సాక్షి, సిటీబ్యూరో: చాలా రోజులుగా పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు కోవిడ్ మూడో ఉధృతి మరింత గట్టి షాక్‌నిచ్చింది. సంక్రాంతి వరకు సిటీ బస్సులు కళకళలాడాయి. గత వారం రోజులుగా ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సిటీ బస్సులు సగానికి పైగా ఖాళీగా కనిపిస్తున్నాయి.
బస్సెక్కేవారేరీ...
► నగరంలో ప్రయాణికుల రాకపోకలు భారీగా తగ్గాయి. రోజు రోజుకూ కోవిడ్ కేసులు భారీగా నమోదవుతుండంతో జనం స్వీయనియంత్రణ పాటిస్తున్నారు. అవసరమైతేనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో బస్సెక్కేవారి సంఖ్య తగ్గింది. సొంత వాహనాలు ఉన్న వారు సైతం తప్పనిసరి అవసరాలకే బయటకు వస్తున్నారు. దీంతో రోడ్లపైన వాహనాల రద్దీ కూడా తగ్గింది.
► సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు 2750 సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. 30వేల ట్రిప్పులకు పైగా తిరుగుతాయి. కోవిడ్ రెండో ఉద్ధృతి అనంతరం అన్ని రూట్లలోనూ పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధరించారు. నగర శివార్లలోని విద్యాసంస్థలకు రాకపోకలు సాగించే విద్యార్ధుల కోసం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 1500 బస్సులు నడిచేవి.
► ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు తిరిగి ఆన్‌లైన్ బోధన ప్రారంభించడంతో విద్యార్థులు ఇళ్లకు పరిమితమయ్యారు.మరోవైపు కోవిడ్ నేపథ్యంలోనే అనేక సంస్థలు వర్క్‌ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. దీంతో సిటీ బస్సుల వినియోగం చాలా తగ్గింది .
పడిపోయిన ఆక్యుపెన్సీ...
► సంక్రాంతికి ముందు ప్రయాణికుల ఆక్యుపెన్సీ 65శాతం వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా 45శాతానికి తగ్గినట్లు అంచనా.
► కొన్ని రూట్లలో ఇంధనం ఖర్చులు కూడా లభించడం లేదని, ట్రిప్పులను రద్దు చేసుకోవలసి వస్తుందని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అదేబాటలో క్యాబ్‌లు...
► క్యాబ్‌లలోనూ ప్రయాణికుల రాకపోకలు తగ్గాయి. ఐటీ కారిడార్‌లకు ప్రయాణాలు తగ్గాయి. గతంలో రోజుకు 60 వేల క్యాబ్‌లు నడిస్తే ఇప్పుడు వాటి సంఖ్య 30వేలకు పడిపోయిందనిడ్రైవర్లు చెబుతున్నారు.
► క్యాబ్‌లు నడిపేందుకు ఓలా, ఉబర్ సంస్థలు సరైన సదుపాయాలు కల్పించడం లేదని తెలంగాణ క్యాబ్ అండ్ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ జేఏసీ అధ్యక్షులు షేక్ సలావుద్దీన్ తెలిపారు.
రవాణా రంగంపై మరోసారి కోవిడ్ పిడుగు పడింది. కొద్ది రోజులుగా పెరిగిన కరోనా ఉధృతితో ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. విమానాలు, రైళ్లతో పాటు బస్సుల్లోనూ ప్రయాణికులు తగ్గారు. కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)పై పడింది. ఇదిలా ఉండగా విమాన ప్రయాణికుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. సర్వీసులు ప్రారంభించిన కొద్ది రోజులకే విమానయానరంగంపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది.
Comments
Please login to add a commentAdd a comment