‘పునరుద్ధరణ’కు మంగళం!
సాక్షి, హైదరాబాద్: చిన్నతరహా ఖనిజాల మైనింగ్ లీజులు (ఎంఎల్), గ్రానైట్ తదితర క్వారీ లీజులు (క్యూఎల్) గడువు ముగిస్తే ఇక.. ఏకంగా రద్దయినట్లే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మైనింగ్ పాలసీని రూపొందించింది. ఈ పాలసీ ఈనెల ఒకటో తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదం పొందాల్సి ఉంది. ఈ మేరకు ఎజెండాలోనూ చేర్చారు.అయితే, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇరకాటంలో పడటంతో సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో మైనింగ్ పాలసీపై చర్చించలేదు. దీంతో ఇది వచ్చే కేబినెట్ సమావేశానికి వాయిదా పడింది.
గడువు ముగిసిన మైనింగ్ లీజులను లీజుదారుల దరఖాస్తు ఆధారంగా పునరుద్ధరించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కొత్త మైనింగ్ పాలసీ ప్రకారం ఈ పద్ధతికి మంగళం పలకనున్నారు. తమ అనుయాయులకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం రాజకీయ కోణంలో ఈ కొత్త్త విధానాన్ని రూపొందించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూగర్భ గనుల శాఖకు చెందిన అధికారులను పక్కనపెట్టి ప్రభుత్వ పెద్దలు ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా తమకు అనుగుణంగా ఉండేలా మైనర్ మినరల్ పాలసీని తయారు చేయించుకున్నారు. కేపీఎంజీ అనే ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు పరిశ్రమలు - వాణిజ్య శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీలు)గా పనిచేస్తున్నారు. ఈ ఓఎస్డీలు కొత్త మైనింగ్ పాలసీని రూపొందించారు. దీనినే భూగర్భ గనుల శాఖ అధికారులు కేబినెట్ ఆమోదం నిమిత్తం ప్రతిపాదించారు.