సిరుల మాగాణిలోనే.. చివరి మజిలీ | lease farmer doubtful death | Sakshi
Sakshi News home page

సిరుల మాగాణిలోనే.. చివరి మజిలీ

Published Sun, Jun 4 2017 11:01 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

సిరుల మాగాణిలోనే.. చివరి మజిలీ - Sakshi

సిరుల మాగాణిలోనే.. చివరి మజిలీ

- కౌలు రైతు అనుమానాస్పద మృతి
- ఆత్మహత్య చేసుకున‍్నట్టు సందేహాలు
- పీడలా మారిన అప్పులే కారణమంటున్న కుటుంబ సభ్యులు
- ఓదూరులో విషాదం
 
ఆరుగాలం శ్రమించి.. చెమట చుక్కలు చిందించి.. సిరులు పండించిన చేనే.. ఆ అన్నదాతకు ఆఖరి మజిలీ అయింది. కౌలుసాగులో దక్కుతున్నది గోరంత.. పెరుగుతున్న అప్పులు కొండంత కావడం.. అవి తీరే దారి కానరాకపోవడం వంటి కారణాలు అతడి మనసును కలచివేశాయి. మరోదారి లేదనుకున్నాడో ఏమో కానీ.. సుమారు 20 రోజుల కిందట అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అంతకుముందు కూడా అలాగే వెళ్లి.. తిరిగి వచ్చేస్తుండడంతో.. ఈసారి కూడా అలాగే జరుగుతుందని, ఇంటికి తిరిగి వచ్చేస్తాడని కుటుంబ సభ్యులు ఎదురు చూశారు. కానీ, అలా వెళ్లడమే అతడి చివరి ప్రయాణమని వారు ఊహించలేకపోయారు.
 
రామచంద్రపురం రూరల్‌ : ప్రశాంతంగా ఉన్న ఓదూరు గ్రామంలో ఆదివారం ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామానికి చెందిన రైతు ముమ్మిడివరపు సతీష్‌ (35) తాను కౌలుకు చేస్తున్న పొలంలోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం గ్రామస్తుల్లో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. సతీష్‌ ఐదేళ్లుగా ఎనిమిదెకరాల్లో కౌలుకు వరిసాగు చేస్తున్నాడు. భూమి యజమానులు అంగీకరించరన్న ఉద్దేశంతో కౌలు రైతు గుర్తింపు కార్డును అతడు తీసుకోలేదు. దీంతో బ్యాంకు రుణం పొందే అవకాశం అతడికి లేకుండా పోయింది. సాగు అవసరాల కోసం ఈ ఐదేళ్లలో ప్రైవేటు వ్యక్తులవద్ద రూ.2 వడ్డీకి సుమారు రూ.5 లక్షల వరకూ అప్పు చేశాడు. ఇందులో ఇంకా లక్ష రూపాయలకు పైగా అప్పు మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అతడు గత నెల 14న అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. గతంలో కూడా ఇలాగే ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగి వచ్చేశాడు. ఈసారి కూడా అలాగే వచ్చేస్తాడని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా సతీష్‌ సాగు చేస్తున్న పంటచేనులో ఎముకల గూడుగా మారిన ఓ అస్తిపంజరాన్ని గ్రామంలో టముకు వేసే తొగరపు పెద్దబ్బులు గుర్తించి, సంబంధిత రైతు కాకర శ్రీరామకృష్ణచౌదరికి సమాచారం అందించాడు. దీంతో ఆయన వీఆర్‌ఓ వెంకటరెడ్డికి విషయం తెలిపాడు. వీఆర్‌ఓ నుంచి సమాచారం అందుకున్న రామచంద్రపురం డీఎస్‌పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ కొమ్ము శ్రీధర్‌కుమార్‌లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలం వద్ద సతీష్‌ లుంగీ, చొక్కా, చేతి సంచిలను కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించారు. దీంతో ఆ అస్తిపంజరం సతీష్‌దిగా నిర్ధారించారు. అక్కడి ఆధారాలనుబట్టి సతీష్‌ తాను కౌలుకు చేస్తున్న చేనులోనే మజా డ్రింకులో పురుగుల మందు కలుపుకొని తాగి, తనువు చాలించినట్టు భావిస్తున్నారు. సంఘటన జరిగి 20 రోజులు పైగా కావడంతో సతీష్‌ మృతదేహాన్ని నక్కలు పీక్కు తినేశాయి. పుర్రె ఒకచోట, ఎముకల గూడు ఒకచోట ఉండి సంఘటన స్థలంలో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. మృతునికి తండ్రి సత్యనారాయణ, భార్య అన్నపూర్ణ, 12 ఏళ్ల కవల పిల్లలు రాముడు, లక్ష్మణుడుతోపాటు మరో కుమారుడు విజయ్‌కుమార్‌ (7) ఉన్నారు. సతీష్‌ మరణవార్త తెలిసిన వెంటనే భార్య అన్నపూర్ణ స్పృహ తప్పిపోయింది. దీంతో ఆమెను వేళంగిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. తన భర్తకు లక్ష రూపాయలకు పైగా అప్పులున్నాయని, ఐదేళ్లుగా చేస్తున్న వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని ఆమె చెప్పింది. ఈ ఏడాది పంట బాగానే పండినా రేటు తక్కువగా రావడంతో, గతంలో చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయని వాపోయింది. గతంలో పెద్ద కుమారులు పుట్టినప్పుడు సతీష్‌ తమను వదిలి వెళ్లిపోయాడని, చాలాకాలం తర్వాత తిరిగి వచ్చాడని, ఇప్పుడు కూడా అలాగే వెళ్లి ఉంటాడనుకున్నామని, ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేకపోయామని విలపించింది. యజమాని మృతితో ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులకు కలచివేసింది. పిల్లల్ని చాలా ప్రేమగా చూసేవాడని, చిన్నకుమారుడు విజయ్‌కుమార్‌ను ఎప్పుడూ భుజం దించేవాడు కాదని స్థానికులు అంటున్నారు. సతీష్‌ మరణంపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎముకల గూడును రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement