భారత యువ జట్టు అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో ఏ జట్టు సాధ్యం కాని ఓ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మెగా టోర్నీ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 200 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయాలు సాధించిన తొలి జట్టుగా యువ భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎడిషన్‌లో యంగ్ ఇండియా తొలుత గ్రూప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 201 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
అనంతరం గ్రూప్ మ్యాచెస్‌లో భాగంగానే యూఎస్‌ఏను సైతం అదే 201 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీని తర్వాత సూపర్ సిక్స్ దశ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 214 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 200 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలుపొందిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.
ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత్.. అనధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. యంగ్ ఇండియా తమ తదుపరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో (ఫిబ్రవరి 2) నేపాల్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే భారత్ అధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.
కాగా, ఈ టోర్నీలో యువ భారత్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తూ సంచలనాలు సృష్టిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో ముషీర్ ఖాన్ (సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు) లీడింగ్ రన్ స్కోరర్‌గా (4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 325 పరుగులు) కొనసాగుతుండగా.. బౌలింగ్ విభాగంలో సౌమీ పాండే లీడింగ్ వికెట్ టేకర్‌గా (4 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు) కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment