ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో వివిధ విభాగాలపై వడ్డీరేట్ల పెంపు విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పలేమని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఒక నిర్దిష్ట వైఖరిని బ్యాంకర్లు వెల్లడించలేదు. రేట్లలో మార్పు అవకాశాలు ఉన్నాయని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. అయితే ఆ మార్పులు ఏమిటన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు.
ఈ అంశాన్ని అసెట్ లయబిలిటీ కమిటీ పరిశీలిస్తుందని మాత్రం అన్నారు. నిధుల లభ్యత భారం వంటి అంచనాలకు అనుగుణంగా వడ్డీరేట్లపై ఒక నిర్ణయం తీసుకుంటామని దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హెడ్ ఆదిత్య పురి మాట్లాడుతూ, గత మూడు నెలల్లో నిధుల సమీకరణ వ్యయం భారంగా ఉందన్నారు. అన్ని విషయాలనూ పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. పాలసీపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఎండీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ కేఆర్ కామత్ మాట్లాడుతూ, ద్రవ్య లభ్యత పరిస్థితులు మెరుగుపరుచుకోడానికి డిపాజిట్ రేట్లను పెంచుకోవాల్సి ఉంటుందన్నారు.
ఇదే జరిగితే అది వడ్డీరేట్ల పెంపునకు సైతం దారితీసే అవకాశం ఉందని విశ్లేషించారు. కాగా ఎస్‌ఎంఎస్ అలర్ట్‌కు సంబంధించి ఏకమొత్తంగా ఒకే ఫీజు వడ్డించకుండా వాడకాన్ని బట్టే వసూలు చేయాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించడంపై భట్టాచార్య మాట్లాడుతూ, ఇలాంటి విధానం అమలు కొంత కష్టమేనన్న అభిప్రాయపడ్డారు.
రేట్ల పెంపుపై ఇప్పుడే చెప్పలేం: బ్యాంకర్లు
Published Wed, Oct 30 2013 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement
Advertisement