సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్) చుట్టూ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు మరో ఐదు కొత్త మెట్రో కారిడార్లు నెలకొల్పే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ‘మెట్రో’ ప్రతిపాదనలపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపే అవకాశముంది.
మెట్రో ప్రాజెక్టు విస్తరణ రెండో దశలో భాగంగా బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు కొత్త లైన్ల నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోవడం ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. దీనికి పరిష్కారంగానే మెట్రో ప్రాజెక్టుల విస్తరణ, కొత్త కారిడార్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీటితో పాటు మొత్తం 22 అంశాలతో కూడిన ఎజెండాపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
కేంద్ర చట్టం అమలుకు వీలుగా..
మానవ ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి చికిత్సల (ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో అందుబాటులో ఉండే వాటితో పాటు లేజర్ ట్రీట్‌మెంట్, కట్లు లాంటి అన్నిరకాల చికిత్సలకు) కోసమైనా ఏర్పాటు చేసే వైద్య కేంద్రాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ కలి్పంచే విధంగా ఇప్పటికే చట్టం అమల్లో ఉంది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు గాను ఇప్పటికే అమల్లో ఉన్న తెలంగాణ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లి‹Ùమెంట్స్ (రిజి్రస్టేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ –2002 (యాక్ట్ 13 ఆఫ్ 2002) బిల్లును రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
దీనిపై కేబినెట్ సోమవారం నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేసిన నాలుగు టిమ్స్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించే తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్–2022 బిల్లును కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. కాగా నిమ్స్ ఆసుపత్రి విస్తరణ అంచనా వ్యయాన్ని రూ.1,571 కోట్ల నుంచి రూ.1,698 కోట్లకు పెంచే ప్రతిపాదనలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఉద్యోగుల కోసం పీఆర్సీ, ఇతర అంశాలు..
నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెచ్‌ఎండీఏ ద్వారా వేలం వేసే ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా మల్యాలలో కొత్త ఉద్యాన కళాశాల ఏర్పాటు, వరంగల్ నగర శివారులోని మామునూరు ఎయిర్‌పోర్టులో టెరి్మనల్ భవనం, ప్రస్తుత రన్‌వే విస్తరణకు గాను అవసరమైన భూసేకరణ, కొత్త మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఏర్పాటు, అనాథల సంక్షేమం కోసం రూపొందించిన కొత్త విధానంపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. అలాగే సింగరేణి కాలరీస్ సంస్థకు బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో వెయ్యి చదరపు గజాల ప్రభుత్వ భూమిని మార్కెట్ ధరకు విక్రయించే ప్రతిపాదనను కూడా కేబినెట్ ఎజెండాలో చేర్చారు.
ఇక్కడ సింగరేణి క్వార్టర్లు, గెస్ట్‌హౌస్, ఫెసిలిటేషన్ సెంటర్ నిర్మాణం కోసం భూమి కావాలని సింగరేణి సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఇక విద్యుత్ కొనుగోళ్ల బకాయిల చెల్లింపు, ట్రాన్స్‌మిషన్ చార్జీల చెల్లింపునకు గాను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ), బ్యాంకుల నుంచి ట్రాన్స్‌కో సేకరించనున్న రూ.5 వేల కోట్ల రుణాలకు పూచీకత్తుపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటు, ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ, వర్షాలు, వరదలతో జరిగిన నష్టం, సహాయ..పునరుద్ధరణ చర్యలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఆసరా పింఛన్ల పెంపు తదితర అంశాలపై కూడా సోమవారం జరగనున్న మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గవర్నర్ తిప్పి పంపిన బిల్లులపై చర్చ
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన నాలుగు బిల్లులపై పలు వివరణలను కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని ప్రభుత్వానికి తిప్పి పంపారు. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ బిల్లు, తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లులను గవర్నర్ గతంలో వెనక్కు పంపారు. గవర్నర్ అడిగిన వివరణలకు సమాధానమిచ్చే విధంగా ఈ బిల్లుల్లో మార్పులు చేస్తూ రూపొందించిన ముసాయిదాలపై చర్చించే ప్రతిపాదనను కేబినెట్ ఎజెండాలో చేర్చారు. మంత్రివర్గ భేటీలో చర్చించిన తర్వాత వచ్చే నెల 3వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో వాటిని ప్రవేశపెట్టి ఆమోదించి మళ్లీ గవర్నర్‌కు పంపే అవకాశముందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment