అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో పర్యాటక ఆధారిత ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ఇటు లీజు మొత్తం, అటు ఆదాయంలో ప్రతిపాదిత వాటా చెల్లించకుండా బకాయిపడ్డ బడా సంస్థలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలో వాటి నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి, బకాయి మొత్తం చెల్లించాల్సిందిగా గడువు విధించనుంది. చెల్లించని పక్షంలో ఆయా సంస్థలకు నీళ్లు, కరెంటు సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో నోటీసులు జారీ కానున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో స్థలాల కేటాయింపు
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంస్థలు.. తమకు ప్రభుత్వ స్థలం కేటాయిస్తే హోటళ్లు, సినిమా హాళ్లు, గోల్ఫ్ కోర్సులు, ఇతర మనోరంజక ప్రాజెక్టులు నిర్మిస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. దీంతో ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. అలాంటి వాటిల్లో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్, జలవిహార్, స్నో వరల్డ్ లాంటి వాటితో పాటు మరెన్నో హోటళ్లు ఉన్నాయి.
ఇవి లీజు మొత్తంతో పాటు రాబడిలో నిర్ధారిత వాటాను కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అలా కొన్ని సంస్థలు లీజు మొత్తం చెల్లిస్తుండగా, రాబడిలో కొంతమేర చెల్లిస్తూ వచ్చాయి. కొన్ని లీజు ఇస్తూ రాబడిలో వాటా చెల్లించటం లేదు. కొన్ని సంస్థలు లీజు మొత్తాన్ని కూడా సరిగా చెల్లించటం లేదు. ఇటీవల కోవిడ్ వల్ల ఆదాయం సరిగా లేదని చెప్తూ కొన్ని సంస్థలు లీజు మొత్తం ఇవ్వటం లేదు. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ.140 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి.
ఎన్నిసార్లు అడిగినా..
అధికారులు ఎన్నిసార్లు కోరినా నిర్వాహకులు బకాయిలు చెల్లించటం లేదు. దీంతో వాటిపై గట్టిగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని సంస్థలు కోర్టులను ఆశ్రయించిన నేపథ్యంలో, కోర్టు కేసులు కూడా సమసిపోయేలా చేసి తగు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ గురువారం అధికారులతో సమావేశమై చర్చించారు. బకాయి పడిన సంస్థలకు మంచినీరు, కరెంటు సరఫరా నిలిపివేసే విషయమై సంబంధిత విభాగాలకు లేఖలు రాయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment