ఆస్ట్రేలియా అండర్ 19 క్రికెటర్ ఎడ్వర్డ్స్
క్రిస్ట్‌చర్చ్: అండర్-19 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్లోకి ప్రవేశించింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా యువ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. అఫ్గానిస్తాన్ విసిరిన 182 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 37.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో తొలిసారి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరాలనుకున్న అఫ్గాన్ ఆశలకు గండి పడింది. ఆసీస్ ఓపెనర్ జాక్ ఎడ్వర్డ్(72;65 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అటు తరువాత కెప్టెన్ జాసన్ సంగా(26) ఫర్వాలేదనిపించగా, పరమ్ ఉప్పల్(32 నాటౌట్), నాథన్ మెక్ స్వీనీ(22 నాటౌట్) సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ను 181 పరుగులకే ఆసీస్ కట్టడి చేసింది.అఫ్గాన్ ఆటగాళ్లలో ఇక్రమ్ అలీ ఖిల్(80) మినహా మిగతా వారు తీవ్రంగా నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో జొనాథాన్ మెర్లో నాలుగు వికెట్లతో రాణించగా,ఇవాన్స్‌కు రెండు వికెట్లు లభించాయి. ఇక హ్యాడ్లీ, ఎడ్వర్డ్స్, సదర్లాండ్, పోప్‌లకు తలో వికెట్ దక్కింది. మంగళవారం భారత్-పాకిస్తాన్‌ల రెండో సెమీస్ విజేతతో ఆసీస్ ఫైనల్లో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment