రెండేళ్లపాటు కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసమూ... దాన్ని ఎదుర్కొనడంలో మన వైఫల్యాలకూ తోడు అనుకోకుండా వచ్చిపడిన రష్యా–ఉక్రెయిన్ లడాయి దేశంలో ద్రవ్యోల్బణం హద్దులు మీరడానికి దారితీస్తోంది. దాని కట్టడికి ఇంతవరకూ తీసుకున్న చర్యలు ఆశించిన ఫలితా లివ్వడం లేదని రిజర్వ్‌బ్యాంకు తాజా నిర్ణయం చెబుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని రెండో త్రైమాసి కానికల్లా 6 శాతంకన్నా తక్కువ స్థాయికి నిలువరించాలన్న తన లక్ష్యం విఫలమైందని గ్రహించిన రిజర్వ్‌బ్యాంకు పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వడ్డీరేటు(రెపో రేటు)ను అరశాతం పెంచింది.
కేవలం అయిదు వారాల వ్యవధిలో రెండోసారి రెపో రేటు పెంచి దాన్ని 4.9 శాతంకి చేర్చడం వర్తమాన ఆర్థిక స్థితిగతులకు అద్దం పడుతోంది. ఆర్‌బీఐ సమీక్షలో ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంచనాలు చూస్తుంటే దాని కట్టడి ఇప్పట్లో సాధ్యమేనా అన్న సందేహాలు తలెత్తకమానవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం మొత్తంగా 5.7 శాతం ఉండగలదని గతంలో అంచనా వేసిన ఆర్‌బీఐ అదిప్పుడు 6.7 శాతానికి ఎగబాకగలదని అంటు న్నది.
అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కూడా పెద్దగా ఫలితాన్నివ్వకపోవచ్చని అది పరోక్షంగా ఒప్పుకుంటున్నది. 2040 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 20 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు ఊరిస్తున్న తరుణంలో ద్రవ్యోల్బణం పగ్గాలు తెంచుకుని పరుగులు పెట్టడం ఎవరికైనా ఆందోళన కలిగించేదే. రెపో రేటు పెరగడం పర్యవసానంగా గృహ, వాహన రుణాలతోపాటు ఇతర రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. నెలవారీ చెల్లించే ఈఎంఐలు భారమవుతాయి.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానంగా ప్రపంచ సరఫరా అస్తవ్యస్థమైన సంగతిని కాదనలేం. బొగ్గు మొదలుకొని ఎరువుల వరకూ అన్నింటికీ కొరత ఏర్పడింది. కనీసం ఈ ఏడాది చివరికైనా సరఫరా వ్యవస్థ సర్దుకుంటుందన్న ఆశ లేదు. కనుక రాగల కాలంలో ఆహారం, ఇంధనం, కమోడిటీల ధరలు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గవు. ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు సహ కరించి సాధారణ వర్షపాతం ఉండొచ్చన్న అంచనాలు మాత్రమే కొంత ఆశాజనకంగా ఉన్నాయి.
దాంతోపాటు పామాయిల్ ఎగుమతులపై ఇండోనేసియా ఆంక్షలు ఎత్తివేయడం కొంతవరకూ శుభసూచికం. అయితే ఇలాంటి పరిణామాలు పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఏమేరకు ప్రభావం చూపుతాయన్నది వేచిచూడాల్సి ఉంది. 2016లో అప్పటి రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘరాం రాజన్ తప్పుకున్నాక విధాన నిర్ణాయక ప్రక్రియ మారింది. అప్పట్లో ఆయన దేశీయ వృద్ధిని దెబ్బతీసేలా, సంపన్న దేశాలు లాభపడేలా వడ్డీ రేట్లు పెంచుతూ పోయారన్న నింద ఎదుర్కొన్నారు. ఆ తర్వాతే ఏక వ్యక్తి నిర్ణయానికి బదులు బహుళ వ్యక్తుల ఆలోచనలకు చోటిస్తూ ఎంపీసీ ఆవిర్భవించింది. ద్రవ్యోల్బణం కట్టడే రిజర్వ్ బ్యాంకు ప్రధాన లక్ష్యంగా మారింది.
కానీ 2008లో ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం సమయంలో బ్యాంకు వ్యవహరించిన తీరుకూ, దాని ప్రస్తుత పనితీరుకూ ఏమాత్రం తేడా లేకుండా పోయింది. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు లేకుండా సాగడానికి కేంద్రమూ, రిజర్వ్ బ్యాంకు సమన్వయంతో వ్యవహరించడం అత్యుత్తమనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ అదే సమయంలో బ్యాంకు నిర్మొహమాటంగా ఉండటం, చొరవ ప్రదర్శించడం అత్యవసరం. అది సక్రమంగా లేకపోవడం వల్ల కావొచ్చు... ద్రవ్యోల్బణ గమనాన్ని అంచనా వేయడంలో, దాని కట్టడికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో రిజర్వ్‌బ్యాంకు విఫలమైంది.
ఎంపీసీ సభ్యులకు చట్టపరంగా విశేష అధికారాలున్నాయి. ఏదైనా అంశంపై విభేదించేందుకు, తమ అసమ్మతి రికార్డు చేసేందుకు వారికి అవకాశం ఉంది. కానీ కమిటీ సభ్యుల్లో ఎవరూ దీన్ని వినియోగించుకున్న దాఖలా లేదు. ఏక వ్యక్తి నిర్ణయాలు సమస్యలు సృష్టిస్తాయనీ, సమష్టి ఆలోచనలు మెరుగైన విధానా నికి దోహదపడతాయనీ ఆశించింది కాస్తా ఆచరణలో ఇలా అఘోరించింది.
కరోనా ఉగ్రరూపం దాల్చినప్పుడు విధించిన లాక్‌డౌన్‌లతో కోట్లాదిమంది ఉపాధి కోల్పో వడం, మరిన్ని కోట్లమందికి ఆదాయాలు పడిపోవడం వంటి కారణాలతో డిమాండు అడుగం టింది. సరైన డేటా అందుబాటులో లేకపోవడంతో ద్రవ్యోల్బణం గురించి, ఇతర అంశాల గురించి రిజర్వ్‌బ్యాంకు సరిగా అంచనా వేయలేకపోయిందనడంలో సందేహం లేదు. ప్రపంచ వృద్ధి రేటు ఈసారి 4 శాతం ఉండగలదని గతంలో అంచనా వేసిన ఐక్యరాజ్యసమితి దాన్ని ఇప్పుడు 3.1 శాతానికి తగ్గించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు సైతం తమ గత అంచనాలను సవరించు కున్నాయి.
ఇవన్నీ మన చేతుల్లో లేని పరిణామాలు. కానీ 2020 నుంచీ ఆర్థికరంగ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను పట్టించుకోవడంలో బ్యాంకు ఎందుకు విఫలమైందన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు. టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం నిరుడు ఏప్రిల్‌లో 10.7 శాతం ఉండగా, మొన్న ఏప్రిల్‌కు 15 శాతానికి చేరింది. సహజంగానే దీని ప్రభావం రిటైల్ ధరల సూచీపై పడుతుంది. ఆ సూచీ 4 శాతంగా ఉంటేనే నిత్యావసరాల ధరలు నియంత్రణలో ఉంటాయి.
అందుకు భిన్నంగా అది 6 శాతానికి చేరుకుంది. తన నిర్వా్యపకత్వం వల్ల ఏమైందో తెలిసింది గనుక రిజర్వ్‌బ్యాంకు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. తన విధాన నిర్ణయ ప్రక్రియను మెరుగుపరుచుకుని, సంక్షోభ నివా రణకు అవసరమైన చర్యలు సకాలంలో తీసుకోగలిగితే ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. సామా న్యుల జీవితాలు ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment