–235, 4–330, 5–340, 6–341. 
బౌలింగ్‌: షకీబ్‌ 10–0–71–0, మొర్తజా 10–0–68–1, సైఫుద్దీన్‌ 9–0–78–2, ముస్తఫిజుర్‌ 9–0–75–1, మిరాజ్‌ 10–0–67–2, మొసద్దిక్‌ 2–0–24–0.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తమీమ్‌  (సి) మోర్గాన్‌ (బి) వుడ్‌ 19, సౌమ్య సర్కార్‌ (బి) ఆర్చర్‌ 2; షకీబ్‌ (బి) స్టోక్స్‌ 121; రహీమ్‌ (సి) రాయ్‌ (బి) ప్లంకెట్‌ 44; మిథున్‌ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్‌ 0; మహ్మూదుల్లా  (సి) బెయిర్‌స్టో (బి) వుడ్‌ 28, మొసద్దిక్‌ (సి) ఆర్చర్‌ (బి) స్టోక్స్‌ 26; సైఫుద్దీన్‌ (బి) స్టోక్స్‌ 5; మిరాజ్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఆర్చర్‌ 12; మొర్తజా (నాటౌట్‌) 4; ముస్తఫిజుర్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఆర్చర్‌ 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్‌) 280.

వికెట్ల పతనం: 1–8, 2–63, 3–169, 4–170, 5–219, 6–254, 7–261, 8–264, 9–280, 10–280.

బౌలింగ్‌: వోక్స్‌ 8–0–67–0, ఆర్చర్‌ 8.5–2– 29–3, ప్లంకెట్‌ 8–0–36–1, వుడ్‌ 8–0–52–2, రషీద్‌ 10–0–64–1, స్టోక్స్‌ 6–1–23–3.

1 వన్డేల్లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో 300పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా (వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో) పేరిట ఉన్న రికార్డును ఇంగ్లండ్‌ సవరించింది.  
386 ప్రపంచకప్‌ చరిత్రలో ఇంగ్లండ్‌ జట్టుకిదే అత్యధిక స్కోరు. 2011 కప్‌లో బెంగళూరులో భారత్‌పై ఇంగ్లండ్‌ నమోదు చేసిన 338/8 స్కోరు తెరమరుగైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement