Reporate
-
RBI repo rate hike షాకింగ్ న్యూస్: ఇక ఈఎంఐల బాదుడే బాదుడు!
సాక్షి,ముంబై: ఈఎంఐలు కట్టే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 6.25 శాతం ఉన్న కీలకమైన రెపోరేటును 6.50 శాతానికి పెంచింది. దీని ప్రభావం అన్నిరకాల లోన్లపైనా పడనుంది. కార్లు, వివిధ రకాల వాహనాల లోన్లు, వ్యక్తిగత, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. తాజా రెపో రేటు పెంపుతో అన్ని రకాల లోన్లపై రుణ భారం సుమారు 2-4 శాతం వరకు పెరగనుంది. దీంతో ఖాతాదారులపై ఈఎంఐల భారం మరింత పెరగనుంది. అయితే ఈ భారం నుంచి కాస్త ఊరట కలగాలంటే.. అవకాశం ఉన్న రుణగ్రహీతలు లేదా వారి రుణాలను తిరిగి చెల్లించడానికి అదనపు నగదు చెల్లింపును లేదా ఈఎంఐ భారాన్ని భరించలేని వారు రుణకాలాన్ని పొడిగించుకోవడమో చేయాల్సి ఉంటుంది. కొత్తగా లోన్లు తీసుకునే వారితో పాటు ఇప్పటికే ఈఎంఐలు చెల్లిస్తున్నవారు కూడా పెరిగిన వడ్డీ రేట్లకు అనుగుణంగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ తీసుకునే వడ్డీ శాతాన్నే రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. అదుపులో ఉన్నప్పుడు తగ్గిస్తుంది లేదా అదే రేటును కొనసాగిస్తుంది. ఆర్బీఐ రెపో రేటు పెంచితే.. బ్యాంకులకు వడ్డీ భారంగా మారుతుంది. దీంతో బ్యాంకులు ఆ భారాన్ని నేరుగా ఖాతాదారుల మీదకు మళ్లించి ఆ మేరకు వడ్డీలను వసూలు చేస్తాయి. ఆర్బీఐ నిర్ణయం తర్వాత.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాల వడ్డీ రేట్ల బాదుడుకు సిద్ధపడతాయి. అయితే ఈ మేరకు ఖాతాదారుల డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీరేటు కూడా పెరగ నుంది (ఇదీ చదవండి: సామాన్యులపై ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ) -
సామాన్యులకు ఆర్బీఐ మరో భారీ షాక్!
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో దఫా కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు– ప్రస్తుతం 6.25 శాతం)ను సమీప కాలంలో మరో పావుశాతం పెంచుతుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. దీనితో ఈ రేటు 6.5 శాతానికి పెరుగుతుందన్న అంచనాలను వెలువరించారు. సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ సదస్సులో ఆయన మాట్లాడుతూ, కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపు ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. తొలుత 6 శాతానికి, అటుపై నాలుగు శాతానికి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి కృషి చేస్తామని బుధవారం పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ చేసిన వ్యాఖ్యలను కోటక్ ఉటంకించారు. ప్రపంచ పరిణామాలు, చమురు ధరలు తదితర అంశాలు ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోందన్నారు. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు సూచనలతో ఇతర సెంట్రల్ బ్యాంకులూ ఇదే అనుసరించడానికి సిద్ధమవుతున్నాయని అన్నారు. ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఆర్బీఐ మే నుంచి రెపో రేటును ఐదు దఫాల్లో 2.25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఎకానమీ పురోగతికి అవకాశాలు... భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత గురించి కోటక్ మాట్లాడుతూ దేశం సుమారు 3.2 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని అన్నారు. మరింత పురోగతికి అవకాశాలు ఉన్నాయని సూచించారు. ప్రపంచంలోని మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా నిలిచేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రపంచ స్థాయి భారత్ కంపెనీలను అభివృద్ధి చేసే బాటలో, అత్యాధునిక ఉత్పత్తి ఆవిష్కరణలు, మేథో హక్కుల (ఐపీ) అభివృద్ధి సాధన, దీని ప్రాతిపదికన తయారీలో అంతర్జాతీయ స్థాయిని సాధించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. విధానాల అమలు ముఖ్యం: సంజీవ్ బజాజ్ కార్యక్రమంలో బజాజ్ ఫిన్సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నిరంతర పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. కొత్త ఉత్పాదక సామర్థ్యాలను అభివృద్ధి చేసే అంశం... వాగ్దానాలకంటే విధానాల అమలుపై ఆధారపడి ఉంటుందని అన్నారు. భారత్‌ను 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి సంబంధించి ఆయన నాలుగు కీలక సూచనలు చేశారు. పరిశ్రమ –వాణిజ్య విధానాల పరస్పర పురోగతికి చర్యలు, పటిష్ట ఫైనాన్షియల్ వ్యవస్థ స్థాపన, ప్రజల సామర్థ్యాన్ని పెంపొందించడానికి విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను పెంచడం, ఉత్పత్తి ఆధారిత స్కీమ్ (పీఎల్ఐ)ను కార్మిక ప్రభావిత రంగాలకు విస్తరించడం ద్వారా ఎకానమీలో తయారీ రంగం వాటా విస్తరణ వీటిలో ఉన్నాయి. -
ఖాతాదారులకు హెచ్డీఎఫ్సీ శుభవార్త
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. కోవిడ్ విజృంభణ సమయంలో అత్యధికంగా వడ్డీ చెల్లించేలా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ స్కీమ్ గడువును పెంచుతున్నట్లు తెలిపింది. సీనియర్ సిటిజన్ల కోసం హెచ్డీఎఫ్సీ మే 18, 2020లో ‘సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ’ అనే స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఆ ఎఫ్డీ పథంలో చేరిన ఖాతాదారులకు .. సాధారణ డిపాజిట్ల కంటే ఎక్కువగా వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఆ పథకంలో చేరే గడువు సెప్టెంబర్ 30,2022తో ముగియగా..తాజాగా ఆ గడువును మార్చి 31,2023 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. 0.25శాతం అదనపు వడ్డీతో మే 18, 2020 నుండి మార్చి 31, 2023 మధ్య కాలంలో సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీలో చేరిన ఖాతాదారులకు ఐదేళ్ల టెన్యూర్, లేదంటే ఒక రోజు నుంచి 10 ఏళ్ల టెన్యూర్ కాలానికి రూ.5కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.25శాతం అదనంగా వడ్డీ చెల్లిస్తామని తెలిపింది. తేడా ఎంతంటే ఐదు సంవత్సరాలు, ఒక రోజు నుండి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు సాధారణ వడ్డీ రేటు 5.75 శాతం అందిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్డ్ డిపాజిట్ కింద అదనంగా 6.50 శాతం వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లు పొందుతారు. టెన్యూర్ లోపు డ్రా చేస్తే అయితే, పైన పేర్కొన్నట్లుగా ఐదేళ్లలోపు డిపాజిట్లను ప్రీ క్లోజ్ చేసుకుంటే బ్యాంకు లబ్ధి దారులకు చెల్లించే వడ్డీరేటులో ఒకశాతం తగ్గుతుందని, లేదా డిపాజిట్ ఉన్న కాలానికి వర్తించే బేస్ రేటు ఉంటుందని బ్యాంక్ తెలిపింది. చదవండి👉 బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కంపెనీలు.. మాఫీ అయిన లక్షల కోట్ల జాబితా ఇదే! -
రెపోరేటు పెంచిన ఆర్బీఐ : హోమ్ లోన్లపై వడ్డీ రేట్ల బాదుడు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను 0.5 శాతం( 50 బేసిస్) పెంచింది. సెప్టెంబర్ 28న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ప్రారంభం కాగా..సెప్టెంబర్ 30న ముగిసింది. ఆర్బీఐ రెపోరేట్లను పెంచడం కారణంగా..బ్యాంకులు రుణ గ్రస్తులకు ఇచ్చే లోన్లపై వడ్డీ రేట్లను పెంచనున్నాయి. అదే జరిగితే కార్ల లోన్లు, పర్సనల్, హోమ్ లోన్లు మరింత భారం కానున్నాయి. అయితే ఇప్పుడు రెపో రేట్ల పెరుగుదలతో రుణగ్రస్తులపై హోమ్ లోన్ భారం ఏ విధంగా పడుతుందో తెలుసుకుందాం. రెండు ఆప్షన్లు ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ రెపో రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇంటి కోసం రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి రుణ భారం కాకుండా ఉండేందుకు రెండు ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఈఎంఐ కాల వ్యవధిని పెంచుకోవడం, రెండవది ప్రతి నెలా కట్టే ఈఎంఐ మొత్తాన్ని పెంచుకోవడం. హోమ్ లోన్ భారం ఎంతంటే ఉదాహరణకు..ఓ వ్యక్తి గతంలో 8.12 శాతం వడ్డీతో 20 సంవత్సరాల టెన్యూర్ కాలానికి బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం తీసుకున్నారు. అయితే తాజాగా రెపోరేట్లు పెరిగాయి కాబట్టి సదరు వ్యక్తి తీసుకున్న రుణ టెన్యూర్ కాలం ఆటో మెటిగ్గా 2 సంవత్సరాల 3 నెలలకు పెరిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ మొత్తానికి 8.62 శాతం వడ్డీతో రూ.50 లక్షలకు అదనంగా రూ.11 లక్షలు అదనంగా వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆర్బీఐ కేవలం పెంచిన 5 నెలల వ్యవధి రెపోరేటు 1.90 శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే వడ్డీ కలుపుకొని 20 సంవత్సరాల టెన్యూర్ కాలానికి రూ.50 లక్షలు తీసుకుంటే..రూ. 59 లక్షలు చెల్లించాలి. ఒక వేళ ఈఎంఐని పెంచితే ఒక వేళ నెలవారి చెల్లించే ఈఎంఐని పెంచినా అదే భారాన్ని రుణ గ్రహిత మోయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, 20 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 50 లక్షల రుణంపై మీరు గతంలో నెలకు చెల్లించే రూ.37,929 ఈఎంఐతో పోలిస్తే తాజా పెరిగిన 1.9 శాతం రెపో రేట్ల కారణంగా రూ. 43,771 ఈఎంఐని చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ రూ.5,842కి పెరుతుంది. చదవండి: లబోదిబో! హైదరాబాద్‌లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే! -
పెట్రోలు,డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం..తగ్గింపుకు ఒప్పుకోని కేంద్రం! ఆర్బీఐ ప్రయత్నం విఫలం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణం కట్టడికి తప్పనిసరి పరిస్థితుల్లోనే రెపో రేటును 0.4 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని అరశాతం పెంచిందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ వర్గాల కథనం ప్రకారం, పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని అలాగే పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఇతర సరఫరా వైపు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఆర్బీఐ ప్రయత్నించి విఫలమైంది. ఆయా అంశాలే ఆర్బీఐ అర్థాంతర, ఆశ్చర్యకరమైన రేటు పెంపును ప్రేరేపించాయి. ఆర్బీఐ అనూహ్యరీతిలో బుధవారం బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీనితో ఈ రేటు 4.4 శాతానికి చేరింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది. గడచిన 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. దీనితోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని కట్టడి చేసి తద్వారా ద్రవ్యోల్బణం రెక్కలను తొలగించాలన్నది ఈ ఇన్‌స్ట్రమెంట్ల ప్రధాన ఉద్దేశ్యం. ద్రవ్యోల్బణంపై నిర్దేశాలు కీలకం... ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య ఉండాలి. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ఏప్రిల్ మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు ఇటీవలి కాలంలో మరింత స్పష్టమవుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌సహా కమోడిటీ ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. దీనితో పాటు వ్యవస్థ నుంచి ఈజీ మనీ ఉపసంహరణలో భాగంగా అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు (ఒక శాతానికి) వంటి పలు అంశాలు దేశంలో వడ్డీరేట్లు పెంచాల్సిన పరిస్థితిని సృష్టించాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది కీలకం. ఆయా పరిణామాల అన్నింటి నేపథ్యంలో ఆర్బీఐ తాజా అనూహ్య నిర్ణయం తీసుకుంది. జూన్ తొలి వారంలో జరిగే పాలసీ సమావేశాల్లో రెపోను మరో 0.5% పెంచవచ్చన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. దేశీయ పరిస్థితులు.. అంతర్జాతీయ పరిస్థితులు దేశీయంగా ద్రవ్యోల్బణానికి రెక్కలు తీసుకువచ్చే పరిస్థితి నెలకొంది. ‘‘దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధి లక్ష్యంతోనే తాజా రెపో రేటు పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థిరంగా కొనసాగే అధిక ద్రవ్యోల్బణం పొదుపు, పెట్టుబడి, పోటీతత్వం ఉత్పాదక వృద్ధిని అనివార్యంగా దెబ్బతీస్తుంది. ఇది పేద జనాభా వర్గాల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుంది. ఇది ఎకానమీలో తీవ్ర ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది’’ అని పాలసీ సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యాఖ్యానించడం గమనార్హం. మార్చి 22 నుండి ప్రారంభమైన 16 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలలో లీటరుకు రికార్డు స్థాయిలో రూ.10 పెరిగింది. ఇది ఇప్పటికే ఉన్న అధిక వస్తువుల ధరలకు మరింత ఆజ్యం పోసింది. ఇక తప్పదన్న పరిస్థితుల్లోనే ఆర్బీఐ కఠిన నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని మరింత తగ్గించడం వంటి చర్యల కోసం ఆర్బీఐ ప్రభుత్వాన్ని ‘‘వేడుకుంది, ఉద్బోధించింది‘, కానీ ప్రతిస్పందనను పొందలేకపోయిందని ఆ వర్గాలు తెలిపాయి. భారీ సుంకాలను విధిస్తున్న రాష్ట్రాలనూ ఈ విషయంలో దూకుడు తగ్గించమని ఆర్బీఐ కోరిందని, ఇక్కడి నుంచి కూడా తగిన స్పందన రాలేదని ఆ వర్గాలు వెల్లడించాయి. దీనికి ఇక ఆర్బీఐ ద్రవ్యోల్బణం కట్టడికి సంబంధించి తన పనిలో తాను ఒంటరిగా నడిచిందని వివరించింది. ఎన్నికల తర్వాత ఒత్తిడి... ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధనంపై ధరల పెంపు ప్రారంభమైంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల పాటు యథాతథ రేటు కొనసాగింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు గతేడాది కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఎక్సైజ్‌ను తగ్గించాయి, అయితే చాలా ఇతర రాష్ట్రాలు ఈ దిశలో చర్యలు తీసుకోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటీవల రాష్ట్రాలకు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని ఉద్బోధించారు. అయినా పెద్దగా ఫలితం లభించలేదు. దీనితో వ్యవస్థలో వడ్డీరేట్ల పెంపు, తద్వారా డిమాండ్ కట్టడితో ద్రవ్యోల్బణం కట్టడి చర్యలకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. రూ.14 లక్షల కోట్ల సమీకరణ ప్రణాళికలు... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 14 లక్షల కోట్లకుపైగా స్థూల ప్రభుత్వ రుణ సమీకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్న దృఢ నిశ్చయంలో ఆర్బీఐ ఉందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అయితే ఇక్కడ రుణ సమీకరణ కార్యక్రమాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ‘కేవలం నిధుల’ పరిమాణంలో చూడరాదని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) రుణ సమీకరణ 6.8 శాతంగా ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం 5 శాతానికి చేరిన విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ఆ వర్గాలు సూచించాయి. 2022–23 ఆర్థిక సంవత్స రంలో తన వ్యయాల కోసం కేంద్రం రుణ సమీకరణల లక్ష్యం రూ.11,58,719 కోట్లు. స్థూల రుణాలు ఆర్థిక సంవత్సరంలో రూ.14,95,000 కోట్లుని బడ్జెట్ అంచనా. స్థూల రుణాల్లో గత రుణాల రీ పేమెంట్లు కలిసి ఉంటాయి. డేటెడ్ సెక్యూరిటీలు (బాండ్లు), ట్రెజరీ బిల్లుల ద్వారా ప్రభుత్వ తన ద్రవ్యలోటుకు నిధులను సమకూర్చుకుంటుంది. బ్యాంకింగ్ రుణ వృద్ధికి బ్రేకులు: ఇండియా రేటింగ్స్ ఆర్బీఐ అనూహ్య నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థ రుణ వృద్ధిపై ప్రభావం చూపుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో వ్యవసాయ, రిటైల్ విభాగాల నుంచి రుణ వృద్ధి ఉన్నప్పటికీ, పరిశ్రమ, సేవల విభాగాల నుంచి డిమాండ్ ఉంటుందని వివరించింది. నివేదిక ప్రకారం, మధ్యకాలికంగా చూస్తే, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా చైన్‌లో అంతరాయాలు, బలహీనమైన వినియోగ డిమాండ్ రుణ వృద్ధి డిమాండ్ పునరుద్ధరణపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆర్బీఐ రేట్ల పెంపు నిర్ణయం రుణాలను వ్యయ భరితం చేయనుంది. స్థూల ఆర్థిక రంగంపై మరింత స్పష్టత కోసం ఎదురుచూస్తున్నందున, మూలధన వ్యయ ప్రణాళికల అమల్లో వేచిచూసే ధోరణిని అవలంభిస్తామని తాను రేటింగ్ ఇస్తున్న పలు కంపెనీలు పేర్కొన్నట్లు ఏజెన్సీ తెలిపింది. 2022 ఏప్రిల్ 8వ తేదీతో ముగిసిన కాలానికి రుణ వృద్ధి అంతకుముందు ఇదే కాలంతో పోల్చితే 5.3 శాతం నుంచి 11.2 శాతం పెరిగిందని, అయితే తాజా పెంపు రుణ వృద్ధి ఉత్సాహాన్ని నీరుగార్చే వీలుందని వివరించింది. 2022– 23లో 10 శాతం రుణ వృద్ధిని తన ఫిబ్రవరి నివేదికలో ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. అయితే ఈ అంచనాల్లో తక్షణం సంస్థ ఎటువంటి సవరణా చేయలేదు. -
రిస్క్ తక్కువ.. నాణ్యత ఎక్కువ
యాక్సిస్ షార్ట్‌టర్మ్ ఫండ్: వృద్ధికి మద్దతుగా నిలిచే లక్ష్యంతో ఆర్బీఐ ఎంపీసీ ఆగస్ట్ భేటీలో రెపో రేటులో ఎటువంటి మార్పులు చేయలేదు. అలాగే, సర్దుబాటు ధోరణినే కొనసాగించింది. లిక్విడిటీని సాధారణ స్థితికి తీసుకువచ్చే లక్ష్యంతో వేరియబుల్ రివర్స్ రెపో (వీఆర్ఆర్) మొత్తాన్ని పెంచింది. దీంతో భవిష్యత్తు వడ్డీ రేట్ల గమనంపై అనిశ్చితి కొనసాగనుంది. మోస్తరు రిస్క్ తీసుకుని, ఏడాది నుంచి మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేసుకునే వారు షార్ట్ డ్యురేషన్ (స్వల్ప కాల) ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు డెట్, మనీ మార్కెట్ సాధనాలైన కార్పొరేట్ బాండ్లు, డిబెంచరర్లు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ (సీడీలు), ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. 1–3 ఏళ్ల కాలంతో కూడిన సాధనాలను ఎంపిక చేసుకుంటాయి. ఈ విభాగంలో యాక్సిస్ షార్ట్‌టర్మ్ ఫండ్ మంచి పనితీరును చూపిస్తోంది. పనితీరు.. ఈ పథకాల రాబడుల్లో అస్థిరతలను గమనించొచ్చు. కానీ, రాబడులు అధికంగా ఉంటాయి. యాక్సిస్ షార్ట్ టర్మ్ పనితీరును గమనిస్తే స్థిరంగా కనిపిస్తుంది. వ్యాల్యూరీసెర్చ్ 4స్టార్ రేటింగ్ ఇచ్చిన పథకం ఇది. ఏడాది కాలంలో 8.9 శాతం, మూడేళ్లలో 8.5 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం ఇచ్చింది. ఐదేళ్లలో 7.52 శాతం, ఏడేళ్లలో 8 శాతం, 10 ఏళ్లలో 8.24 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఎఫ్డీ రాబడుల కంటే ఇవి మెరుగైనవే. ఈ పథకం నిర్వహణలో రూ.12,183 కోట్ల పెట్టుబడులున్నాయి. రిస్క్ విషయంలో సగటు కంటే తక్కువ విభాగంలో ఈ పథకం ఉంది. చదవండి: ప్రపంచ దేశాలకు భారత్ ఎగుమతులు, 75 రకాల ఉత్పత్తులు గుర్తింపు పోర్ట్‌ఫోలియో.. అధిక నాణ్యత, తక్కువ రిస్క్ అనే విధానాన్ని యాక్సిస్ షార్ట్ టర్మ్ ఫండ్ అనుసరిస్తుంది. ప్రస్తుతం ఏడాది కాలవ్యవధితో కూడిన కార్పొరేట్ బాండ్స్, మనీ మార్కెట్ సాధనాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఉంది. అధిక రేటింగ్ కలిగిన దీర్ఘకాల కార్పొరేట్ బాండ్స్‌లోనూ కొంత పెట్టుబడులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్వల్పకాల సాధనాలు.. సమీప కాలంలో వడ్డీ రేట్ల అస్థిరతలను అధిగమించేందుకు తోడ్పడతాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చూస్తే.. దీర్ఘకాలంతో కూడిన సాధనాల నుంచి మెరుగైన రాబడులను ఆశించొచ్చు. 2021 జూలై నాటికి పథకం పోర్ట్‌ఫోలియోలోని సాధనాల సగటు మెచ్యూరిటీ 2.90 సంవత్సరాలుగా ఉంది. విడిగా పరిశీలిస్తే.. 27 శాతం పెట్టుబడులు ఏడాది వరకు కాల వ్యవధి కలిగిన సాధనాల్లోనూ.. 39 శాతం పెట్టుబడులు 1–3 ఏళ్ల సాధనాల్లోనూ ఉన్నాయి. 3–5 ఏళ్ల కాలవ్యవధి సాధనాల్లో 11 శాతం, అంతకుమించిన కాలవ్యవధి కలిగిన డెట్ ఇన్స్ట్రుమెంట్లలో 14 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న సాధనాల నాణ్యతను పరిశీలించినట్టయితే.. ఏఏఏ రేటెడ్ పేపర్లలోనే 83 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. ఏఏఏ అనేది అధిక నాణ్యతకు సూచిక. 9 శాతం పెట్టుబడులు ఏఏప్లస్ డెట్ పేపర్లలో ఉన్నాయి. -
భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాగుంది..
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు అంచనాలను అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ తగ్గించింది. 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ 10.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని తన తాజా నివేదికలో సంస్థ అంచనావేసింది. ఇంతక్రితం ఈ క్షీణ రేటు మైనస్ 14.8 శాతం. కఠిన లాక్డౌన్ సడలింపులతో ఆర్థిక రికవరీ అనుకున్నదానికన్నా బాగుందని అమెరికా కేంద్రం పనిచేస్తున్న ఈ సంస్థ పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, పరిస్థితులు మరింత ఆశాజనకంగా మారతాయని అభిప్రాయపడింది. కాగా 2021–22లో భారత్ భారీగా 13 శాతం వృద్ధి సాధిస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. చదవండి: షాపింగ్ బటన్ జోడించిన వాట్సాప్ 2020–21లో అతి తక్కువ బేస్ ఎఫెక్ట్ దీనికి ప్రధాన కారణంగా వివరించింది. అయితే ఆర్థిక వ్యవస్థలో ఇంకా అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతున్నాయని గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక పేర్కొంది. కోవిడ్–19 ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిపోయిన భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ఊహించినదానికాన్న వేగంగా రికవరీ అయ్యే అవకాశం ఉందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ ఇప్పటికే అంచనావేసింది. ఆర్థిక రంగానికి సంబంధించి పలు ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొంది. భారత్ ఆర్థిక వ్యవస్థ 2020 క్యాలెండర్ ఇయర్లో అనుకున్నదానికన్నా కొంచెం బాగుండే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ కూడా ఇటీవలే తన నివేదికలో పేర్కొంది. 2020లో క్షీణ రేటు అంచనాలు ఇంతక్రితం మూడీస్ మైనస్ 9.6% అంచనావేయగా, తాజాగా దీనిని మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. ఆర్బీఐ రెపో... 0.35 శాతం తగ్గే అవకాశం కాగా 2021 నాటికి వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య స్థిరీకరణ పొందే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనావేయడం గమనార్హం. సరఫరాల సమస్యలు తగ్గడం, తగిన వర్షపాతం, బేస్ ఎఫెక్ట్ తక్కువగా ఉండడం ఇందుకు కారణాలని తెలిపింది. డాలర్ మారకంలో రూపాయి బలపడ్డం ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడానికి ఒక కారణంగా ఉంటుందని పేర్కొంది. ఆయా అంశాల నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) వచ్చే ఏడాది 0.35 శాతం తగ్గించే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. వ్యవసాయ రంగం పరిస్థితి ఆశాజనకంగా ఉండడం, ముడి చమురు ధరలు ఒక నిర్దిష్ట శ్రేణితో తిరుగుతుండడం, లాక్డౌన్ నిబంధనల సడలింపులతో సరఫరాల వ్యవస్థ మెరుగుపడుతుండడం ఆర్బీఐ అంచనాలకు ప్రధాన కారణాలు. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ తన పాలసీ సమీక్షలో భావించింది. ఈ అంచనాల నేపథ్యంలో వృద్ధికి దోహదపడే సరళతర ద్రవ్య విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. కాగా, ఆర్థిక వ్యవస్థ రికవరీ, కరోనా వ్యాక్సిన్ వంటి అంశాల ప్రాతిపదికన అవసరమైతే భవిష్యత్‌తో భారత్ ఈక్విటీలను వోవర్వెయిల్ కేటగిరీలోకి మార్చుతామని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. -
పండుగ సీజన్‌కు ముందే ఆర్బీఐ తీపికబురు
ముంబై : వడ్డీ రేట్లు దిగివచ్చేలా ఆర్బీఐ రెపోరేటును 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆరుగురు సభ్యులతో కూడిన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ బుధవారం తీసుకున్న నిర్ణయంతో రెపో రేటు 5.40 శాతానికి దిగివచ్చింది. ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంక్ అంచనా 4 శాతం కంటే దిగువనే ఉండటంతో వడ్డీరేట్లలో కోత విధించవచ్చని పరిశ్రమ,మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ రెపోరేటును తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాను 7 శాతం నుంచి 6.9 శాతానికి కుదించింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ మాసాల్లో రెపో రేటును సవరించడం ద్వారా 75 పాయింట్ల మేర కీలక రేట్లలో కోత విధించింది. సెప్టెంబర్‌లో మొదలయ్యే పండుగ సీజన్‌కు ముందే రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించాలని ఆర్బీఐ తాజా నిర్ణయంతో సంకేతాలు పంపింది. మరోవైపు ఆర్బీఐ అందించిన వెసులుబాటును బ్యాంకులు ఎంత మేర తమ ఖాతాదారులకు వర్తింపచేస్తాయనేది వేచిచూడాలి. -
రెపోరేటును అరశాతం తగ్గించిన ఆర్బీఐ
ముంబై: రిజర్వు బ్యాంకు కీలక వడ్డీరేట్లను తగ్గించింది. మంగళవారం జరిగిన ఆర్బీఐ ద్రవ్యవిధాన పరపతి సమీక్ష సమావేశంలో రెపో, రివర్స్ రెపో రేటు అరశాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో గృహ, వాహనాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. అయితే సీఆర్ఆర్( నగదు నిల్వల నిష్పత్తి 4 శాతం)లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రెపోరేటు 6.75 శాతం గా ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయని తాము ఆశిస్తున్నట్టు రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘరామ రాజన్ పేర్కొన్నారు.