
ప్రతిపాదిత ఎన్‌ఎస్‌పీ కెనాల్స్‌కు చెందిన స్థలం
చిలకలూరిపేట: గతంలో టీడీపీ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం విక్రయించేందుకు, ఇప్పుడు లీజు ప్రాతిపదికన అప్పగించేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. చిలకలూరిపేటలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేకున్నా వాటి నిర్మాణానికి ఆసక్తి చూపని అధికార యంత్రాంగం అమాత్యుల వారి మెప్పు కోసం విలువైన ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీకి అప్పగించేందుకు హైరాన పడుతున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో నాగార్జున సాగర్ కెనాల్స్ సంస్థకు చెందిన భూమిని దక్కించుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. భవన నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకున్నా ఇప్పటికే ఒకసారి రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన నిర్వహించారు.
గతేడాది ఆగస్టు 31న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించి, టేబుల్ అజెండాగా 20 సెంట్ల భూమిలో టీడీపీ కార్యాలయ భవనం నిర్మించుకొనేందుకు తగు చర్యలకై ఆమోదించారు. ఈ విషయమై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అప్పట్లోనే తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అప్పట్లో స్థలాన్ని విక్రయించేందుకు తీర్మానం చేశారు. తిరిగి పం«థా మార్చి అదే స్థలాన్ని టీడీపీ కార్యాలయం నిర్మించుకొనేందుకు లీజు చెల్లించే నిబంధనపై స్థలం అప్పగించేందుకు బుధవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అజెండాలో చేర్చి ఆమోదించారు. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్‌పర్సన్‌కు డిసెంట్ నోటును అందజేశారు. న్యాయస్థానం నిర్మించేందుకు ఇవ్వాలని న్యాయవాదులు కోరిన విషయాన్ని ప్రస్తావించారు.
నిబంధనలకు విరుద్ధంగా శంకుస్థాపన..
చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఎన్‌ఆర్‌టీ రోడ్డులోని ఎన్‌ఎస్‌పీ కెనాల్స్ డివిజనల్ కార్యాలయంతో పాటు, సిబ్బంది క్వార్టర్లు ఉన్నాయి. ఈ భూమిలో సర్వేనంబర్ 123సీ–2ఈలో 20 సెంట్ల స్థలం టీడీపీ కార్యాలయ భవన నిర్మాణానికి లీజు ప్రాతిపదికన ఇవ్వాలని తీర్మానించటం వివాదంగా మారింది. ఒక ప్రభుత్వ శాఖకు చెందిన స్థలాన్ని మరో శాఖకు మార్చాలన్నా ఇతర సంస్థలకు విక్రయించాలన్నా, లీజుకు కేటాయించాలన్నా ప్రభుత్వం తప్పనిసరిగా జీవో జారీ చేయాల్సి ఉంటుంది. కేవలం ప్రతిపాదనల స్థాయిలోనే 2016 ఏప్రిల్ నెలలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిబంధనలు కాదని ఏకంగా శంకుస్థాపన చేయటం అధికార దుర్వినియోగానికి అద్దం పట్టింది. టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయించే ప్రతిపాదనలు తెలుసుకొన్న ఎన్‌ఎస్‌పీ కెనాల్స్ సిబ్బంది ఈ ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ 2016లోనే జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం కూడా పంపారు.
కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు
ఇదే స్థలంలో బాలికల వసతి గృహం నిర్మించేందుకు నాడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు 2003 నవంబర్ 14న శిలాఫలకం వేశారు. ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. తదుపరి ఎమ్మెల్యేగా ఎన్నికైన మర్రి రాజశేఖర్ టీటీడీ బోర్డు మెంబర్‌గా 2009లో ఆ స్థలం పక్కనే టీటీడీ కల్యాణ మండప నిర్మాణానికి ప్రతిపాదించారు. అయితే ఆ తదుపరి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రత్తిపాటి ఆ ప్రతిపాదనలను పట్టించుకోలేదు. అనంతరం న్యాయస్థానం నిర్మాణానికి బార్ అసోసియేషన్ సభ్యులు ఈ స్థలం కేటాయించాలని కోరుతూ వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఇక్కడ సెంటు రూ. 25లక్షలకు పైబడి ఉంది. ఆ స్థలాన్ని టీడీపీ కార్యాలయ భవనం కోసం నామమాత్రపు ధరకు 20 సెంట్లు భూమిని లీజుకు కేటాయించేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment