అమెరికాలోని టాప్ ఈవీ తయారీ కంపెనీగా పేరున్న టెస్లా ఇటీవల విడుదల చేసిన మొదటి త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు 3,87,000 యూనిట్లను డెలివరీ చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే క్యూ1 ఫలితాల్లో టెస్లా అమ్మకాలు అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 8.5 శాతం తగ్గాయి. దాంతో కంపెనీ రెవెన్యూ భారీగా తగ్గిపోయింది.
ఏడేళ్లలో కంపెనీ ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రెవెన్యూ తగ్గడంతో ఇటీవల కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10శాతం మందిని కొలువుల నుంచి తొలగించినట్లు టెస్లా ప్రకటించింది. అంటే సుమారు 14వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. చైనా ఈవీ తయారీ సంస్థల నుంచి టెస్లాకు భారీ పోటీ నెలకొన్నట్లు తెలిసింది. చైనాతోపాటు అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలు ఈవీలను తయారుచేస్తున్నాయి. టెస్లాలో వాడుతున్న ఫీచర్లతోపాటు అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. దాంతో వినియోగదారులు ఇతర కంపెనీ ఉత్పత్తులు కొనేందుకు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పర్యటన వాయిదా..
టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారనే వార్తలు ఇటీవల వైరల్‌గా మారాయి. ఈమేరకు వీటిని ధ్రువీకరిస్తూ మస్క్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. అయితే ఆ పర్యటనను వాయిదావేశారు. ఏప్రిల్ 23న అమెరికాలో టెస్లా ఇన్వెస్టర్ల సమావేశం ఉండడంతో ఈ పర్యటన వాయిదా పడిందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి.
మస్క్ భారత్‌లో రూ.16 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీను భారత్‌లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. విదేశీ కంపెనీలు భారత్‌లో ప్రవేశించేందుకు లైన్‌క్లియర్ చేస్తూ కేంద్రం కొత్త ఈవీపాలసీను రూపొందించింది. ఈ మేరకు కేంద్రం ఇటీవల ఆటోమొబైల్ తయారీ కంపెనీల అభిప్రాయాలను సైతం తీసుకున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment