ఆ డ్రోన్ను పట్టిస్తే లక్ష
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంపై అనుమానాస్పదంగా పలుమార్లు చక్కెర్లు కొట్టిన డ్రోన్ వివరాలను వెల్లడిస్తే రూ.లక్ష ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ విషయంలో ఎంత త్వరగా సమాచారం అందిస్తే అంత సహాయం చేసినట్లవుతుందని అన్నారు. గత అక్టోబర్ 27న ఓ డ్రోన్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో నాలుగైదు సార్లు కనిపించింది.
అది పలు అనుమానాలు రేకెత్తించింది. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అది వ్యతిరేక చర్య కావడంతోపాటు ఇటీవల ఉగ్రవాదులు ఎక్కువగా డ్రోన్ లతోనే రెక్కీలు నిర్వహిస్తున్నారని తెలుస్తుండటంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే కేసును నమోదుచేసి విచారణ చేపట్టిన ఇప్పటి వరకు ఆధారాలు గుర్తించలేకపోయారు. డ్రోన్ పంపించిన వారికోసం మేధావులతో చాలాసార్లు సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో తాజాగా లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.