అప్పన్నకు ‘ఐటీ’ నామం!
- మధురవాడలోని దేవస్థానం భూములు మాయం..
- రూ. 250 కోట్ల విలువైన భూమి నామమాత్రపు లీజుకు
- ఈ-సెంట్రిక్ సొల్యూషన్‌కు ధారాదత్తం
- ఆగమేఘాలపై ప్రతిపాదనలు
- పాలకమండలి తీర్మానం లేకుండానే...
- నేడు కేబినెట్ భేటీలో ఆమోదముద్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం దేవుడి భూములనూ వదలకుండా ప్రైవేట్‌పరం చేసేందుకు సిద్ధమైంది. సింహాద్రి అప్పన్న భూములపైన కన్నేసింది. గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో కోల్పోయిన భూమికి ప్రత్యామ్నాయంగా సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న వంద ఎకరాల సింహాద్రి అప్పన్న భూములపై మళ్లీ ఆయన హయాంలోనే సర్కారు పెద్దల కన్నుపడింది. మధురవాడలోని సింహాచలం దేవస్థానానికి చెందిన వంద ఎకరాల విలువైన భూముల్లో 50 ఎకరాలను ఐటీ కంపెనీకి నామమాత్రపు లీజుపై అప్పనంగా ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధమైంది.
మధురవాడలోని సింహాద్రి అప్పన్నకు చెందిన రూ.250 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని ‘ఈ-సెంట్రిక్ సొల్యూషన్’ అనే ఐటీ కంపెనీకి నామమాత్రపు లీజుకు అప్పగించేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేశారు. బుధవారం రాజమండ్రిలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 50 ఎకరాల భూమిని ఈ-సెంట్రిక్ సొల్యూషన్ కంపెనీకి ఎకరానికి కేవలం రూ.లక్ష చొప్పున లీజుకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. అది కూడా 50 ఎకరాలకు రూ.లక్ష చొప్పున లీజుపై అనుకుంటే పొరపాటే.
తొలి ఏడాది కేవలం మూడు ఎకరాలకు, ఆ మరుసటి ఏడాది ఆరు ఎకరాలకు... ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.6 లక్షలకు లీజుకు ఇస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మిగతా భూమి కూడా ఐటీ కంపెనీ ఆధీనంలోనే ఉంటుంది. కానీ ఆ భూమికి ఇప్పుడు లీజు ఇవ్వరు. ఇంత అడ్డగోలు వ్యవహారం కోసం రాజమండ్రిలో మకాం వేసి ఉన్న ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్ నుంచి ఆగమేఘాల మీద ఈ-సెంట్రిక్ సొల్యూషన్ లిమిటెడ్‌కు 50 ఎకరాలు ఉదారంగా ధారాదత్తం చేసే ప్రతిపాదనలను తెప్పించుకున్నారు.
భూ కేటాయింపు విధానానికి విరుద్ధంగా
దేవుడి భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించాలంటే ఆ దేవస్థానం పాలకమండలి తీర్మానం తప్పనిసరిగా ఉండాలి. అందుకు భిన్నంగా పాలకమండలి తీర్మానం లేకుండానే కేటాయింపు తంతును కానిచ్చేస్తున్నారు. మధురవాడలోని సింహాచలం దేవస్థానానికి చెందిన 50 ఎకరాలు లీజుపై కావాలని దేవాదాయ శాఖకు ఈ-సెంట్రిక్ సొల్యూషన్ లిమిటెడ్‌కి చెందిన ‘పారాడిగం నాలెడ్జ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ దరఖాస్తు చేసుకుంది. దీనిపై దేవాదాయ శాఖ దరఖాస్తు చేసిన కంపెనీ పూర్వాపరాలను తెలియజేయాల్సిందిగా ఐటీ శాఖను కోరింది. ఈమేరకు ఐటీ శాఖ కంపెనీపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
ఆ నివేదిక ఆధారంగా 50 ఎకరాలను ఈ-సెంట్రిక్ సొల్యూషన్‌కు కట్టపెడుతున్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు లీజుపై కేటాయించిన పక్షంలో ఆ భూమి మార్కెట్ విలువలో పది శాతం మేర లీజు నిర్ధారించాలని భూముల కేటాయింపు విధానంలో స్పష్టంగా ఉంది. దీనిప్రకారం సింహాద్రి అప్పన్నకు చెందిన 50 ఎకరాలు లీజుకు ఇచ్చినా ఏడాదికి రూ.25 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విశాఖలోని సెంట్రల్ జైలు కోసం సింహాచలం దేవస్థానానికి చెందిన 100 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంది.
అయితే, దేవస్థానం ఆ భూమికి బదులుగా ఇంకో చోట వంద ఎకరాలు కేటాయించాలంటూ సుదీర్ఘ పోరాటం చేసింది. ఆ పోరాట ఫలితంగా మధురవాడలో 100 ఎకరాలను గతంలో ప్రభుత్వం సింహాచలం దేవస్థానికి కేటాయించింది. ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన మధురవాడలోని 50 ఎకరాల భూమిని కారు చౌకగా ఐటీ కంపెనీ కోసం కేటాయిస్తున్నారు.