- పంట భూమిలోనే ఘటన
కరెంట్ షాకుతో రైతు మృతి
Published Tue, Aug 23 2016 11:35 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
కడెం : నమ్ముకున్న పంట భూమే ఆ రైతును బలిగొంది. పంట భూమి సాగు చేసుకుంటుండగా ఒక్కసారిగా కరెంటు షాకు రూపంలో ప్రాణాలు తీసుకుంది. కడెం ఎస్సై రాము కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దస్తురాబాదు గ్రామానికి చెందిన గుండ రాయమల్లు(43) అనే రైతు తనకున్న 30 గుంటల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేసుకుంటున్నాడు. రోజూ లాగే మంగళవారం కూడా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చేనుకు నీరు పారిద్దామని అక్కడికి వెళ్లాడు. అక్కడ బావి వద్ద గల మోటారును స్టార్ట్ చేసేందుకు స్టార్టర్‌ను ఆన్ చేశాడు. కానీ అది నడవలేదు. ఆ వైరును సరిచేస్తున్న క్రమంలో అప్పటికే తెగి ఉన్న సర్వీసు వైరు కాలికి తగిలింది. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి రాయమల్లు కింద పడిపోయాడు. నీరు పెట్టేందుకు వెళ్లి ఇంకా రావటం లేదని, రాయమల్లు భార్య లక్ష్మి 11 గంటల ప్రాంతంలో బావి వద్దకు వెళ్లింది. అక్కడికి వెళ్లే సరికి రాయమల్లు కింద పడి ఉన్నాడు. అతడిని చూసిన ఆమె కేకలు వేయటంతో సమీపంలో ఉన్న వారంతా వచ్చారు. కానీ రాయమల్లు అప్పటికే మృతి చెందాడు.
పెద్ద దిక్కును కోల్పోయి...
మతుడికి భార్య లక్ష్మి, కుమారులు సిద్ధు, గణేశ్ ఉన్నారు. రాయమల్లు మృతితో తనకిక దిక్కెవరని, తాము పెద్ద దిక్కును కోల్పోయామని అతని కుటుంబీకులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. సంఘటనా స్థలానికి సింగిల్‌విండో చైర్మన్ చుంచు భూమన్న, దస్తురాబాదు సర్పంచ్ గంగామణి, రాజేశం, ఉప సర్పంచ్ కమలాకర్, ఎంపీటీసీ మల్లేశం వచ్చి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద రైతు రాయమల్లు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Advertisement