కేంద్ర పథకాల కుదింపు
* 72 నుంచి 30కి తగ్గించేందుకు ‘నీతి’ సీఎం సబ్ కమిటీ భేటీలో ఏకాభిప్రాయం
* ప్రాధాన్యాల వారీగా రెండు గ్రూపులుగా పథకాల వర్గీకరణ
* మొదటి గ్రూపులో ముఖ్యమైన స్కీంలు.. రెండో విభాగంలో సంక్షేమ పథకాలు
* ఫ్లెక్సీ ఫండ్ వాటాను 10% నుంచి 25 శాతానికి పెంచాలని సిఫారసు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకాల సంఖ్య భారీగా తగ్గనుంది. ప్రస్తుతం 72 ఉన్న ఈ పథకాలను 30కి కుదించనున్నారు.
ఈ మేరకు నీతి ఆయోగ్ ముఖ్యమంత్రుల సబ్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. కేంద్రం ఇచ్చే నిధుల్లో ప్రస్తుతం 10 శాతం నిధులను (ఫ్లెక్సీ ఫండ్) రాష్ట్రాలు తమ అభీష్టం మేరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపై ఈ వాటాను 25 శాతానికి పెంచాలని సబ్ కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. శనివారమిక్కడ నీతి ఆయోగ్‌లో సబ్ కమిటీ భేటీ అయింది. అనంతరం కమిటీ కన్వీనర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడారు. ‘మా తుది సిఫారసులు జూలై 5నాటికి ఖరారవుతాయి. మరిన్ని సలహాలు స్వీకరించాల్సి ఉంది. ప్రధాని మోదీకి నివేదిక సమర్పించేందుకు ముందు కమిటీలోని సభ్యులతోపాటు సీఎంలందరి అభిప్రాయాలు తెలుసుకుంటాం. ఆ తర్వాతే నివేదిక ఇస్తాం’ అని ఆయన చెప్పారు.
రెండు గ్రూపులుగా పథకాలు
ఇప్పటిదాకా జరిగిన సబ్ కమిటీ సమావేశాల్లోని ప్రతిపాదనలను క్రోడీకరించి తాజా భేటీలో సభ్యులకు ముసాయిదా నివేదికను సమర్పించారు. దీన్ని నీతి ఆయోగ్ సీఈవో సింధుశ్రీ ఖుల్లర్ రూపొందించారు. కేంద్ర పథకాలను ప్రధానంగా రెండు గ్రూపులుగా విభజించాలని అందులో పేర్కొన్నారు. మొదటి గ్రూపులో కీలకమైన గ్రామీణ ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ మిషన్, మధ్యాహ్న భోజనం వంటి పథకాలను చేర్చాలని ప్రతిపాదించారు. ఇక రెండో గ్రూపులో సామాజిక సంక్షేమ పథకాలను చేర్చాలని సూచించారు. మొత్తంగా 30 కేంద్ర పథకాలు ఉంటాయని, వీటి లో కేంద్రం వాటా 50 శాతానికి తగ్గకుండా ఉండాలని ప్రతిపాదించారు.
స్పెషల్ కేటగిరీలో ఉన్న 11 రాష్ట్రాల్లో మాత్రం కీలక పథకాలకు సంబంధించి.. కేంద్రం, రాష్ట్రాల వాటా 90:10 నిష్పత్తిలో ఉండాలని సూచించారు. రెండో గ్రూపులోని పథకాల్లో ఈ వాటా 80:20గా ఉండాలని ముసాయిదా నివేదికలో పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్, గ్రామీణ విద్యుదీకరణ, మహిళ, శిశు ఆరోగ్యం, ఇళ్ల నిర్మాణం పథకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే ఇప్పటివరకు 30 శాతం పనులు జరిగిన కేంద్ర పథకాలను పూర్తి చేయాలని, వాటికి నిధులను ఎప్పట్లాగే అందించాలని ప్రతిపాదించారు. శనివారం నాటి సమావేశానికి మధ్యప్రదేశ్ సీఎంతోపాటు రాజస్తాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సబ్ కమిటీలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు కూడా సభ్యుడిగా ఉన్నారు. అయితే తాజా భేటీకి ఆయన హాజరు కాలేదు.
అగ్రనేతలను కలవకుండానే వెళ్లిన రాజే
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్‌మోదీ వివాదంతో సతమతమవుతున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే.. శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ ఉప సంఘం సమావేశంలో పాల్గొని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను కానీ కలవకుండానే రాజస్తాన్‌కు న్‌కు తిరిగివెళ్లారు. ప్రత్యేక విమానంలో రాజస్తాన్ నుంచి ఢిల్లీ వెళ్లిన రాజే.. సమావేశం అనంతరం అదే విమానంలో తిరుగుపయనమయ్యారు. అక్కడ మీడియాకు కూడా ఎదురుపడలేదు. దీంతో.. పార్టీ అగ్ర నాయకత్వం ఆమెను కలవటానికి విముఖంగా ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ పర్యటనలో ఎవరితోనూ సమావేశాలను నిర్ణయించలేదని రాజస్తాన్ సీఎంఓ ఆ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది.
మోదీది ‘రాజే ధర్మం’: కాంగ్రెస్
దేశంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న లలిత్‌మోదీ బ్రిటన్‌లో ప్రయాణ పత్రాలు పొందేలా సహాయపడిన రాజే, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌లను సమర్థించుకోవటం ద్వారా.. ప్రధాని మోదీ ‘రాజ ధర్మాన్ని’ కాకుండా ‘రాజే ధర్మాన్ని’ పాటిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. వారితో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మహిళా మంత్రులను తొలగించటంలో విఫలమైన ప్రధాని.. రాజీనామా చేయాలని కాంగ్రెస్ ప్రతినిధి రాజ్‌బబ్బర్ అన్నారు.