భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే.. | Tesla lodged a complaint with the Delhi High Court for violating its trademark | Sakshi
Sakshi News home page

టెస్లా లోగోను వాడుతున్న భారత కంపెనీ!

Published Fri, May 3 2024 12:21 PM | Last Updated on Fri, May 3 2024 2:52 PM

Tesla lodged a complaint with the Delhi High Court for violating its trademark

గురుగ్రామ్‌లోని టెస్లా పవర్ ఇండియా అనధికారికంగా తమ ట్రేడ్‌మార్క్‌ను వాడుకుంటోందని ఎలొన్‌మస్క్‌ ఆధ్వర్యంలోని టెస్లా ఇంక్ గురువారం దిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసింది. టెస్లా పవర్.. టెస్లా ఇంక్‌ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని సంస్థ తరఫు న్యాయవాది చందర్ లాల్ కోర్టును అభ్యర్థించారు.

‘గురుగ్రామ్ ఆధారిత కంపెనీ టెస్లా పవర్‌ ఇండియా.. టెస్లా ఇంక్‌ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోంది. కంపెనీ వ్యాపారాలపై కూడా దాని ప్రభావం పడుతోంది. టెస్లా పవర్ బ్యాటరీలకు సంబంధించిన ఫిర్యాదులను తమ వినియోగదారులు పొరపాటుగా టెస్లా ఇంక్‌తో లింక్ చేస్తున్నారు. ఆ ఫిర్యాదులను నేరుగా అమెరికన్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తున్నారు. టెస్లా పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీగా జాతీయ వార్తాపత్రికల్లో అమెరికన్‌ కంపెనీ లోగోతో ప్రచారం చేసింది. టెస్లా పవర్ ‘టెస్లా’ ట్రేడ్‌మార్క్ వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి’ అని చందర్‌లాల్‌ వాదనలు వినిపించారు.

టెస్లా పవర్ ఈవీ బ్యాటరీలను ఉత్పత్తి చేయదని సంప్రదాయ వాహనాలు, ఇన్వర్టర్లలో ఉపయోగించే లెడ్ యాసిడ్ బ్యాటరీలను విక్రయిస్తుందని వాదించింది. ఈ సందర్భంగా కంపెనీ ఛైర్మన్ కవీందర్ ఖురానా మాట్లాడుతూ..తమ కంపెనీకి యూఎస్‌లో భాగస్వామ్య సంస్థ ఉందన్నారు. అయితే తాము ఎలాంటి ఈవీను తయారుచేయమని స్పష్టం చేశారు. ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించే ఉద్దేశం తమ కంపెనీకి లేదని ఖురానా చెప్పారు. తాము మరో సంస్థ ‘ఈ-అశ్వ’తో కలిసి ప్రకటన ఇచ్చినట్లు పేర్కొన్నారు. టెస్లా పవర్ బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయానికి ఈ కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..

ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిష్ దయాల్ టెస్లా పవర్‌కి నోటీసు జారీ చేశారు. తదుపరి విచారణను మే 22 తేదీకి వాయిదా వేశారు. టెస్లా ఇంక్‌ను పోలి ఉండే ట్రేడ్‌మార్క్‌తో ఎలాంటి ప్రచార ప్రకటనలను విడుదల చేయకూడదని ఆదేశించారు. అయితే, టెస్లా ఇంక్ ఈ కేసులో ఎలాంటి ఎమర్జెన్సీను ప్రదర్శించలేదని తెలిసింది. 2020 నుంచి ఇరు కంపెనీల మధ్య సంప్రదింపులు సాగుతున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement