అరుణాచల్‌లో బీజేపీ | Arunachal Pradesh Assembly Elections 2024: BJP victory in Arunachal Pradesh | Sakshi
Sakshi News home page

Arunachal Pradesh Assembly Elections 2024: అరుణాచల్‌లో బీజేపీ

Published Mon, Jun 3 2024 4:47 AM | Last Updated on Mon, Jun 3 2024 6:58 AM

Arunachal Pradesh Assembly Elections 2024: BJP victory in Arunachal Pradesh

అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం 

60 స్థానాలకు 46 కైవసం 

ఈటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 60 స్థానాలకు గాను ఏకంగా 46 చోట్ల కాషాయ జెండా రెపరెపలాడింది. 10 స్థానాలు ముందే ఏకగ్రీవంగా బీజేపీ సొంతం కావడంతో ఏప్రిల్‌ 19న మిగతా 50 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. బీజేపీ 36 సీట్లు గెలుచుకోగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) 5, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) 3, పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ (పీపీఏ) 2 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్‌ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు సాధించగా ఈసారి మరో ఐదు పెరగడం విశేషం. ఏకగ్రీవంగా నెగ్గిన వారిలో సీఎం పెమా ఖండూ కూడా ఉన్నారు. 

అభివృద్ధి రాజకీయాలకు పట్టం: మోదీ  
అరుణాచల్‌ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. బీజేపీకి మరోసారి విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం మరింత ఉత్సాహంగా, నూతన శక్తితో పని చేస్తామంటూ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారు. పార్టీ కార్యకర్తల అలుపెరుగని కృషితోనే ఈ విజయం సాధ్యమైంది’’ అని అన్నారు.  

సంగీతాభిమాని...
అరుణాచల్‌లో బీజేపీని వరుసగా మూడోసారి గెలుపు బాటన నడిపిన నాయకుడిగా పెమా ఖండూ పేరు మార్మోగిపోతోంది. క్రీడలు, సంగీతం పట్ల అమితాసక్తి ఉన్న ఆయన రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2000లో కాంగ్రెస్‌లో చేరిన ఖండూ తండ్రి డోర్జీ ఖండూ ప్రాతినిధ్యం వహించిన ముక్తో అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో గెలిచారు. నబామ్‌ తుకీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 

2016 జనవరిలో రాష్ట్రపతి పాలన అనంతరం బీజేపీ మద్దతిచి్చన కల్హోపుల్‌ ప్రభుత్వంలో మరోసారి మంత్రి అయ్యారు. సుప్రీంకోర్టు జోక్యంతో తుకీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది. తుకీ రాజీనామాతో 2016లో ఖండూ 37 ఏళ్ల వయసులో తొలిసారి సీఎం అయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు. 2019లో రెండోసారి సీఎం అయి ఐదేళ్లూ కొనసాగారు. తాజాగా మరోసారి విజయం దక్కించుకున్నారు. బౌద్ధ మతస్థుడైన పెమా ఖండూ మోన్‌పా గిరిజన తెగకు చెందినవారు. తండ్రి డోర్జీ 2011లో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement