tourism projects
-
రాష్ట్రంలో పంజాబ్ పాత్రికేయుల బృందం పర్యటన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు పంజాబ్‌కు చెందిన పాత్రికేయుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్నట్టు ఏపీటీడీసీ ఎండీ కె.కన్నబాబు తెలిపారు. ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో భాగంగా గత నెల 31 న రాష్ట్రానికి వచ్చిన ఈ బృందం ఈ నెల 6వ తేదీ వరకు వివిధ ప్రాంతాలను సందర్శిస్తుందని చెప్పారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) జలంధర్ శాఖ ఆధ్వర్యంలో వచ్చిన ఈ బృందం తొలుత విశాఖలోని పర్యాటక ప్రదేశాలను, డిండిని సందర్శించిందన్నారు. శనివారం విజయవాడ బెర్మ్ పార్కులో ఈ బృందానికి రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టుల గురించి వివరించినట్టు చెప్పారు. రాష్ట్ర సంస్కృతి, కళలు, వారసత్వ సంపదను పంజాబ్‌లో ప్రచారం చేసేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందని కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఉన్న 974 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం, నిత్యం ప్రవహించే నదులు, సుందరమైన బ్యాక్ వాటర్స్, కొండలు, అడవులు, పురాతన దేవాలయాలు, బౌద్ధ క్షేత్రాలు వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు మన సంస్కృతి, వారసత్వాలను చాటిచెబుతాయన్నారు. పీఐబీ జలంధర్ నోడల్ అధికారి రాజేష్ బాలి మాట్లాడుతూ..ఏపీలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, అలవాట్లు మంచి విజ్ఞానాన్ని అందించాయని చెప్పారు. -
లీజు కట్టరు.. వాటా ఇవ్వరు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో పర్యాటక ఆధారిత ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ఇటు లీజు మొత్తం, అటు ఆదాయంలో ప్రతిపాదిత వాటా చెల్లించకుండా బకాయిపడ్డ బడా సంస్థలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలో వాటి నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి, బకాయి మొత్తం చెల్లించాల్సిందిగా గడువు విధించనుంది. చెల్లించని పక్షంలో ఆయా సంస్థలకు నీళ్లు, కరెంటు సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో నోటీసులు జారీ కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో స్థలాల కేటాయింపు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంస్థలు.. తమకు ప్రభుత్వ స్థలం కేటాయిస్తే హోటళ్లు, సినిమా హాళ్లు, గోల్ఫ్ కోర్సులు, ఇతర మనోరంజక ప్రాజెక్టులు నిర్మిస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. దీంతో ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. అలాంటి వాటిల్లో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్, జలవిహార్, స్నో వరల్డ్ లాంటి వాటితో పాటు మరెన్నో హోటళ్లు ఉన్నాయి. ఇవి లీజు మొత్తంతో పాటు రాబడిలో నిర్ధారిత వాటాను కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అలా కొన్ని సంస్థలు లీజు మొత్తం చెల్లిస్తుండగా, రాబడిలో కొంతమేర చెల్లిస్తూ వచ్చాయి. కొన్ని లీజు ఇస్తూ రాబడిలో వాటా చెల్లించటం లేదు. కొన్ని సంస్థలు లీజు మొత్తాన్ని కూడా సరిగా చెల్లించటం లేదు. ఇటీవల కోవిడ్ వల్ల ఆదాయం సరిగా లేదని చెప్తూ కొన్ని సంస్థలు లీజు మొత్తం ఇవ్వటం లేదు. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ.140 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఎన్నిసార్లు అడిగినా.. అధికారులు ఎన్నిసార్లు కోరినా నిర్వాహకులు బకాయిలు చెల్లించటం లేదు. దీంతో వాటిపై గట్టిగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని సంస్థలు కోర్టులను ఆశ్రయించిన నేపథ్యంలో, కోర్టు కేసులు కూడా సమసిపోయేలా చేసి తగు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ గురువారం అధికారులతో సమావేశమై చర్చించారు. బకాయి పడిన సంస్థలకు మంచినీరు, కరెంటు సరఫరా నిలిపివేసే విషయమై సంబంధిత విభాగాలకు లేఖలు రాయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రిజర్వాయర్లకు నయా లుక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలు పర్యాటకంగా వెనుకబడే ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ఉన్నా సౌకర్యాలు లేకపోవడం, పర్యాటకానికి అనువుగా లేకపోవడమే దీనికి కారణం. ఇలాంటి సమయంలో గోదావరి జలాలతో నిండుతున్న రిజర్వాయర్లు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఆయా ప్రాజెక్టులు పర్యాటకానికి ఆస్కారమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కసరత్తు ప్రారంభించింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన ప్రతిపాదనల ఆధారంగా రిజర్వాయర్లు, ప్రాజెక్టుల వద్ద అభివృద్ధి చర్యలు చేపడుతోంది. రంగనాయకసాగర్ రిజర్వాయర్ నాలుగు రిజర్వాయర్ల వద్ద.. పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వం నాలుగు రిజర్వాయర్లపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కీలక పట్టణంగా ఎదుగుతున్న సిద్దిపేటకు సమీపంలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్, సిరిసిల్ల శివార్లలోని అన్నపూర్ణ రిజర్వాయర్, అవకాశాలు ఉండీ ఇన్నాళ్లూ అభివృద్ధికి నోచుకోని అప్పర్, మిడ్‌మానేరు రిజర్వాయర్లను ఎంపిక చేసింది. ఆయా చోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి ఇటీవలే పర్యాటకాభివృద్ధి సంస్థ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చింది. జాతీయ స్థాయిలో సంస్థలు కాన్సెప్టు, డీపీఆర్‌లతో ఈ నెల 15 నాటికి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరింది. పనులు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని పేర్కొంది. వచ్చిన ప్రతిపాదనల్లో మేలైన దాన్ని ఎంపిక చేసి ఆ ఇతివృత్తానికి తగ్గట్టు రిజర్వాయర్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రంగనాయకసాగర్‌ను తొలిదశలో రూ.100 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అనంతగిరి రిజర్వాయర్‌లోని ప్రకృతి అందాలు రివర్ ఫ్రంట్‌గా లోయర్ మానేరు.. లోయర్ మానేరు డ్యామ్ బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని రివర్‌ఫ్రంట్ పేరుతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నీటిపారుదల శాఖకు రూ.350 కోట్లు కేటాయించింది. ఆ ప్రాంతంలో పర్యాటకులకు వసతులు, ఆకర్షణీయ పనులు చేసేందుకు పర్యా టక శాఖకు రూ.వంద కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంటు నియామక ప్రక్రియ జరుగుతోంది. దీనితో కలిపి ఐదు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. అయితే పర్యాటక అభివృద్ధి పనులు నిధుల కొరతతో చతికిలబడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తాజా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది తేలాల్సి ఉంది. -
సీఎం రోడ్డుట్రిప్పు.. మీరు గ్రేట్ సార్!
-
బైక్‌పై సీఎం 122 కి.మీ. ప్రయాణం.. ఎందుకంటే
ఇటానగర్ : ‘లీడర్’ సినిమాలో అర్జున్ ప్రసాద్.. అదేనండీ హీరో రానా దగ్గుబాటి సీఎం హోదాలో బైక్ వేసుకుని రోడ్లపై తిరగడం అందరికీ గుర్తుండే ఉంటుంది. హీరోయిన్ కోరిక మేరకు ఆమెను సరదాగా బైక్‌పై బయటకు తీసుకువెళ్తాడు మన యంగ్ సీఎం. అదంతా రీల్‌లైఫ్ అయితే రియల్ లైఫ్‌లోనూ అలాంటి యంగ్ సీఎం ఒకరు రోడ్డుపై బైక్‌తో చక్కర్లు కొట్టారు. అయితే ఆయన కేవలం సరదా కోసం బైక్ రైడింగ్ చేయడం లేదు. రాష్ట్ర పర్యాటక రంగం ప్రమోషన్లలో భాగంగా రయ్‌మంటూ బైక్‌పై దూసుకుపోతూ కాన్వాయ్‌ను పరుగులు పెట్టించారు. ఆయనే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు(40). కాగా ప్రకృతి అందాలకు నెలవైన అరుణాచల్ ప్రదేశ్ పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం పెమా ఖండు సైతం తన వంతుగా యింగ్కోయింగ్ నుంచి పసీఘాట్ వరకు బైక్ రైడ్ చేస్తూ.. సాహస క్రీడలకు సాక్షిగా నిలుస్తున్న సియాంగ్ నది అందాలను నెటిజన్ల కళ్లకుకట్టారు. రాయల్ ఎన్ఫీల్్డ బైక్‌పై దాదాపు వంద కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ వీడియోను ట్విటర్లో చేశారు. ఈ మేరకు ‘ యింగ్కోయింగ్ నుంచి పసీఘాట్ వరకు రోడ్డుట్రిప్నకు సంబంధించిన వీడియో. పర్యాటకుల గమ్యస్థానం అరుణాచల్ అందాలను ప్రమోట్ చేసే ప్రయత్నం. 122 కిలోమీటర్ల ప్రయాణం. బైకర్స్‌కు కూడా అరుణాచల్ ప్రదేశ్ ఎంతో సురక్షితమైనది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రమంలో.. ‘మీరు గ్రేట్ సార్. అరుణాచల్ పర్యాటకంపై విశేష దృష్టి సారిస్తున్నారు. బైకర్స్‌కు కూడా మంచి రైడింగ్ స్పాట్ పరిచయం చేశారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక పెమా ఖండు గతంలో సైతం సల్మాన్‌ఖాన్‌తో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ బీజేపీ సీఎంకు.. #AmazingArunachal, #VisitArunachal హ్యాష్‌ట్యాగ్‌లతో రాష్ట్ర పర్యాటక స్థలాలను ప్రమోట్ చేయడం పరిపాటి. -
పర్యాటక ప్రాజెక్టులకు నిధులు మంజూరు
కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, మహేశ్ శర్మ వెల్లడి న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ప్రముఖ పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రూ. 99.42 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, మహేశ్ శర్మ వెల్లడించారు. మంగళవారం కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ కార్యాలయానికి వచ్చిన కేంద్ర పర్యాటక మంత్రి మహేశ్ శర్మ తెలంగాణకు చెందిన పర్యాటక ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం ఇరువురూ మీడియాతో మాట్లాడుతూ కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్క్, పైగా టూంబ్స్, హయత్ బక్షీ మసీదు తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేశామన్నారు. తెలంగాణ టూరిజం అధికారులతో సమావేశమైన అనంతరం మరిన్ని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారని దత్తాత్రేయ తెలిపారు. -
జిల్లాలో 11 టూరిజం ప్రాజెక్టులు
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నెల్లూరు, సిటీ : జిల్లాలో 11 టూరిజం ప్రాజెక్ట్‌లతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులోని దర్గామిట్టలో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద ఘాట్ల నిర్మాణాన్ని గురువారం తెల్లవారుజామున ఆయన పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ రొట్టెల పండుగకు దేశ, విదేశాల నుంచి లక్షల మంది భక్తులు వస్తుంటారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గోదావరి, కృష్ణా పుష్కరాలకు చేసిన ఏర్పాట్లును రొట్టెల పండుగకు కూడా చేస్తామన్నారు. జిల్లాకు రూ.60.37 కోట్లు స్వదేశీ దర్శన్‌లో భాగంగా కేటాయించడం జరిగిందన్నారు. అందులో రూ.2.62 కోట్లు స్వర్ణాల చెరువు కోసం కేటాయించారని చెప్పారు. అక్టోబర్ 8వ తేదీ నాటికి ఘాట్ల నిర్మాణం పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. ఆయన వెంట నగర మేయర్ అజీజ్, టీడీపీ నగర ఇన్చార్జి ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు పాల్గొన్నారు.