TS High Court Hearing On Revanth Reddy's Petition On ORR Tollgate Tenders - Sakshi
Sakshi News home page

ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు

Published Fri, Jul 28 2023 2:55 PM | Last Updated on Fri, Jul 28 2023 3:42 PM

Ts High Court Hearing On Revanth Petition On Orr Tollgate Tenders - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ఓఆర్‌ఆర్ టోల్‌గేట్‌ టెండర్లపై రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?. ఆర్టీఐ ఉన్నది ఎందుకు? ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో వారు ఏం మాట్లాడతారంటూ హైకోర్టు ప్రశ్నించింది.

2 వారాల్లోగా రేవంత్‌ అడిగిన వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. వివరాలు ఇచ్చేందుకు సిద్ధం అని కోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. తదుపరి విచారణ ఆగస్టు 4కి కోర్టు వాయిదా వేసింది.

కాగా, నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) టోల్‌ నిర్వహణ బదిలీ (టీవోటీ)కి సంబంధించిన సమాచారాన్ని, సమాచార హక్కు చట్ట ప్రకారం కోరినా అధికారులు ఇవ్వడం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 14న దరఖాస్తు చేసినా ఇప్పటివరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అధికారుల తీరు ఆర్టీఐ చట్టంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14ను కూడా ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు.

తాను మే 1న తొలిసారి దరఖాస్తు చేయగా, మే 23న అరకొర సమాచారం మాత్రమే ఇచ్చారని వివరించారు. దీంతో జూన్‌ 14న మరోసారి దరఖాస్తు చేశానన్నారు. ఓఆర్‌ఆర్‌ లీజు నివేదికలు, 30 ఏళ్లకు ఇవ్వడంపై మంత్రిమండలి నిర్ణయం, 2021–22, 2022–23 సంవత్సరాలలో ఆర్జించిన మొత్తం ఆదాయానికి సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. లీజు పారదర్శకంగా జరిగిందా? లేదా? తెలుసుకోవడానికి ఈ సమాచారం కీలకం అన్నారు.
చదవండి: లిక్కర్‌ స్కాం: కల్వకుంట్ల కవిత పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ), హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ప్రజా సంబంధాల అధికారి, ఎండీ(ఎఫ్‌ఏసీ)లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆర్‌టీఐ చట్టం ప్రకారం కోరిన సమాచారం ఇచ్చేలా ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఓఆర్‌ఆర్‌ నిర్వహణ, టోలు వసూలు బాధ్యతలను 30 ఏళ్ల పాటు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవెలప్‌మెంట్‌ లిమిటెడ్, ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement