సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి మణిహారమైన 158 కి.మీ. నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు 30 ఏళ్లపాటు లీజుకు అప్పగించింది. టోల్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (టీఓటీ) ప్రాతిపదికన ఓఆర్‌ఆర్ నిర్వహణ లీజు కోసం హెచ్‌ఎండీఏ బిడ్‌లను ఆహ్వానించగా 11 అంతర్జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. చివరకు నాలుగు సంస్థలు అర్హత సాధించగా జాతీయ రహదారుల నిర్వహణలో అతిపెద్ద సంస్థగా పేరొందిన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 7,380 కోట్లకు ఈ లీజును పొందింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్‌బీ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డ్‌ను (ఎల్‌ఓఏ)ను అందజేసింది. దేశంలోని అతిపెద్ద టీఓటీ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. ఈ బిడ్‌ను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. ఏటేటా ఔటర్‌పై పెరుగుతున్న వాహనాల రద్దీ, టోల్ ద్వారా వస్తున్న ఆదాయం, ఓఆర్‌ఆర్ నిర్వహణ, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎన్‌పీవీ (నెట్ ప్రజెంట్ వాల్యూ) పద్ధతిలో లీజు మొత్తాన్ని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో టోల్ పెంపు వంటి అంశాలతోపాటు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) గతంలో ఇచి్చన లీజులను కూడా ప్రామాణికంగా తీసుకున్నట్లు చెప్పారు.
నిర్వహణ ఇక ప్రైవేట్ సంస్థదే..
ఇప్పటివరకు ఔటర్ రింగ్‌రోడ్డు నిర్వహణ హెచ్‌ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఓఆర్‌ఆర్‌పై టోల్ వసూలుతోపాటు రోడ్లకు మరమ్మతులు, లైట్లు, పచ్చదనం, తదితర పనులన్నింటినీ హెచ్‌జీసీఎల్ పర్యవేక్షిస్తోంది. తాజా ఒప్పందం వల్ల ఆ బాధ్యతలన్నింటినీ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించనుంది. టోల్ ద్వారా వచ్చే ఆదాయం ఆ సంస్థకే లభించనుంది. ప్రస్తుతం ఔటర్‌పై నిత్యం సుమారు 1.3 లక్షల నుంచి 1.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
టోల్ వసూలు ద్వారా ఏటా సుమారు రూ. 452 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. ఏటా టోల్ రుసుమును కొంత మేరకు పెంచడం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. ఈగిల్ ఇన్‌ఫ్రా సంస్థ ఇప్పటివరకు టోల్ వసూలు చేస్తుండగా ఇకపై ఐఆర్‌బీ సంస్థ పరిధిలోకి వెళ్లనుంది. రహదారుల నిర్వహణలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇప్పటివరకు దేశంలో టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (టీఓటీ) పద్ధతి అత్యుత్తమ విధానంగా పేరొందింది. ఎన్‌హెచ్‌ఏఐ 2016 నుంచి ఈ పద్ధతిని అవలంబిస్తోంది. మొత్తం 1,600 కి.మీ.కిపైగా మార్గాన్ని ఈ పద్ధతిలో 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లీజుకు ఇచి్చంది. ఔటర్ లీజు విషయంలోనూ ఇదే పద్ధతిని అమలు చేసినట్లు అధికారులు తెలిపారు.
పెట్టుబడులకు ఊతం: సీఎం కేసీఆర్
ఈ లీజు ఒప్పందంపట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా చక్కటి ఒప్పందమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులకు ఇది ఊతమిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపునకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, వ్యాపార సంస్థలకు అనుకూలమైన విధానాలను అమలు చేయడం వల్లే అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు తీస్తోందన్నారు.
ఇదీ ఔటర్ స్వరూపం..
హైదరాబాద్ నగరం చుట్టూ 8 వరుసల్లో ఉన్న 158 కి.మీ. నిడివిగల ఔటర్ రింగురోడ్డు నిర్మాణం ఉమ్మడి ఏపీలో 2006లో మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని 2018లో పూర్తి చేసింది. ఔటర్‌కు 44 చోట్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉన్నాయి. 22 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేశారు. ఔటర్ మీదుగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా చేరుకోవచ్చు.
నెహ్రూ ఓఆర్‌ఆర్ నిడివి: 158 కిమీ.
వరుసలు: 8
నిత్యం రాకపోకలు సాగించే వాహనాలు: 1.3 నుంచి 1.5 లక్షలు
ఏటా టోల్ వసూలు: రూ. 452 కోట్లు (సుమారుగా).
ఇది కూడా చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ ఖరారు.. పాతరోడ్లను కలుపుతూ..
Comments
Please login to add a commentAdd a comment