ఆదాయం పెంపుదలే లక్ష్యం శ్రీకాకుళం
కాంప్లెక్స్‌లో 1.5 ఎకరాల స్థలం లీజుకు
రంగం సిద్ధం చేసిన అధికారులు
శ్రీకాకుళం అర్బన్ : ఆదాయమే లక్ష్యంగా... నష్టాలనుంచి గట్టెక్కడమే ధ్యేయంగా ఆర్టీసీ కొత్త మార్గాలను వెదుకుతోంది. సంస్థ పరిధిలోని స్థలాలను లీజుకి వ్వడం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని యోచిస్తోంది. జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో దాదాపు రూ. 20 కోట్ల మేర నష్టాల్లో ఉన్నప్పటికీ రాజమండ్రి పుష్కరాలు ఆర్టీసీకి కలిసొచ్చాయి. ప్రైవేటు వాహనాల హవా కొనసాగినా ప్రయాణికులు ఆర్టీసీనే నమ్ముకుని అధిక సంఖ్యలో ప్రయాణించారు. దీంతో సంస్థ కొంతమేర
నష్టాల నుంచి గట్టెక్కింది. మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా స్థలాన్ని లీజుకు ఇస్తామని సంస్థ ఎండీ ఇప్పటికే ప్రకటించారు. జోన్-1 పరిధిలో తుని, రాజమండ్రి, విశాఖ, ఎస్.కోట, చోడవరం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ స్థాయిలో ఆర్టీసీ స్థలాలను లీజుకు కట్టబెట్టిన అధికారులు ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం పట్టణాలపై దృష్టి సారించారు.
టెండర్ల కోసం ప్రతిపాదనలు
విజయనగరంలోని ఆర్‌ఎం కార్యాలయం ఎదురుగా ఉన్న మూడెకరాల స్థలాన్ని, విశాఖలోని మద్దిలపాలెం డిపో పరిధిలో ఆరెకరాలు, శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో 1.5 ఎకరాల స్థలాన్ని 33 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు ప్రతిపాదనలు పంపించారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ 16.82 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో బస్టాండ్‌తోపాటు శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోలు ఉన్నాయి. అదే ప్రాంతంలో ఇప్పటికే కొన్ని భవనాలు నిర్మించి అద్దెలకు ఇచ్చారు. మరికొంత స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలంలో ద్విచక్ర వాహనాల పార్కింగ్‌తోపాటు సులభ్ కాంప్లెక్స్ ఉంది. దీనిపై వచ్చే ఆదాయం కంటే లీజుద్వారా వచ్చే భారీ మొత్తమే ఉపయోగపడుతుందని భావించి ఉన్నతాధికారులు ఫైలును హైదరాబాదుకు పంపించినట్లు తెలుస్తోంది. సుమారు ఎకరంన్నర స్థలాన్ని బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) ప్రాతిపదికన కట్టబెట్టేందుకు యోచిస్తున్నారు.
బ్యాంకు చిక్కులు తప్పేనా...
ఆర్టీసీ పరిధిలో ఉన్న కొంత స్థలాన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తెచ్చారు. ప్రస్తుతం వాయిదాలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు అదేస్థలంలో ఉన్న కొంత భాగాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే యోచనలో ఉన్నారు. ఇదేవిషయం గుర్తించిన బ్యాంకు సిబ్బంది ఆర్టీసీ అధికారులను వివరణ కోరినట్లు తెలుస్తోంది. తమవద్ద స్థలం తాకట్టుపెట్టి రుణం తీసుకున్న సందర్భంలో అదే స్థలం పరిధిలో ఉన్న స్థలాన్ని లీజుకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తోంది. బ్యాంకు నుంచి ఎన్‌వోసీ వస్తే లీజుకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించేది లేదని, న్యాయపరంగానే లీజుకు ముందుకు వెళతామని ఆర్టీసీలోని ముఖ్య ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
ఆర్టీసీ లీజుబాట
Published Wed, Nov 25 2015 3:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement