చట్టబద్ధంగానే థియేటర్ల లీజు: ఎగ్జిబిటర్లు
రాంగోపాల్‌పేట్: గత విధానాల వల్ల థియేటర్ల యజమానులు తీవ్రంగా నష్టపోవడంతోనే..థియేటర్లను చట్టబద్ధంగా లీజుకు ఇచ్చామని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిబిటర్స్ విభాగం స్పష్టం చేసింది. శనివారం ఫిల్మ్ చాంబర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎగ్జిబిటర్స్ విభాగం చైర్మన్ బాలగోవింద్‌రాజ్, ఫిల్మ్ చాంబర్స్ అధ్యక్షులు విజయేందర్‌రెడ్డి, పలువురు థియేటర్ల యజమానులు మాట్లాడారు.
గతంలో థియేటర్‌లో సినిమాలు వేసేందుకు నిర్మాతలు, పంపిణీదారులు ఫిక్స్‌డ్ హయ్యర్, షేర్ గ్యారెంటీ, మినిమం గ్యారెంటీ పేరిట భారీగా అడ్వాన్సులు వసూళ్లు చేసేవారని తెలిపారు. ఈ విధానంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వందల సంఖ్యలో థియేటర్లు మూతలు పడ్డాయని చెప్పారు. గతంలో అడ్వాన్సులు తీసకున్న పంపిణీదారులు సినిమా ఆడకపోతే మళ్లీ ముఖం చూపించకుండా వెళ్లేవారని తర్వాత సినిమా కూడా తమకు ఇవ్వకుండా తప్పించుకునే వారని వాపోయారు. లీజు విధానం లేకపోతే ఇప్పుడున్న థియేటర్లలో ఇంకా చాలా మూతపడేవన్నారు.
చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని, త్వరగా తీసేస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అగ్రిమెంట్ ప్రకారమే సినిమా నడిపిస్తారని పేర్కొన్నారు. ఎగ్జిబిటర్స్ విభాగం ఉపాధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల నిరాహారదీక్ష చేపట్టిన రామకృష్ణగౌడ్‌కు సినిమా ఫీల్డ్‌పై ఏ మాత్రం అవగాహన లేదన్నారు. గత పదేళ్ల నుంచి ఆయన ఎక్కడున్నాడో తెలియదని, వ్యక్తిగత ప్రచారం కోసం ఇలా చేస్తున్నాడని ఆరోపించారు. సమావేశంలో మల్లారెడ్డి, జగన్, పలువురు లీజుదారులు, థియేటర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.