బైక్‌పై సీఎం 122 కి.మీ. ప్రయాణం.. ఎందుకంటే | Arunachal Pradesh CM Made Bike Trip To Promote State Tourism | Sakshi
Sakshi News home page

సీఎం రోడ్డు ట్రిప్పు.. మీరు గ్రేట్‌ సార్‌!

Published Wed, Oct 16 2019 10:34 AM | Last Updated on Wed, Oct 16 2019 3:06 PM

Arunachal Pradesh CM Made Bike Trip To Promote State Tourism - Sakshi

ఇటానగర్‌ : ‘లీడర్‌’ సినిమాలో అర్జున్‌ ప్రసాద్‌.. అదేనండీ హీరో రానా దగ్గుబాటి సీఎం హోదాలో బైక్‌ వేసుకుని రోడ్లపై తిరగడం అందరికీ గుర్తుండే ఉంటుంది. హీరోయిన్‌ కోరిక మేరకు ఆమెను సరదాగా బైక్‌పై బయటకు తీసుకువెళ్తాడు మన యంగ్‌ సీఎం. అదంతా రీల్‌లైఫ్‌ అయితే రియల్‌ లైఫ్‌లోనూ అలాంటి యంగ్‌ సీఎం ఒకరు రోడ్డుపై బైక్‌తో చక్కర్లు కొట్టారు. అయితే ఆయన కేవలం సరదా కోసం బైక్‌ రైడింగ్‌ చేయడం లేదు. రాష్ట్ర పర్యాటక రంగం ప్రమోషన్లలో భాగంగా రయ్‌మంటూ బైక్‌పై దూసుకుపోతూ కాన్వాయ్‌ను పరుగులు పెట్టించారు. ఆయనే అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండు(40). కాగా ప్రకృతి అందాలకు నెలవైన అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగా సీఎం పెమా ఖండు సైతం తన వంతుగా యింగ్‌కోయింగ్‌ నుంచి పసీఘాట్‌ వరకు బైక్‌ రైడ్‌ చేస్తూ.. సాహస క్రీడలకు సాక్షిగా నిలుస్తున్న సియాంగ్‌ నది అందాలను నెటిజన్ల కళ్లకుకట్టారు. రాయల్‌ ఎన్‌ఫీల్‌‍్డ బైక్‌పై దాదాపు వంద కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ వీడియోను ట్విటర్‌లో చేశారు. ఈ మేరకు ‘ యింగ్‌కోయింగ్‌ నుంచి పసీఘాట్‌ వరకు రోడ్డుట్రిప్‌నకు సంబంధించిన వీడియో. పర్యాటకుల గమ్యస్థానం అరుణాచల్‌ అందాలను ప్రమోట్‌ చేసే ప్రయత్నం. 122 కిలోమీటర్ల ప్రయాణం. బైకర్స్‌కు కూడా అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎంతో సురక్షితమైనది’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో.. ‘మీరు గ్రేట్‌ సార్‌. అరుణాచల్ పర్యాటకంపై విశేష దృష్టి సారిస్తున్నారు. బైకర్స్‌కు కూడా మంచి రైడింగ్‌ స్పాట్‌ పరిచయం చేశారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక పెమా ఖండు గతంలో సైతం సల్మాన్‌ఖాన్‌తో కలిసి సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఈ బీజేపీ సీఎంకు..  #AmazingArunachal, #VisitArunachal హ్యాష్‌ట్యాగ్‌లతో రాష్ట్ర పర్యాటక స్థలాలను ప్రమోట్‌ చేయడం పరిపాటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement