సీటుబెల్ట్‌ ధరించినా తీవ్రత ఎలా!  | Deep investigation by police on death of the MLA: Telangana | Sakshi
Sakshi News home page

సీటుబెల్ట్‌ ధరించినా తీవ్రత ఎలా! 

Feb 24 2024 3:37 AM | Updated on Feb 24 2024 3:37 AM

Deep investigation by police on death of the MLA: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందితను బలితీసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఎమ్మెల్యే నందిత ప్రయాణించిన కారులో ఉన్న ఎయిర్‌ బ్యాగ్స్‌ ఓపెన్‌ కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు ఆమె సీట్‌ బెల్ట్‌ ధరించే ఉండచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రమాద తీవ్రత ఫలితంగా అది ఊడిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అయితే ప్రమాదం జరిగిన తీరు, ప్రమాదం అనంతరం కారు స్థితిగతులు, లాస్య మృతదేహం పడున్న పరిస్థితి, ఆమెకు అయిన గాయాలను పరిగణనలోకి తీసుకున్న రవాణా రంగ నిపుణులు మాత్రం సీట్‌ బెల్ట్‌ సరిగ్గా పెట్టుకోకపోయి ఉండొచ్చని అంటున్నారు. ప్రమాద సమయంలో లాస్య కారులో డ్రైవర్‌ పక్కన ఉన్న ఫ్రంట్‌ సీటులో కూర్చుని ప్రయాణిస్తున్నారు. నేరుగా కూర్చున్న స్థితిలో కాకుండా వెనక్కు వాలి పడుకున్నారు.

సీట్‌ ఈ స్థితిలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగినా... సీటులో ఉన్న వారు ముందుకు రావడంతో ఏర్పడే ఫోర్స్‌ సీట్‌ బెల్ట్‌ బకెల్‌ ఊడిపోయే స్థాయిలో ఉండదని చెప్తున్నారు. లాస్య సీట్‌బెల్ట్‌ సరిగ్గా ధరించి ఉంటే... అన్ని గాయాలకు ఆస్కారం లేదని చెప్తున్నారు. దీన్ని బట్టి అలారం బజర్‌ రాకుండా ఆమె సీటు బెల్ట్‌ను ముందే పెట్టేసి దాన్ని ఆనుకుని కూర్చుని ఉండొచ్చని, ఫలితంగా సీట్‌ వెనక్కు వాలినప్పుడు ఆ బెల్ట్‌ ఆమె ఛాతీ భాగంలో కాకుండా వీపు భాగంలో ఉండి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. 

సీట్‌ బెల్టులు సరిగ్గా పెట్టుకోకుంటే.. 
ఇటీవల కాలంలో మార్కెట్‌లోకి వస్తున్న దాదాపు అన్ని కార్లలో ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి అయింది. కొన్ని వాహనాల్లో దీనికి సీట్‌ బెల్ట్‌కు మధ్య లింకు ఉంటోంది. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు అవి తెరుచుకోవాలంటే దానికి సంబంధించిన సెన్సర్లు యాక్టివేట్‌ కావాలి. ఇవి ఏసీయూకు (ఎయిర్‌బ్యాగ్‌ కంట్రోల్‌ యూనిట్‌) అనుసంధానించి ఉంటాయి.

యాక్సిలో మీటర్‌ సెన్సర్‌ (యాక్సిలో మీటర్‌ స్పందన ఆధారంగా యాక్టివేట్‌ అయ్యేవి), ఇంపాక్ట్‌ సెన్సర్‌ (ఢీకొన్నప్పుడు యాక్టివేట్‌ అయ్యేవి), సైడ్‌ రోడ్‌ ప్రెజర్‌ సెన్సర్స్‌ (పక్క తలుపులపై పడే ఒత్తిడి ఆధారంగా యాక్టివేట్‌ అయ్యేవి), వీల్‌ స్పీడ్‌ సెన్సర్స్‌ (చక్రం స్పీడ్‌ ఆధారంగా పని చేసేవి), బ్రేక్‌ ప్రెజర్‌ సెన్సర్స్‌ (బ్రేక్‌ కొట్టిన తీరు ఆధారంగా యాక్టివేట్‌ అయ్యేవి) కార్లకు ఉంటాయి. కొన్ని మోడల్స్‌లో ఇవన్నీ ఉండగా, మరికొన్నింటిలో కొన్ని మాత్రమే ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు ఒత్తిడి కారణంగా ఇవన్నీ యాక్టివేట్‌ అయి ఓ యాంగిల్‌ ఏర్పరుచుకుని ఏసీయూకు సందేశం ఇవ్వడంతో అది బెలూన్‌ను యాక్టివేట్‌ చేసి తెరుచుకునేలా చేస్తుంది. ఈ ప్రక్రియ సెకనులోపు సమయంలోనే జరుగుతుంది. సీటు బెల్టులు పెట్టుకోకపోతే కొన్ని వాహనాల్లో ఎయిర్‌ బ్యాగ్స్‌ యాక్టివేట్‌ కావు. 

మితిమీరిన వేగంలో ఎయిర్‌బ్యాగ్స్‌ పనిచేయలేవు
హైఎండ్‌ కార్లు అయినప్పటికీ... అనేక సెక్యూరిటీ ఫీచర్స్‌ ఉన్నప్పటికీ కొన్ని ప్రమాదాల నుంచి ఎయిర్‌బ్యాగ్స్‌ సైతం కాపాడలేవు. మితిమీరిన వేగమే దానికి కారణం. కొన్ని ప్రమాదాల్లో ఎయిర్‌ బ్యాగ్స్‌ ఓపెన్‌ అయినప్పటికీ అవి డ్రైవింగ్‌ చేస్తున్న, పక్కన కూర్చున్న వారి ప్రాణాలను కాపాడలేవు. యాక్సిడెంట్‌ జరిగినప్పుడు సెన్సర్లు యాక్టివేట్‌ అయి, ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్‌ కావడానికి కొంత సమయం పడుతుంది. సాధారణంగా ఇది 0.05 సెకన్‌గా ఉంటుంది. వాహనం మితిమీరిన వేగంతో ఉన్నప్పుడు ఈ సమయంలోపే డ్రైవర్, ప్రయాణికులు స్టీరింగ్, డాష్‌బోర్డ్, ముందు సీటు, పక్కడోర్లకు బలంగా ఢీ కొట్టుకుంటారు. రోడ్డు ప్రమాదంతో వాహనం ఛిద్రమైపోయిన సందర్భాల్లోనూ ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకున్నా ఉపయోగం ఉండదని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement