హైదరాబాద్ రీజియన్‌కు హాకీ టైటిల్
రాయదుర్గం: జాతీయ స్థాయి కేంద్రీయ విద్యాలయాల అండర్-19 మహిళల పోటీల్లో హైదరాబాద్ రీజియన్ హాకీ జట్టు మళ్లీ చాంపియన్‌షిప్ నిలబెట్టుకుంది. వరుసగా ఏడోసారి పసిడి పతకం సాధించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్ రీజియన్‌కు ఆడిన 11 మంది క్రీడాకారులు గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయ విద్యార్థులే కావడం విశేషం. ఏకపక్షంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ 10-0 గోల్స్‌తో ముంబై రీజియన్‌పై ఘనవిజయం సాధించింది.
ఈ టోర్నీలో గీతాసాగర్ 24 గోల్స్ చేసింది. అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో అక్షయ చాంపియన్‌గా నిలిచింది. 200 మీటర్ల పరుగులో ఆమె రజతం నెగ్గింది. 400 మీటర్ల హర్డిల్స్, 400 మీటర్ల రిలేలో హఫీజా రజత పతకాలు గెలుచుకుంది. 100 మీటర్ల హార్డిల్స్‌లో ఆమె కాంస్యం గెలిచింది. 100 మీటర్ల బటర్ ఫ్లయ్‌లో కావ్యశ్రేయ కాంస్య పతకం సాధించింది. ఈ పోటీల్లో పతకాల పంట పండించిన నగర విద్యార్థినులను స్కూల్ వర్గాలు ఘనంగా సత్కరించాయి. గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు విజేతలను అభినందించారు. పీఈటీ విజయభాస్కర్‌రెడ్డి, హకీ కోచ్ రాంబాబు, త్రోబాల్ కోచ్ అవినాష్‌లను కూడా సన్మానించారు.