తాడికొండలో.. అనకొండలు.. | Anakonda In Thadikonda | Sakshi
Sakshi News home page

తాడికొండలో.. అనకొండలు..

Published Sat, Mar 9 2019 3:22 PM | Last Updated on Sat, Mar 9 2019 3:23 PM

Anakonda In Thadikonda - Sakshi

మేడికొండూరు గ్రామానికి చెందిన షేక్‌ ఆదాం పొలాన్ని క్రేన్‌తో కబళిస్తున్న స్థానిక టీడీపీ నాయకులు (ఫైల్‌)

సాక్షి, గుంటూరు:  తాడికొండ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన అవినీతి అనకొండలు పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ సారథ్యంలో ప్రజా ధనాన్ని నిలువునా దోచుకున్నాయి. రాజధాని ప్రాంతం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా భూములను కబ్జా చేశాయి. రైతుల పొలాల్లో సెంట్ల చొప్పున భూమి కాజేసి కోట్ల రూపాయలు దండుకున్నాయి. నీరు– చెట్టు పథకం పేరిట అడ్డగోలుగా చెరువులు, పంట పొలాలను తవ్వేసి మట్టిని అమ్మేసుకున్నాయి. గ్రావెల్‌ను సైతం కొల్లగొట్టి కోట్ల రూపాయలు గడించాయి. కమీషన్లకు కక్కుర్తి పడి అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పాతర వేశాయి. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ అండదండలతో నియోజకవర్గాన్ని అక్రమాలు, అవినీతి, అరాచకాలకు కేంద్ర బిందువుగా మార్చాయి. అక్రమంగా కాజేసిన సొమ్ము పంపకాల్లో తేడాలొచ్చి.. మింగిన ప్రజాధనం వివరాలన్నీ రోడ్డెక్కి మరీ కక్కేశాయి. మొత్తంగా నియోజకవర్గంలో సుమారు రూ.400 కోట్ల వరకు సహజ వనరులను లూటీ చేశాయి. ఇవన్నీ తెలిసినా ముడుపులు తీసుకున్న అధికారుల చేతులు నిబంధనలన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకుని ముడుచుకుపోయాయి.  

రూ.200 కోట్లపైనే..
టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ అండదండలతో రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. నేటి వరకూ తుళ్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో భూకబ్జాలు, అక్రమ వసూళ్లు, మట్టి తవ్వకాల్లో రూ.200 కోట్లకుపైగా దిగమింగారు. వడ్డమాను గ్రామం ఎంపీటీసీ పిన్నక సాంబశివరావు 74/ఏ, 74/బీ అనే సర్వే నంబర్‌లలో సుమారు 33.7 ఎకరాల కొండ పోరంబోకు భూమిని కబ్జా చేశాడు. దీని విలువ సుమారు రూ. 20 కోట్లపైనే ఉంటుంది. పేదలకు చెందాల్సిన భూమిలో అధికారాన్ని  అడ్డుపెట్టుకుని గృహాలు నిర్మించుకున్నారు.   

యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు..
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యే శ్రావణ్, ఆయన అనుచరులు నియోజవకర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ రాబందుల్లా వాలిపోయి భూమిని వశపరుచుకొని అక్రమంగా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలను సాగిస్తున్నారు. కైలాసగిరి కొండ ప్రాంతంలో ఎమ్మెల్యే శ్రావణ్‌ అనుచరులు గ్రావెల్‌ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. సర్వే నంబర్‌ 573లో 7 ఎకరాల 28 సెంట్ల కుంట పోరంబోకు స్థలంలో గతంలో మాజీ సైనికులు, నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్లు, పంటలు వేసుకోవటానికి భూమి ఇచ్చింది. ఈ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ పీఏ బత్తుల సురేశ్‌బాబు, విశదల గ్రామానికి చెందిన ఎమ్మెల్యే సన్నిహితుడు నరేంద్ర 2018 ఫిబ్రవరి నుంచి ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్‌కు రూ.1500 చొప్పున గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారు. ఇలా రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లను తిప్పుతున్నారు. ఇలా ఎమ్మెల్యే శ్రావణ్, ఆయన పీఏ, సన్నిహితుడు గ్రావెల్‌ అక్రమ రవాణా ద్వారా రూ.2 కోట్లకుపైగా గడించారు.

లాంలో అక్రమంగా లోడింగ్‌ చేస్తున్న గ్రావెల్‌ (ఫైల్‌)

సొసైటీ లీజులు అతిక్రమించి..
లాంలో ది లాం లేబర్‌ కాంట్రాక్ట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ పేరిట 60 సంవత్సరాలుగా లీజు పాలసీ నడుస్తోంది. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకుని సర్వే నెం. 199ఏలో 1.5 హెక్టార్ల కొండను మైనింగ్‌ చేసుకుంటున్నారు. సొసైటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పరాజయం పాలవడంతో ఎలాగైనా క్వారీని సొంతం చేసుకోవాలనుకున్న నాయకులు కుటిల పన్నాగం పన్నారు. అధికారులను, అధికారాన్ని అడ్డుగా పెట్టి క్వారీని నిలిపేయించడంతోపాటు పలుమార్లు కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో మూడున్నర సంవత్సరాలుగా క్వారీ మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు. అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం యథేచ్ఛగా గ్రావెల్‌ను తవ్వి అమ్మకాలు జరుపుకుంటూ కాసులు వెనకేసుకున్నారు. గతంలో గ్రామానికి చెందిన ఓ మైనార్టీ నాయకుడు ఈ తంతుకు తెరలేపడంతో అధికారులు కిమ్మనకుండా కూర్చున్నారు. రాత్రివేళ యంత్రాలతో మట్టిని తవ్వి పోగుచేయడంతోపాటు లోడింగ్‌ చేసి గుంటూరు, లాం పరిసర ప్రాంతాలలోని వెంచర్లకు, బహిరంగ మార్కెట్లో అమ్మకాలు చేశారు. దీనిపై సొంత పార్టీ నాయకులే బహిరంగ ఆరోపణలు చేయడం, లీజుదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. 

ఎమ్మెల్యే అండదండలతో నెక్కల్లు గ్రామంలో ఆయన అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నెక్కల్లు గ్రామానికి ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నెంబర్‌ 87/ఏలో తుళ్లూరు చేనేత పరపతి విక్రయ సంఘం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు మేకల రవికుమార్‌ తన భార్య పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి భవనం నిర్మించుకున్నాడు. 25 సెంట్ల విస్తీర్ణం గల ఈ భూమి రూ. 3 కోట్ల విలువ ఉంది. గ్రామంలో 24 ఎకరాల్లో ఉన్న ఊర చెరువు భూమిలో ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 5 ఎకరాలు ఇప్పటికే ఆక్రమించుకుని పశువుల పాకలను నిర్మించారు. ప్రస్తుతం మరో మూడు ఎకరాలకు మట్టిని తోలి లెవల్‌ చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఆక్రమించిన ఈ 8 ఎకరాలు రూ. 80 కోట్లపైనే విలువ చేస్తుంది. 

సైనికుడి భూమిని చెరబట్టారు...

ఆర్మీలో పనిచేసిన కొడుకుతో తల్లి షబీరున్నీసాబీ

మేడికొండూరుకు చెందిన షేక్‌ ఆదాం  సైన్యంలో పని చేశారు. భారత్‌–చైనా యుద్ధంలో పాల్గొన్నారు. ఆదాంను భారత ప్రభుత్వం మెడల్స్‌తో సత్కరించింది. రెండు దశాబ్దాలకుపైగా భారత సైన్యంలో సేవలందించినందుకుగాను అతనికి మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌ సమీపంలో సర్వే నంబర్‌ 347లో 2 ఎకరాల 59 సెంట్ల భూమిని 1964లో రాసిచ్చింది. ఈయనకు ఇద్దరు పిల్లలు. వీరిలో ఒకరు ఆర్మీలో పని చేశారు. మాజీ సైనికుడికి ఇచ్చిన భూమిపై ఎమ్మెల్యే శ్రావణ్‌ అనుచరుల కన్ను పడింది. పచ్చగా సాగవుతున్న భూమిని టీడీపీ కబ్జాకోరులు 4 సంవత్సరాల క్రితం నీరు– చెట్టు పేరుతో తవ్వేసి చెరువులో కలిపేశారు.   భర్త మరణానంతరం షబీరున్నీసాబీ ప్రభుత్వమిచ్చిన భూమిని సాగు చేసుకుంటూ పొట్ట పోసుకొంటోంది. అధికార పార్టీ నేతలు భూమిని అన్యాక్రాంతం చేయడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, ప్రస్తుత ఫిరంగిపురం మార్కెట్‌ యార్డు చైర్మన్‌ నార్నె శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన భూకబ్జాపర్వంపై ఎదురు తిరిగినందుకు ఆదాం రెండో కుమారునిపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి జైలుకు పంపారు. దేశం కోసం పోరాడిన సైనికుని కుటుంబానికి ఇంతటి కష్టమొస్తే కనీసం ఆదుకోవాల్సిన రెవెన్యూ అధికారులు సైతం పచ్చపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తారు. 



 

సెంట్లు చొప్పున భూమిని కాజేశారు
అనంతవరం లో ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు ఒక్కో రైతు నుంచి వారి రికార్డుల ఆధారంగా చేసుకుని సెంట్లు భూమిని కాజేశారు. 30 ఎకరాలలో ఈ విధంగా చిన్న సన్నకారు దళిత రైతుల వద్ద నుంచి ఆక్రమించుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేశారు. కోర్టులను ఆశ్రయించడంతో కేవలం నోటీసులు మాత్రమే జారీ చేసి రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారులు చేతులను దులుపుకున్నారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూమి విలువ సుమారుగా రూ.50 కోట్ల వరకు ఉంటుంది.

మట్టిని మింగేశారు
రావెల–పొన్నెకల్లు గ్రామాల మధ్య చెరువులో మట్టిని మండల పార్టీ ఉపాధ్యక్షుడు దగ్గుమల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీ పేరిట ప్రైవేటు వెంచర్లు, ఇతర గ్రామాలకు మళ్లించి రూ. 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ కొమ్మినేని రామచంద్రరావు ఆరోపించడంతో భారీ అవినీతి తంతు బయటపడింది. 4 సంవత్సరాలలో అక్రమంగా క్వారీయింగ్‌ నిర్వహించి పరిమితికి మించి మట్టిని తవ్వారని, రూ.4 కోట్ల మేర మట్టిని నీరు చెట్టు పథకం పేరిట స్వాహా చేశారని పంచాయతీ వార్డు మెంబర్లే స్వయంగా ఏడుగురి సంతకాలతో కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు దాడులు నిర్వహించి వాహనాలను సీజ్‌ చేశారు. పొన్నెకల్లులో నీరు– చెట్టు కింద పూడికతీత తీసిన మట్టి విక్రయాలకు సంబంధించి లెక్కల విషయంలో మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గుర్రం ఆదినారాయణ, ప్రస్తుత మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుంటుపల్లి మధుసూదనరావు వర్గీయుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తి ఎమ్మెల్యే ఎదుటే వాదోపవాదాలకు దిగారు.

రూ. కోట్లు గడించారు 
తాడికొండ మండల కేంద్రలో నీరు–చెట్టు కార్యక్రమం పేరుతో టీడీపీ నాయకులు భారీగా మట్టిని తరలించి రూ. కోట్లు గడించారు. మట్టిని అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు ఇంత వరకు బయటకు పొక్కనీయకపోవడం గమనార్హం. గ్రామ పంచాయతీలో తీర్మానం, టెక్నికల్‌ ఎస్టిమేట్లు లేకుండా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేసి విరాళాల పేరిట రూ.6 లక్షలు అధికార పార్టీ నాయకులు వసూలు చేశారు. ఎలాంటి వేలం నిర్వహించకుండా విరాళాలు సేకరించిన వారికే దుకాణాలు కేటాయిస్తామంటూ హామీ కూడా ఇచ్చి హడావుడిగా ప్రారంభోత్సవం చేశారు. విషయం పత్రికలకు ఎక్కడంతో దాదాపు ఏడాదిన్నరగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ మూతబడింది. విరాళాలను పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న టీడీపీ నాయకులు.. ఆ కాంప్లెక్స్‌కు తిరిగి ప్రభుత్వ నిధులు బిల్లులు చేయాలంటూ అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. టీడీపీకి చెందిన వార్డు మెంబర్‌ ఇళ్ల స్థలాలను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అతనికి పంచాయతీకి చెందిన స్థలాలను లీజు పేరిట కట్టబెట్టారు.

కంతేరులో భారీ దోపిడీ
కంతేరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు సర్పంచ్‌ను సైతం పక్కన పెట్టి పారదర్శకత అంటూ ప్రచారం చేస్తూ సొంత వ్యక్తులను నియమించుకొని భారీగా మట్టి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ నిధులకు ఆడిటింగ్‌ చేయించిన అనంతరం గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణం చేయిస్తానంటూ నిధులు జేబులోకి మళ్లించాక చేతులెత్తేశాడు. మట్టి వ్యవహారంపై అçప్పట్లో సర్పంచ్‌ భర్తకు ఓ ప్రజాప్రతినిధికి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో విషయం బయటకు పొక్కింది. 


రావెలలో..
తెలుగు తమ్ముళ్లు నీరు– చెట్టు పేరిట సహజ సంపదను దోచుకొని జేబులు నింపుకున్నారు. తాడికొండ మండలం రావెల గ్రామంలో అధికార పార్టీకి చెందిన మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు దగ్గుమల్లి శ్రీనివాసరావు నీరు– చెట్టు పథకం కింద మట్టిని అమ్ముకొని రూ. కోట్లు కొల్లగొట్టారంటూ అదే పార్టీకి చెందిన కొమ్మినేని రామచంద్రరావు మీడియా సాక్షిగా ధ్వజమెత్తారు. లాంలో మట్టి దందా నడుపుతూ ఎమ్మెల్యే శ్రవణ్‌ పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారంటూ గతంలో టీడీపీకి చెందిన ఓ వర్గం ఆందోళనకు దిగింది. పొన్నెకల్లులో మరో అడుగు ముందుకేసిన నాయకులు నీరు–చెట్టు పథకం కింద గ్రామ అవసరాలకు దానంగా ఇచ్చిన ఊర చెరువును పూడ్చి కల్యాణ మండపం నిర్మిస్తామంటూ విమర్శించారు.

ఎమ్మెల్యే అండదండలతో నెక్కల్లు గ్రామంలో ఆయన అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నెక్కల్లు గ్రామానికి ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నెంబర్‌ 87/ఏలో తుళ్లూరు చేనేత పరపతి విక్రయ సంఘం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు మేకల రవికుమార్‌ తన భార్య పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి భవనం నిర్మించుకున్నాడు. 25 సెంట్ల విస్తీర్ణం గల ఈ భూమి రూ. 3 కోట్ల విలువ ఉంది. గ్రామంలో 24 ఎకరాల్లో ఉన్న ఊర చెరువు భూమిలో ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 5 ఎకరాలు ఇప్పటికే ఆక్రమించుకు ని పశువుల పాకలను నిర్మించారు. ప్రస్తుతం మరో మూడు ఎకరాలకు మట్టిని తోలి లెవల్‌ చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఆక్రమించిన ఈ 8 ఎకరాలు రూ. 80 కోట్లపైనే విలువ చేస్తుంది. 

కమీషన్ల దందా
పెదపరిమి గ్రామంలో ఎమ్మెల్యే పేరు చెప్పుకుని టీడీపీ సీనియర్‌ నాయకుడు, రైతు విభాగం నేత నూతలపాటి రామారావు చేస్తున్న అవినీతి పరాకాష్టకు చేరింది. గ్రామంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఈయన కమిషన్‌లు వసూలు చేస్తున్నారు. నీరు చెట్టు పథకాన్ని అడ్డుపెట్టుకుని భారీగా మట్టి అమ్ముకున్నారు. సిలార్‌ఖాన్‌ అనే కౌలు రైతు 2015 సెప్టెంబరు 21 తేదీన అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి మరణించాడు. కౌలు రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయంలో వాటా ఇవ్వటానికి సిలార్‌ కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే ద్వారా ఆ పరిహారాన్ని నిలిపి వేయించాడు. తుళ్లూరుకు చెందిన సీనియర్‌ నాయకుడు ఒకరు సీఆర్‌డీఏ అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఉద్యోగ విరమణ చేసిన అధికారులను కొనసాగిస్తూ గ్రామ కంఠాల పరిహారాలను ఒకటికి రెండింతలు పొందుతున్నారు.

నీరు–చెట్టు పథకంలో దోపిడీ రూ.100 కోట్లు
భూకబ్జాలతో దండుకున్న మొత్తం రూ.200 కోట్లు 
గ్రావెల్‌ అమ్ముకున్న సొమ్ము రూ.50 కోట్లు 
రైతుల పొలాల్లో సెంట్ల రూపంలో కాజేసిన భూమి  రూ.50 కోట్లు 

కైలాసగిరి కొండ ప్రాంతంలో మట్టి తరలిస్తున్న లారీలు

తాడికొండలో మట్టి తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లు



 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement