ఆనందపురం మండలం బోని గ్రామంలో ట్రస్ట్‌కు 614.97 ఎకరాల భూములు
అకస్మాత్తుగా గ్రామసభ నిర్వహించిన మాన్సాస్ సిబ్బంది
జూలై 1 నుంచి మూడ్రోజుల పాటు వేలం ప్రక్రియ ప్రకటన
నిజానికి.. 18 ఏళ్లకు పైగా కౌలు వసూలుచేయని ట్రస్ట్
ఇప్పుడు ఏడాదికి రూ.5 వేలు చొప్పున ఇవ్వాలనడంపై రైతుల ఆగ్రహం
1956లోనే ట్రస్టులన్నీ రద్దయినందున మాన్సాస్‌కు హక్కులు లేవంటున్న రైతులు
తగరపువలస (విశాఖ): అవి ఏడెనిమిది తరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములు.. వాటికి పద్దెనిమిది సంవత్సరాలకు పైగా ఏనాడూ కౌలు వసూలు చేయలేదు.. ఇప్పుడు ఉన్న పళంగా ఎవరికీ చెప్పాపెట్టకుండా గ్రామసభ పెట్టి కౌలు వేలం నిర్వహిస్తామని ఏకపక్షంగా ప్రకటించేశారు. పైగా గతంలో వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు వచ్చి ఇప్పుడు ఆ మాట మార్చేశారు. దీంతో ఆ భూములు సాగుచేసుకుంటున్న రైతులు మండిపడుతున్నారు.
ఈ కలవరపాటుకు కారణం విశాఖ జిల్లాలో ‘మాన్సాస్’ ట్రస్ట్ తాజా వ్యవహారం. విషయం ఏమిటంటే.. ఆనందపురం మండలం బోని పంచాయతీలో మాన్సాస్ ట్రస్ట్‌కు 614.97 ఎకరాల భూములున్నాయి. వీటికి సంబంధించి మూడేళ్ల కాలపరిమితితో జూలై ఒకటి నుంచి మూడో తేదీ వరకు లైసెన్సు హక్కులు నిర్ణయించనున్నారు. బహిరంగ వేలం ద్వారా నిర్ణయించనున్న ఈ ట్రస్ట్ భూములకు సంబంధించి మాన్సాస్ ప్రతినిధులు, ఆనందపురం రెవెన్యూ అధికారులు బోని పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం గ్రామసభ నిర్వహించారు.
మాన్సాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల అభివృద్ధికి గాను ఈ కౌలు ద్వారా వచ్చే ఆదాయాన్ని కేటాయిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు రైతులకు తెలిపారు. కొన్నాళ్లుగా రైతులెవరూ కౌలు చెల్లించకపోవడంతో మాన్సాస్ లక్ష్యం దెబ్బతింటోందని దీనికి కౌలు రైతులంతా సహకరించకపోతే తాము మరోదారిలో వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మాన్సాస్ భూములు కేవలం కౌలుకు మాత్రమేనని విక్రయానికి సాధ్యపడదని రైతులకు తెలిపారు. ఎవరైనా వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో వచ్చినా నమ్మవద్దని తెలిపారు. వ్యవసాయానికి అయితే ఏడాదికి ఎకరాకు రూ.5వేలు.. ఇటుక బట్టీలకైతే ఇంకా ఎక్కువ ధర నిర్ణయించనున్నట్లు మాన్సాస్ ప్రతినిధులు తెలిపారు.
సాగు హక్కులు కావాలంటూ రైతుల పట్టు..
పద్మనాభం మండలం కృష్ణాపురంలో ఇనాం రైతులకు ఇచ్చినట్లే తమకు కూడా మాన్సాస్ సాగు హక్కులు ఇవ్వాలంటూ కౌలు రైతులు పట్టుబట్టారు. గతంలో మాన్సాస్ ప్రతినిధులు రైతులతో వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు వచ్చినట్లు గుర్తుచేశారు. అసలు ఇక్కడి భూముల్లో బంజరు, ఇనాం, మాన్సాస్‌లకు చెందినవి విడివిడిగా చూపించాలన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి తమ ఏడెనిమిది తరాల వారు ఈ భూములను సాగు చేసుకుంటున్నట్లు వారంతా గుర్తుచేశారు.
నిజానికి.. 18 ఏళ్లకు పైగా మాన్సాస్ ట్రస్ట్ తమ నుంచి కౌలు వసూలు చేయడంలేదని.. అంతకుముందు ఏడాదిలో ఎకరాకు రూ.20 నుంచి రూ.50 కౌలు మించేది కాదన్నారు. ఆరి్థకంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన తమపై కౌలు పేరుతో చెల్లించలేనంత భారాన్ని మోపితే సహించబోమన్నారు. దీంతో గ్రామసభ మరోమారు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పుడు కౌలు అడగడం సరికాదు..
ముగ్గురు ఆడపిల్లలు, భార్య, నేను కలిసి ఎకరా భూమి సాగుచేసుకుంటున్నాం. మాకు తాతముత్తాతల నుంచి ఈ భూమే ఆధారం. ఇప్పుడొచ్చి ఏడాదికి రూ.5 వేలు కౌలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం సరిగాలేదు. – కాళ్ల నారాయణ, కౌలు రైతు, బోని గ్రామం
ముందస్తు సమాచారమే లేదు..
ముందుగా సర్పంచ్, ఎంపీటీసీలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వలేదు. వాళ్లంతట వాళ్లే కరపత్రాలు ఈరోజు పట్టుకొచ్చి గ్రామసభలో పంచిపెట్టారు. కౌలు రైతులు ఎవరూ ఇందుకు సిద్ధంగా లేరు.
– బోని ముకుంద, కౌలు రైతు, బోని గ్రామం
కౌలు భూములకు కమర్షియల్ ధరలా?
మేం సాగు చేసుకుంటున్న భూములపై సాగు హక్కులు కల్పించాలి. అప్పుడే మా కుటుంబాలకు భద్రత. కౌలు భూములకు కమర్షియల్ ధరలంటూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. – సూరకత్తుల వెంకట్రావు, కౌలు రైతు, బోని గ్రామం
రైతులను వేధిస్తే ఊరుకోం..
1971లో గరీబ్ హఠవో ద్వారా ఇందిరాగాంధీ.. 1986లో దున్నేవాడిదే భూమిపై హక్కులు అంటూ ఎన్టీఆర్.. 30 ఏళ్లు సాగులో ఉండేవారికి భూమిపై అన్ని హక్కులు సంక్రమిస్తాయని చెప్పారు. 1956లో ట్రస్ట్‌లన్నింటినీ ప్రభుత్వం రద్దుచేసింది. 1958లో పుట్టుకొచ్చిన మాన్సాస్‌పై చాలా కేసులున్నాయి. చాలా ఏళ్ల తరువాత వచ్చి ఇప్పుడు కౌలు కట్టాలని రైతులను వేధిస్తే ఊరుకోం. – బోని సోంబాబు, కౌలు రైతు, బోని గ్రామం
వన్‌టైం సెటిల్‌మెంట్‌పై మాటమార్చారు..
మా బోని గ్రామ పంచాయతీ ప్రజలంతా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం. ప్రభుత్వాలు కల్పిస్తున్న వసతులతో కౌలు భూములు సాగుచేసుకుంటున్నాం. గతంలో మాన్సాస్ ప్రతినిధులు వన్ టైమ్ సెటిల్‌మెంట్‌కు వచ్చారు. ఇప్పుడు కాదంటున్నారు. – మద్దిల తాతినాయుడు, కౌలు రైతు, బోని గ్రామం
Comments
Please login to add a commentAdd a comment