ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రెపో రేటుపై కీలక నిర్ణయం ప్రకటించింది. నాలుగేళ్లలో తొలిసారి రెపోను పావు శాతం పెంచుతున్నట్టు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష కమిటీ తెలిపింది. దీంతో రెపో రేటు 6 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది. మరోవైపు రివర్స్ రెపోను సైతం పావు శాతం పెంచింది. దీంతో రివర్స్ రెపో 5.75 శాతం నుంచి
6 శాతంగా ఉండనుంది రూపాయి క్షీణత, ద్రవ్యోల్బణం పెంపు భయాలు, ముడిచమురు ధరలు ర్యాలీతో ఆర్‌బీఐ ఎంపీసీ రేటు పెంపుకే మొగ్గు చూపింది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ మూడు రోజుల క్రితమే ఈ పాలసీ సమావేశాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
నేడు ఈ కీలక రేటుపై ఎంపీసీ నిర్ణయం ప్రకటించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. రేటు పెంపును ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తెలిసింది. ఈ సారి పాలసీలో రెపో పెంపు పావు శాతం ఉంటుందని ముందస్తుగానే మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. మార్కెట్లు అంచనావేసిన విధంగానే రెపో రేటును ప్రకటించడంతో మార్కెట్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు పైన 35,111 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో 10,653 వద్ద కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment