లీజు కాదు.. అమ్మకమే | Three companies have already Sale of 1,617.56 acres | Sakshi
Sakshi News home page

లీజు కాదు.. అమ్మకమే

Published Fri, May 6 2016 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

లీజు కాదు.. అమ్మకమే

లీజు కాదు.. అమ్మకమే

పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులకు భూముల విక్రయం
* అయినకాడికి విక్రయిద్దామన్న సీఎం
* పారిశ్రామిక విధానంలో సవరణలు తెస్తూ జీవో 48 జారీ
* ఇక ప్రైవేట్ సంస్థలు ఇష్టానుసారంగా ఆ భూములను అమ్మేసుకోవచ్చు
* మూడు సంస్థలకు ఇప్పటికే 1,617.56 ఎకరాల విక్రయం

సాక్షి, హైదరాబాద్: పేద రైతుల పొట్ట కొట్టి పెద్దలకు విందు భోజనం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీఐఐసీని అడ్డుపెట్టుకుని రైతులనుంచి నామమాత్రపు ధరకు సేకరించిన వేలాది ఎకరాల భూములను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు సంతర్పణ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

లీజుకు ఇవ్వాల్సిన భూములను అన్ని హక్కులతో అమ్మేసేందుకు సవరణలు తీసుకువస్తూ సీఎం చంద్రబాబు స్వయంగా జీవో జారీ చేయించేశారు. దీనిపై అధికార వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులకు భూములను 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని పారిశ్రామిక, పర్యాటక విధానంలో ఉంది. అలాగే వెనుకబడిన ప్రాంతంగా ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతంలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేసే మెగా ప్రాజెక్టులకు అన్ని హక్కులతో భూములు విక్రయించే విషయాన్ని సీఎం అధ్యక్షతన జరిగే పారిశ్రామిక ప్రోత్సాహక మండలి పరిశీలించవచ్చునని 2015 ఏప్రిల్ 29వ తేదీన ప్రకటించిన పారిశ్రామిక విధానంలో పేర్కొన్నారు.

ఆ భూములను తమకు పూర్తిగా విక్రయించకపోతే పెట్టుబడులు తీసుకురావడం కష్టంగా ఉందని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. దీంతో చంద్రబాబు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పారిశ్రామిక విధానంలోనే సవరణలు తేవాలని గత నెల 2వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు ‘ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మండలి సమావేశం’ అనే పదాన్ని తొలగించేశారు. లీజుకు ఇవ్వాల్సిన భూములను సర్వ హక్కులు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు విక్రయించడాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)తో పాటు సంబంధిత శాఖల అధికారులు వ్యతిరేకించిన నేపథ్యంలో ఏకంగా నూతన పారిశ్రామిక విధానంలోనే సవరణలు తీసుకువచ్చారు.

సీఎస్ అధ్యక్షతన జరిగిన ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ కార్యదర్శుల సమావేశంలో కూడా ఔట్ రైట్ సేల్‌ను వ్యతిరేకించారు. అయినాసీఎం అధ్యక్షతన జరిగిన పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఔట్ రైట్ సేల్‌కు నిర్ణయం తీసుకుని జీవో-48 జారీ చేయించారు.
 
భూములు విక్రయించాలంటూ క్యూ
ఎటువంటి షరతులు లేకుండా భూములపై పారిశ్రామిక వేత్తలకు సర్వహక్కులు కల్పిస్తూ అమ్మేయడానికి జీవో-48 మార్గం సుగమం చేయడంతో ఏపీఐఐసీ చెలరేగింది. కాకినాడలోని ఓ సంస్థకు గతంలో కేటాయించిన 1,563 ఎకరాలను ఔట్ రైట్ సేల్ కింద విక్రయించేసింది.  ఆ భూములను  షరతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని ఆ సంస్థ కోరుతోంది. మరోవైపు చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో నాలుగు మొబైల్ సెల్‌ఫోన్ కంపెనీలకు 69.56 ఎకరాలను ఎకరం రూ.20 లక్షల చొప్పున అమ్మేయాలని ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది.

ఓ సెల్‌ఫోన్ సంస్థకు 19.28 ఎకరాలను, మరో సంస్థకు 15 ఎకరాలను, ఓ కంపెనీకి 15 ఎకరాలను, మరో పారిశ్రామిక సంస్థకు 19.28 ఎకరాలను ఔట్ రైట్ సేల్‌కు ఇచ్చేశారు. అనంతపురం జిల్లా గుడిపల్లి గ్రామంలో ఓ కంపెనీకి 25 ఎకరాలను ఎకరం రూ. పది లక్షల చొప్పున ఏపీఐఐసీ ఔట్ రైట్ సేల్‌కు ఇచ్చేసింది. కర్నూలు జిల్లాలో ఫుడ్ పార్కు ఏర్పాటుకు ఓ సంస్థకు ప్రభుత్వం 623 ఎకరాలను లీజుకు కేటాయించింది. ఆ సంస్థ కూడా లీజును తొలగించి  ఔట్ రైట్ సేల్ కింద ఇవ్వాలని కోరింది. త్వరలోనే 623 ఎకరాలను ఔట్ రైట్ సేల్‌కు ప్రభుత్వం ఇచ్చేయనుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరికొన్ని సంస్థలు ఔట్‌రైట్ సేల్ కోసం ఇక క్యూ కట్టనున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
 
భూములను అమ్మేయడం దారుణం
రైతుల నుంచి పరిశ్రమల కోసం అని తీసుకున్న భూములను పరిశ్రమలు స్థాపించకుండానే పారిశ్రామిక వేత్తలకు విక్రయ హక్కులు కట్టబెట్టడం దారుణమని ఉన్నతాధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఏర్పాటయ్యే ప్రత్యేక ఆర్థిక జోన్‌ల విధానంలో భూములను లీజుకు మాత్రమే ఇవ్వాలని ఉందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా అమ్మేయడం, అదీ రాయితీ ధరలతో ఇవ్వడం అన్యాయమని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.  

పరిశ్రమల కోసం భూములు తీసుకున్న సంస్థలు... రైతుల నుంచి కారు చౌకగా తీసుకున్న భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సొమ్ములు చేసుకున్నా అడిగే అధికారం ప్రభుత్వానికి ఉండదని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏపీఐఐసీని దళారీగా పెట్టి రైతుల నుంచి నామమాత్రపు ధరకు సేకరించి, అధిక ధరలకు వాటిని అమ్ముకునే అధికారం ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టడం కంటే దారుణం ఏముంటుందని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement