సాక్షి, హైదరాబాద్: బస్సులు సరిపోక ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ అద్దె బస్సులను కొనుక్కునే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3,100 అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు సొంతంగా బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిచ్చి తిప్పుతున్న విషయం తెలిసిందే. 2019లో ఆర్టీసీలో సమ్మె జరిగిన సమయంలో ప్రభుత్వం వాటిని పెంచుకునేందుకు అనుమతించి టెండర్లు పిలవడంతో వాటి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కానీ ఇప్పుడు వాటిల్లో చాలా బస్సులు నడవటం లేదు. వాటిని కొనేందుకు ఆర్టీసీ ఆలోచిస్తోంది.
వాటినే ఎందుకు?
ఆర్టీసీ కొన్నేళ్లుగా సరిపడినన్ని బస్సులు కొనటం లేదు. 2015లో 800 బస్సులు కొనటం మినహా ఆ తర్వాత కొత్తవి సమకూర్చుకోలేకపోయింది. దీంతో క్రమంగా ఉన్న బస్సులు పాతబడి డొక్కుగా మారిపోయాయి. గత్యంతరం లేక వాటినే మరమ్మతు చేసుకుంటూ, నిత్యం మెయింటెనెన్స్ పనులు జరుపుతూ నెట్టుకొస్తోంది. కొన్ని సరిగా నడవని పరిస్థితి ఉంది.
ఆదివారం వికారాబాద్ శివారులో అనంతగిరి గుట్ట దిగుతూ ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఇది డొక్కు బస్సు కావటం వల్లనే అదుపు తప్పిందని కార్మిక సంఘాలు ఆరోపణలు ఎక్కుపెట్టాయి. ఇలాంటి బస్సులు దాదాపు రెండున్నర వేలున్నాయని పేర్కొంటున్నారు. ఇటీవలే 675 కొత్త బస్సుల కోసం టెండర్ల ప్రక్రియ ముగిసింది. అవి వచ్చే మార్చి నాటికి చేతికందబోతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న కొరతను అవి తీర్చలేవు. ఈ నేపథ్యంలో అద్దె బస్సులవైపు ఆర్టీసీ దృష్టి సారించింది.
నిష్క్రమించినవి 600
కొన్ని నెలలుగా గిట్టుబాటు ఉండటం లేదంటూ అద్దె బస్సు నిర్వాహకులు క్రమంగా వైదొలుగుతూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 600 బస్సులు అలా అర్టీసీ నుంచి నిష్క్రమించాయి. ఇంకా చాలామంది యజమానులు వాటిని విరమించుకునే యత్నంలో ఉన్నారు. ఆరేడేళ్ల వయసున్న బస్సులను వారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల ధరకు విద్యాసంస్థలు, ఇతర సంస్థలకు అమ్ముకుంటున్నారు.
ఆర్టీసీ అదే కొత్త బస్సు కొనాలంటే రూ.35 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుంది. తక్కువ ధరలో వస్తున్నందున ఆ బస్సులను కొని సొంత వర్క్‌షాపులో మెరుగుపరిస్తే కనీసం ఏడెనిమిదేళ్ల వరకు ఇబ్బంది ఉండదనేది అధికారుల యోచన. ఆ బస్సుల కొనుగోలు ఎంతవరకు సరైన నిర్ణయమనేది తేల్చేందుకు ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చే నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. ఈలోపు ఎన్ని అద్దె బస్సులు అమ్మకానికి ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీ కింద.. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం
Comments
Please login to add a commentAdd a comment