గలీజు | random robbery in the NTR park | Sakshi
Sakshi News home page

గలీజు

Published Wed, Jan 28 2015 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

గలీజు

గలీజు

నిబంధనలకు విరుద్ధంగా సబ్ లీజులు
ఎన్టీఆర్ పార్కులో యథేచ్ఛగా దోపిడీ
హెచ్‌ఎండీఏ ఆదాయానికి భారీగా గండి
 

సిటీబ్యూరో: మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు లీజుల వ్యవహారం తలబొప్పి కట్టిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది సబ్ లీజులతో సంస్థ ఆదాయానికి భారీ స్థాయిలో గండి కొడుతున్నారు. తాము మాత్రం హాయిగా జేబులు నింపుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్ ఈ అక్రమాలకు కేంద్రంగా మారింది. నగరంలో సందర్శకుల రద్దీ అధికంగా ఉన్న పార్కుల్లో ఎన్టీఆర్ గార్డెన్ ఒకటి. నిత్యం వేలాదిమంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఇంత రద్దీ ఉన్న పార్కుపై అధికారుల పర్యవేక్షణ కరువవుతోంది. ప్రవేశ టిక్కెట్లు, షాపుల కేటాయింపు, ఇతర మార్గాల్లో ఈ పార్కు ద్వారా హెచ్‌ఎండీఏకు ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇందులో సగంలీజుల ద్వారానే వ స్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే... షాపుల కేటాయింపులో లోపాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని లీజుకు తీసుకున్న వ్యక్తులు అధిక ఆదాయం కోసం విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తమకు కేటాయించిన దానికంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకొని దర్జాగా ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నా... అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తూన్నారనే ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు.
 
పక్కాగా మస్కా


ఎన్టీఆర్ గార్డెన్‌లోని అధిక షాపులు లీజుపై కేటాయించినవే. కొన్నిటి లీజుల్లో యథేచ్ఛగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో రెండు ప్రాంతాల్లో షాపులను లీజుకు తీసుకున్న వ్యక్తి ఏకంగా మరో అయిదు ప్రాంతాలను తన అధీనంలో పెట్టుకున్నాడు. వాటిని సబ్ లీజుకిచ్చి హెచ్‌ఎండీఏకు మస్కా కొడుతున్నాడు. రికార్డుల ప్రకారం ఎన్టీఆర్ గార్డెన్‌లో ఒక క్యాంటీన్ నిర్వహించుకునేందుకు ఓ సంస్థకు అనుమతిచ్చినట్లు ఉంది. మచన్ ట్రీ వద్ద ఒకటి, అక్కడి రైల్వే స్టేషన్‌లో మరో క్యాంటీన్  అనధికారికంగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులకు కనిపించకపోవడం గమనార్హం.  ఈ రెండు క్యాంటీన్లు ఒకటిగానే చూపించి సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకొనే నాథుడే లేడని బీపీపీ సిబ్బందే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. పార్కులోని షాపింగ్ కాంప్లెక్స్‌లో 5 షాపులను సబ్‌లీజుదారులే నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇక్కడి ‘బంగీ జంప్’ క్రీడా స్థలం కూడా సబ్ లీజుదారు ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సందర్శకుల జేబులకు కన్నం

అక్రమ లీజులతో సంస్థకు టోకరా వేస్తున్న నిర్వాహకులు సందర్శకులనూ వదలడం లేదు. పార్కుల్లో ఆహారం, పానీయాలు, ఇతర వస్తువుల విక్రయాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలను పక్కనపెట్టి... అధిక ధరలకు విక్రయిస్తూ జనం నుంచి దోచుకుంటున్నారు.   ఈ అక్రమాలు అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై సంబంధిత అధికారిని  వివరణ కోరగా... అలాంటి అక్రమాలు తమ దృష్టికి రాలేదన్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకొంటామని చెప్పారు.  లీజుకు కేటాయించిన షాపులను సబ్ లీజ్‌కు ఇచ్చినట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకొని... వాటిని రద్దు చేస్తామని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement