కౌలురైతు మృతిపై పూర్తి స్థాయి విచారణ
కౌలురైతు మృతిపై పూర్తి స్థాయి విచారణ
Published Thu, Jul 27 2017 11:13 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
సాక్షి కథనానికి స్పందించిన అధికారులు
వీకే రాయపురం (సామర్లకోట) : మండల పరిధిలో వీకే రాయపురం గ్రామంలో మృతి చెందిన కౌలు రైతుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు కాకినాడ ఆర్డీఓ ఎల్.రఘుబాబు తెలిపారు. ‘కలిసి రాని సాగు కాటికి తరిమింది’ అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు వీకే రాయపురం గ్రామం చేరుకుని రైతుల నుంచి, మృతుని భార్య సత్యగౌరి నుంచి గురువారం కాకినాడ ఆర్డీఓ రఘుబాబు, వ్యవసాయశాఖ ఏడీఏ సి.భవాని, తహసీల్దార్ ఎల్.శివ కుమార్, ఏఓ ఎన్.శామ్యూల్‌జాన్ సమాచారం సేకరించారు. ఆర్డీఓ విలేకర్లతో మాట్లాడుతూ మలిరెడ్డి సూరిబాబు అనే కౌలు రైతు మృతి చెందడంతో అతని మృతికి కారణాలపై విచారణ చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయం చేస్తూ అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనారోగ్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణాలలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. గ్రామానికి చెందిన రైతులు సంఘ నాయకులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అడబాల చిట్టిబాబు, వెలమర్తి శ్రీను, ఓదూరి నాగేష్, మలిరెడ్డి సూరిబాబు, ధర్మరాజు, వెంకన్న, చక్రం కసిరెడ్డి వీర్రాజులు మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా సూరిబాబు తండ్రి నుంచి భూములు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడని తెలిపారు. బ్యాంకు రుణాలు ఇవ్వక పోవడంలో బయటవ్యక్తుల నుంచి నూటికి రూ.5 చొప్పున అప్పులు తీసుకుని వ్యవసాయం చేస్తూ అప్పుల బాధ తాళలేక కౌలు రైతు మలిరెడ్డి సూరిబాబు ఆత్మహత్య చేసుకున్నాడని వారు తెలిపారు. వైద్య ఖర్చుల కోసం ఎటువంటి అప్పులు చేయలేదని వ్యవసాయం కోసమే అప్పులు చేసాడని గ్రామస్తులు తెలిపారు. అయితే సూరిబాబు వ్యవసాయం చేయడంలేదని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి గంగరాజు కూడా కౌలు రైతుగా వ్యవసాయం చేసి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు వివరించారు. ఆ కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదని ఐదు ఏళ్ల కుమారుడు రిషాల, ఏడాది కుమార్తె వైష్టవి మహాలక్ష్మిలను ఆ తల్లి ఏవిధంగా పెంచుతుందని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తమ విచారణలోని పూర్తి సమాచారం మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని, ఈ మేరకు యథార్థ విషయాలు తెలియజేయాలన్నారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం నుంచి సహాయం వస్తుందని అ«ధికారులు తెలిపారు. మృతి చెందిన సూరిబాబుకు ఇటీవల జారీ చేసిన కౌలు కార్డు ఆధారంగా ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ కుర్రా నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement