ఇది చంద్రబాబుకు బాగా పాత అలవాటు | KSR Comments On Chandrababu Naidu Political Strategies | Sakshi
Sakshi News home page

ఇది చంద్రబాబుకు బాగా పాత అలవాటు

Published Fri, Jul 19 2024 1:33 PM | Last Updated on Fri, Jul 19 2024 1:43 PM

KSR Comments On Chandrababu Naidu Political Strategies

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలను పిచ్చిపత్రాలుగా, వ్యర్ధ పత్రాలుగా మార్చేశారా అన్న అభిప్రాయం కలుగుతోంది. అయినదానికి, కానిదానికి శ్వేతపత్రాలు ఇవ్వడం ద్వారా వాటి విలువను ఆయనే పొగొట్టారనిపిస్తుంది. ఏవైనా ప్రధాన అంశాలపై వైట్ పేపర్స్ ఇవ్వడం సాధారణంగా జరుగుతుంటుంది. అంతే తప్ప-ప్రతి చిల్లర విషయానికి ఉన్నవి, లేనివి కలిపి కాకి లెక్కలతో పత్రాలు ఇస్తే అది వృధా ప్రయాసే అవుతుంది. వాటి సీరియస్ నెస్ కూడా పోతుంది. ప్రస్తుతం ప్రభుత్వంలో తాము ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలో అర్దంకాక, ఎలా ప్రజలను మభ్య పెట్టాలా అన్నదానిపై ఎడతెగని ఆలోచనలు చేస్తున్న నేపద్యంలో ఈ శ్వేతపత్రాలను ముందుకు తీసుకు వచ్చారనిపిస్తుంది. చంద్రబాబుకు ఇది బాగా పాత అలవాటు.

1994లో ఈయన ఎన్‌టీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రిగా ఉండేవారు. అప్పుడు కూడా రెవెన్యూ, ఫైనాన్స్ శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ ఇచ్చారు. తదుపరి ఎన్‌టీఆర్‌ను పడదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల వాగ్దానాలను ఎగవేయడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ తంతును సాగించారు. ఆ తర్వాత మద్య నిషేధం ఎత్తివేశారు. రేషన్ బియ్యం రేటు పెంచారు. 2004 ఎన్నికలకు ముందు కూడా వాస్తవ పత్రాలు అంటూ ప్రభుత్వ ప్రచార పత్రాలు విడుదల చేశారు. రాష్ట్రంలో ఎంత అభివృద్ది చేసింది చెప్పడానికి ఆయన ఆ పత్రాలు ఇచ్చారు. కాని జనం వాటిని నమ్మలేదు.. టీడీపీని ఓడించారు.

2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలాగే పత్రాల కార్యక్రమం నిర్వహించారు. 2019 ఎన్నికల సమయంలో కూడా అభివృద్ది నివేదికలు అంటూ హడావుడి చేశారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక యధాప్రకారం ఈ డ్రామా నడుపుతున్నారు. ఇవి అర్ధవంతంగా ఉంటే తప్పుకాదు. కాని అర్ధం, పర్ధం లేకుండా తెలుగుదేశం పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిలో వచ్చిన పచ్చి అబద్దాలను, తాను ఎన్నికల ముందు చేసిన విమర్శలను శ్వేతపత్రాలలో భాగం చేయడం ద్వారా ఆ పత్రాలకు అసలు ప్రాధాన్యత లేకుండా చేసుకున్నారు. సహజ వనరుల దోపిడీ పేరుతో ఇచ్చిన శ్వేతపత్రం సరిగ్గా అలాగే ఉంది.

అసలు ఇలాంటి పత్రాన్ని ఇచ్చారంటేనే ఈ ప్రభుత్వం ఆలోచన స్థాయి ఏ రకంగా ఉందో తెలుస్తుంది. ఇసుక, మైనింగ్‌లో రూ.19,137 కోట్ల దోపిడీ జరిగిందని కాకి లెక్క చెప్పారు. అంకెల విషయంలో చంద్రబాబు స్టైలే వేరు. ఆయన ఆ రోజుల్లో విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేయించినా, లేదా ఎదుటివారిపై విమర్శలు చేసినా, జనమే ఆశ్చర్యపోయేలా లెక్కలు చెబుతుంటారు. అవి అబద్దాలు అని తెలిసినా, ఆయన మొహమాటపడరు. ఒకే అంకెను, పదే-పదే ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నది ఆయన ధీరి. ఆ విషయంలో కొన్నిసార్లు సఫలం అయ్యారు కూడా. తన హయాంలో ఇసుక చితం అంటూ గోల్ మాల్ జరిగినా అది గొప్ప విషయంగా చెబుతారు. 2014టరమ్‌లో టీడీపీ, ఎమ్మెల్యేలు, నేతలు ఇష్టారాజ్యంగా ప్రజలనుంచి డబ్బు వసూలు చేసి ఇసుక సరఫరా చేసేవారు. ఆ సొమ్మంతా ప్రభుత్వ ఖజానాకు కాకుండా, టీడీపీ వారి జేబులలోకి వెళ్లేది.

జగన్ ప్రభుత్వం వచ్చాక ఇసుకకు ఒక విధానం తెచ్చి నిర్దిష్ట రేటు పెట్టి జనానికి సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వానికి ఈ ఐదేళ్లలో నాలుగువేల కోట్లకు పైగా ఆదాయం తీసుకు వచ్చారు. అదేమో తప్పట. 2014టరమ్‌లో చంద్రబాబు టైమ్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత అరాచకంగా ఇసుకను దోపిడీ చేశారో పూర్తిస్థాయిలో కాకపోయినా, కొన్ని విషయాలను వారి పత్రిక ఈనాడు లోనే వార్త వచ్చింది. ఆ సంగతి ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు. ఇసుక కాంట్రాక్టు సంస్థలు వంద కోట్ల జీఎస్టీ ఎగవేశాయని ఆయన అంటున్నారు. దానిపై చర్య తీసుకోవచ్చు. తవ్వకాలలో అక్రమాలు జరిగాయని అన్నారు. గత టరమ్‌లో చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో కృష్ణానదిలో జరిగిన ఇసుక దోపిడీపై ఎన్.జి.టి స్పందించి వంద కోట్ల జరిమానా విధించిన విషయం గురించి ఎందుకు చెప్పలేదు.

అటవీ, మైనింగ్ శాఖలకు ఒకే మంత్రి ఉన్నారట. అంటే చంద్రబాబు లక్ష్యం ఏమిటో అర్ధం అవుతుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ గా చేసుకుని చంద్రబాబు ఏదో వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తూనే ఉంది. అటవీ,మైనింగ్ రెండు శాఖలు ఒకే మంత్రికి ఇవ్వడం తప్పు అయితే,1994 లో ఈయనకు రెవెన్యూ, ఆర్దిక శాఖలను ఎన్‌టీఆర్‌ఎందుకు ఇచ్చారు?ఈ రెండు శాఖలను గత ఐదు దశాబ్దాలలో ఏ ప్రభుత్వంలోను ఒకరికే ఇవ్వలేదు. అల్లుడు కాబట్టే చంద్రబాబుకు ఎన్.టి.ఆర్ ఆ శాఖలు కేటాయించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.

గ్రానైట్‌ లీజ్ లపై పలు ఆరోపణలు చేశారు. 155 గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ తనిఖీలు జరిపించి, అందులో 23 మందికే రూ.614కోట్ల జరిమానాలు వేశారని అంటున్నారు. వారు తప్పులు చేయకుండానే ఫైన్‌లు వేశారా? అన్నది కదా చెప్పాలి. చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను గ్రానైట్ లీజుల విషయంలో ఎలా బెదిరించి టీడీపీలోకి తీసుకు వచ్చారో అందరికి తెలుసు. సరస్వతి పవర్ సంస్థకు సున్నపురాయి లీజును పునరుద్దించడం కూడా తప్పేనట.

మైనింగ్ శాఖ ఆదాయం తన హయాంలో రూ.966కోట్లు నుంచి రూ.2643కోట్లకు పెరిగితే, జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఏడాదికి రూ.3425కోట్లకే చేరుకుందని అంటున్నారు. ఒకవైపు తప్పు చేసిన కంపెనీలకు జరిమానాలు విధిస్తే ఆక్షేపిస్తారు. ఇంకోవైపు మైనింగ్ శాఖ ఆదాయం ఇంకా పెరగాల్సిందని చెబుతారు. రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉన్నా గనుల శాఖ ఆదాయం పెరిగిందని మాత్రం ఒప్పుకోరు. ఐదేళ్లలో మైనింగ్ ఆదాయం పదివేల కోట్లు పెరిగితే చంద్రబాబు మాత్రం 19వేల కోట్ల దోపిడీ అని చెబుతున్నారు. అదెలాగో మాత్రం స్పష్టంగా చెప్పరు.
 


ఇంకో సంగతి చెప్పాలి. జగన్ ప్రభుత్వం 83లక్షల టన్నుల ఇసుకను పోగుచేసి నిల్వచేస్తే అందులో సుమారు నలభై లక్షల టన్నుల మేర కూటమి ప్రభుత్వం రాగానే, టీడీపీ, జనసేన నేతలు దోపిడీకి పాల్పడ్డారన్నది అభియోగం. దానిపై కూడా శ్వేతపత్రం ఇవ్వవచ్చు కదా! చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వపరంగా విచారణ జరిపించి చర్య తీసుకుంటే ఎవరు కాదంటారు. అలాకాకుండా ఈ రకంగా అవాస్తవాలతో పత్రాలు ఇస్తే ఎవరికి లాభం. కేవలం జగన్‌ను బదనాం చేయాలని, ఎలాగైన పెద్దిరెడ్డిని ఇబ్బంది పెట్టాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ పత్రాల దందా నడుపుతున్నారని అనుకోవాలి.

ఇక కబ్జాల పర్వం గురించి పలు ఆరోపణలు చేశారు. వీటిలో మెజార్టీ టీడీపీ పత్రికలలో వచ్చిన పచ్చి అబద్దాలే. ఉదాహరణకు శారదా పీఠానికి లీజుపై ఇచ్చిన భూములను అదేదో తక్కువ ధరకు అమ్మినట్లు చంద్రబాబు చెబుతున్నారు. పోనీ ఇలాంటివి చంద్రబాబు ఎప్పుడు చేయలేదా అంటే అదేమీ లేదు. 2004ఎన్నికలకు ముందు ఐఎమ్జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ గచ్చిబౌలీ ప్రాంతంలో 450ఎకరాల భూమిని ఉత్తపుణ్యానికి కట్టబెట్టారన్న ఆరోపణ ఉంది. దానిపై ఇప్పటికీ కోర్టులో విచారణ జరుగుతోంది. వైఎస్ ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుంది. అష్టావధానం చేసే ఒక ప్రముఖుడికి కూడా హైటెక్స్ వద్ద అత్యంత విలువైన భూమిని ఎవరి సిఫారస్ తో ఇచ్చారో అప్పట్లో ప్రచారం జరిగింది.

అదెందుకు చంద్రబాబు కుటుంబానికి చెందినవారు కోరితేనే కదా గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్ సంస్థకు భూములు ఇచ్చారు. అవన్ని కూడా తప్పులు అవుతాయా? లేదా? అన్నది చెప్పాలి. నిజానికి చంద్రబాబు ఇవ్వవలసిన వివరాలు ఏమిటంటే జగన్ ప్రభుత్వ హయాంలో నిజంగా ఆక్రమణలు జరిగితే ప్రకటించవచ్చు. తదనంతర చర్యలు తీసుకోవచ్చు. దానికి ఈ పత్రాల గోల అక్కర్లేదు. అదే టైమ్‌లో జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో టీడీపీ నేతల అక్రమ స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు, ఇతర కబ్జాదారుల భూ ఆక్రమణలను తొలగించి ఐదువేల కోట్ల విలువన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అవి కరెక్టా? కాదా? అన్నది వివరించాలి కదా! విశాఖలో టీడీపీ ఎంపీ భరత్‌కు చెందిన గీతం యూనివర్శిటీ ఆక్రమించిన నలభై ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ విషయాన్ని పత్రంలో ఎందుకు చెప్పలేదు.
 


ఆ భూమిని తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా?అలాగే టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆక్రమించారన్న అభియోగంపై కొన్ని భూములను వెనక్కి తీసుకున్నారు. అది నిజమైనదా? కాదా? అన్నది చెప్పి ఉంటే జనానికి విషయం తెలిసేది. 2014 టరమ్‌లో తానే సీఎంగా విశాఖలో భూ అక్రమాలపై సిట్ వేశారు. ఆ సందర్భంలో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఒక మంత్రితో సహా కొందరు టీడీపీ నేతలపైనే ఆరోపణలు గుప్పిస్తూ సిట్ కు వివరాలు ఇచ్చారు. వాటిని ఇప్పుడైనా చంద్రబాబు బయటపెట్టవచ్చు కదా! అలా చేయకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. అస్సైన్డ్ భూములకు సంబందించి జగన్ ప్రభుత్వం చట్టం తెచ్చి వారికి విక్రయ హక్కులు కల్పిస్తే అదేదో నేరమన్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అది చట్ట విరుద్దం అని భావిస్తే ఆయన ఆ చట్టాన్ని రద్దు చేసి ఎస్సి, ఎస్టిలకు జగన్ ఇచ్చిన సదుపాయాన్ని తొలగించవచ్చు.

ఆ పని ఆయన చేయగలరా? అమరావతి ప్రాంతంలో సుమారు నాలుగువేల ఎకరాల అస్సైన్డ్ భూమిని టీడీపీ నేతలు, ఇతరులు చౌకగా కొనుగోలు చేసి, తదుపరి వాటిని రెగ్యులరైజ్ చేసుకున్నారన్న ఆరోపణ వచ్చింది. అమరావతిలో టీడీపీ హయాంలో పలు భూ స్కామ్‌లు జరిగాయని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరోపించింది. వీటిపై గత ప్రభుత్వం పలు ఆధారాలతో కేసులు పెట్టింది. అవి అన్యాయమైనవా?లేక నిజమైనవో ఎందుకు చంద్రబాబు చెప్పలేదో తెలియదు. ఇలాంటివి కాకుండా ఊరికే పనికిరాని అంశాలతో ఎన్నికల ముందు చేసిన ఆరోపణలనే శ్వేతపత్రాలలో పేర్కొంటే వీటి లక్ష్యమే నీరుకారిపోయినట్లు అవుతుంది కదా! విధానపరమైన కీలక అంశాలలో ఇవ్వవలసిన ఈ వైట్ పేపర్లను ఒక హాస్యాస్పద వ్యర్ద ప్రక్రియగా మార్చడం వల్ల జరిగే ప్రయోజనం శూన్యం అని చెప్పకతప్పదు.

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement