FM Nirmala Sitharaman Launches Rs 6 Lakh Crore National Monetisation Pipeline Scheme - Sakshi
Sakshi News home page

NMP: రూ. 6 లక్షల కోట్లు లక్ష్యం!!

Published Tue, Aug 24 2021 1:39 AM | Last Updated on Tue, Aug 24 2021 4:23 PM

 Finance Minister Nirmala Sitharaman on Monday launched the National Monetisation Pipeline - Sakshi

National Monetisation Pipeline ప్రైవేట్‌ పెట్టుబడుల ఊతంతో మౌలిక రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ) కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. దీని కింద కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఆస్తుల మానిటైజేషన్‌ ద్వారా రూ. 6 లక్షల కోట్ల విలువను రాబట్టనుంది. ప్యాసింజర్‌ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్‌ను లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్‌’ చేయనుంది.

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి చెందిన 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియంలతో పాటు పలు రైల్వే కాలనీలతో పాటు ప లు ఆస్తులు ఇందులో భాగంగా ఉండనున్నాయి. 2022–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో నాలుగేళ్ల వ్యవధిలో ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది.  ఎన్‌ఎంపీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ఆవిష్కరించారు. నేషనల్‌ ఇన్‌ఫ్రా పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ) కార్యక్రమం కింద తలపెట్టిన ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ఇది మరో అంచె పైకి తీసుకెడుతుందని విలేకరుల సమావేశంలో ఆమె తెలిపారు. ఇప్పటికే పూర్తయి నిరుపయోగంగా పడి ఉన్నవి లేదా పూర్తి స్థాయిలో వినియోగంలో లేనివి, పూర్తి స్థాయిలో విలువను అందించలేకపోతున్న బ్రౌన్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రా అసెట్స్‌కి మాత్రమే ఎన్‌ఎంపీ పరిమితమని మంత్రి చెప్పారు.  

అమ్మేయడం లేదు..
ఎన్‌ఎంపీ విధానంలో యాజమాన్య హక్కులు లేదా స్థలం బదలాయింపు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రైవేట్‌ రంగం పాలుపంచుకునేందుకు అవకాశం కల్పించడం ద్వారా ఆయా ఆస్తుల నుంచి మరింత విలువను రాబట్టడానికి వీలవుతుంది. అలాగే మానిటైజేషన్‌ ద్వారా వచ్చిన నిధులను .. మౌలిక సదుపాయాల కల్పనపై ఇన్వెస్ట్‌ చేయడానికి సాధ్యపడుతుంది’’ అని పేర్కొన్నారు. ‘ఆయా అసెట్స్‌ యాజమాన్య హక్కులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. నిర్దిష్ట కాలవ్యవధి తర్వాత వాటిని తప్పనిసరిగా ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదో అమ్మేస్తోందంటూ గందరగోళపడాల్సిన అవసరం లేదు. ఈ బ్రౌన్‌ఫీల్డ్‌ అసెట్లు అన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి‘ అని ఆమె స్పష్టం చేశారు.

విభాగాలవారీగా చూస్తే..
రహదారులు..: అసెట్‌ మానిటైజేషన్‌లో సింహభాగం వాటా రహదారుల విభాగానిదే ఉండనుంది.  సుమారు రూ. 1.6 లక్షల కోట్ల విలువ చేసే 26,700 కి.మీ. మేర జాతీయ రహదారులను (ప్రస్తుతమున్నవి, కొత్తగా రాబోయేవి) మానిటైజ్‌ చేయనున్నారు. దీన్ని రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అమలు చేయనుంది. టోల్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ (టీవోటీ), ఇన్విట్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌) రూపంలో ఇది ఉండనుంది. టీవోటీ విధానంలో టోల్‌ రాబడులను బిడ్డరు నుంచి ప్రభుత్వం ముందుగానే తీసుకుంటుంది. ఆ తర్వాత సదరు రహదారిని వినియోగించే వారి దగ్గర్నుంచి బిడ్డరు టోల్‌ ఫీజు వసూలు చేసుకుని, నిర్దిష్ట లీజు వ్యవధికి రహదారిని నిర్వహించి, తిరిగి ప్రభుత్వానికి బదలాయించాల్సి ఉంటుంది. ఇక రాబడులు అందించగలిగే ఇన్‌ఫ్రా అసెట్స్‌లో ఇన్విట్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అవకాశం ఉంటుంది.

విమానాశ్రయాలు..: నాలుగేళ్లలో 25 విమానాశ్రయాల (విజయవాడ, తిరుపతి, చెన్నై, వడోదరసహా) మానిటైజేషన్‌ ద్వారా రూ. 20,782 కోట్ల మేర పెట్టుబడులు రాగలవని అంచనా. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌తో పాటు (13 శాతం వాటా) ముంబై, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో ఉన్న వాటాలను విక్రయించే యోచన ఉంది.  

రైల్వే..: రైల్వేలకు సంబంధించి నిర్దిష్ట రైల్వే స్టేషన్లు, ట్రాక్‌లు, ప్యాసింజర్‌ రైళ్లు, కొంకణ్‌ రైల్వే మానిటైజేషన్‌ విలువ సుమారు రూ. 1.52 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకోసం 400 రైల్వే స్టేషన్లు, 90 ప్యాసింజర్‌ రైళ్లు, 1,400 కి.మీ. మేర ఉన్న 1 రైల్వే ట్రాక్, 741 కి.మీ. కొంకణ్‌ రైల్వే, 15 రైల్వే స్టేడియంలు, కొన్ని రైల్వే కాలనీలు, రైల్వేకి చెందిన 265 గూడ్స్‌–షెడ్‌లు మొదలైనవి ఎంపిక చేశారు.  

టెలికం..: సుమారు రూ. 35,100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ అసెట్స్‌ను ఎన్‌ఎంపీ జాబితాలో నీతి ఆయోగ్‌ చేర్చింది. భారత్‌నెట్‌ ప్రాజెక్టు కింద బీబీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ వేసిన 2.86 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌ అసెట్స్‌ విలువ రూ. 26,300 కోట్లుగా లెక్కగట్టింది. అలాగే, బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందిన 13,567 మొబైల్‌ టవర్లు, ఎంటీఎన్‌ఎల్‌కి చెందిన 1,350 టవర్ల విలువను రూ. 8,800 కోట్లుగా అంచనా వేసింది.  

మైనింగ్‌..: దాదాపు రూ. 28,747 కోట్ల విలువ చేసే బొగ్గు గనులను మానిటైజ్‌ చేయనున్నారు. ఇందుకోసం 160 అసెట్స్‌ను గుర్తించారు. 761 ఖనిజ బ్లాక్‌లను నాలుగేళ్ల వ్యవధిలో వేలం వేయనున్నారు.  

షిప్పింగ్‌..: వచ్చే నాలుగేళ్లలో రూ. 12,828 కోట్ల విలువ చేసే షిప్పింగ్‌ అసెట్ల మానిటైజేషన్‌ జరగనుంది. దీన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ అమలు చేయనుంది. ఇందుకోసం 31 ప్రాజెక్టులను గుర్తించారు.

రియల్‌ ఎస్టేట్‌..: రియల్‌ ఎస్టేట్, హోటల్‌ అసెట్స్‌ మానిటైజేషన్‌ విలువ సుమారు రూ. 15,000 కోట్ల మేర ఉండగలదని అంచనా వేస్తున్నారు. దేశ
రాజధానిలోని పలు హౌసింగ్‌ కాలనీలు, ఎనిమిది ఐటీడీసీ హోటళ్లు కూడా ఈ మానిటైజేషన్‌ ప్రణాళికలో భాగంగా ఉంటాయి.

ఉభయతారకం..
ఈ ప్రణాళిక ప్రకారం ప్రైవేట్‌ సంస్థలు  ఇన్విట్ల(ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులు) ద్వారా నిర్దిష్ట ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అలాగే నిర్దిష్ట కాలానికి అసెట్లను నిర్వహించి, అభివృద్ధి చేసి, ప్రభుత్వానికి బదలాయించే విధానంలోనూ రాబడులు అందుకోవచ్చు. గిడ్డంగులు, స్టేడియంలు మొదలైన కొన్ని అసెట్స్‌ను ప్రభుత్వం నుంచి దీర్ఘకాలిక లీజుకి తీసుకోవచ్చు. ఇటు ప్రైవేట్‌ పెట్టుబడులతో ఇన్‌ఫ్రా అభివృద్ధి చేయడంతో పాటు అటు ఇతర మౌలిక ప్రాజెక్టులకు నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వానికి ఎన్‌ఎంపీ ఉపయోగపడనుంది. రూ. 111 లక్షల కోట్లతో నిర్దేశించుకున్న నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ) ప్రణాళికలో ఎన్‌ఎంపీ విలువ 5.4%గా ఉండగా, ప్రతిపాదిత ఎన్‌ఐపీలో కేంద్రం వాటాలో (రూ. 43 లక్షల కోట్లు) 14 %గా ఉండనుంది.  ఎన్‌ఎంపీలో చేర్చేందుకు ఆస్కారమున్న బ్రౌన్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రా అసెట్స్‌ జాబితాను నీతి ఆయోగ్‌  రూపొందించింది.

ఎన్‌ఎంపీ జాబితాలో ఉన్న తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ ఆస్తులు
1. రహదారులు (పొడవు కి.మీ.లలో)
కడ్తాల్‌–ఆర్మూర్‌: 31 కి.మీ.
కడ్లూరు ఎల్లారెడ్డి– చేగుంట: 52 కి.మీ.
చేగుంట – బోయినిపల్లి: 62 కి.మీ.
మహారాష్ట్ర /తెలంగాణ సరిహద్దు– ఇస్లాంనగర్‌ (ఎన్‌హెచ్‌ 7): 55 కి.మీ.
ఆర్మూర్‌–కడ్లూరు ఎల్లారెడ్డి: 59 కి.మీ.
కడ్లూరు ఎల్లారెడ్డి – గుండ్ల పోచంపల్లి: 86 కి.మీ.
హైదరాబాద్‌–బెంగళూరు (తెలంగాణ): 75 కి.మీ.

2. రైల్వేలు
దేశవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉన్న 12 క్లస్టర్లలోని 109 రూట్లలో 150 అధునాతన రైళ్ళను తీసుకొచ్చేందుకు ప్రైవేట్‌ పెట్టుబడులను స్వాగతిస్తున్నారు. దీని ద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల ప్రైవేట్‌ పెట్టుబడులు రానున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి రద్దీ క్లస్టర్లతో పాటు సికింద్రాబాద్‌ క్లస్టర్‌ అభివృద్ధికి బిడ్డింగ్‌ ప్రక్రియ జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది.
ఎన్‌ఎంపీ జాబితాలో ఉన్న

ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రం ఆస్తులు
1.    రహదారులు (పొడవు కి.మీ.లలో)
► కొత్తకోట బైపాస్‌– కర్నూలు: 75 కి.మీ.
► హైదరాబాద్‌ – బెంగళూరు(ఏపీ): 251 కి.మీ.
► చిలకలూరిపేట– విజయవాడ: 68 కి.మీ.


2.    గ్యాస్‌పైప్‌ లైన్‌ నెట్‌వర్క్‌
► కేజీ బేసిన్‌ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ – 889 కి.మీ. పొడవు

3.    ఎయిర్‌పోర్టులు  
► విజయవాడ (2023–24) – విలువ అంచనా: రూ. 600 కోట్లు
► తిరుపతి (2023–24) – విలువ అంచనా: రూ. 260 కోట్లు
► రాజమండ్రి (2024–25) – విలువ అంచనా: రూ. 130 కోట్లు


4.    నౌకాశ్రయాలు
► పోర్టులకు సంబంధించి 2022–25 మధ్య దేశంలోని పోర్టుల్లో మొత్తం 31 ప్రాజెక్టులను పీపీపీ పద్ధతి ద్వారా అభివృద్ధి చేయనున్నారు. అందులో విశాఖపట్టణం పోర్టుకు సంబంధించిన నాలుగు ప్రాజెక్టులను చేపట్టనున్నారు. వీటి విలువ సుమారు రూ. 988 కోట్ల మేర ఉండనుంది.

5. రైల్వేలు
►  స్టేషన్ల పునర్‌అభివృద్ధి కింద తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల మానిటైజేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు.

- సాక్షి, న్యూఢిల్లీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement