ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చైనాలో 16.8 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేయకపోవడం వల్ల సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రీకాల్ చేసిన కార్లులో ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసి ఇస్తామని పేర్కొంది.
టెస్లా తెలిపిన వివరాల ప్రకారం..చైనాలో దిగుమతి చేసుకున్న మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను రీకాల్ చేస్తున్నారు. వాటితోపాటు అక్టోబర్ 15, 2020 నుంచి జులై 17, 2024 మధ్య చైనాలో తయారు చేసిన మోడల్ 3, మోడల్ వై కార్లను కూడా రీకాల్ చేస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం..డ్రైవింగ్ సమయంలో కారులో సామాన్లు పెట్టుకునేందుకు వీలుగా ఉండే ట్రంక్ డోర్ దానికదే తెరుచుకునే ప్రమాదం ఉంది. ఇది డ్రైవర్ దృష్టికి అంతరాయం కలిగిస్తుంది. అయితే ఇలాంటి సమస్య ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం టెస్లా వెల్లడించలేదు. ఈ సమస్య పరిష్కారానికి రిమోట్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేయాలని పేర్కొంది. రీకాల్ చేసిన కార్లలో ఉచితంగానే ఈ సర్వీసును అందిస్తామని చెప్పింది.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం ఎంతంటే..
ఇదిలాఉండగా, టెస్లాకు చైనా ప్రధాన మార్కెట్‌గా నిలుస్తోంది. జులైలో చైనా ప్రభుత్వం పెద్దమొత్తంలో ఈ కార్లను కొనుగోలు చేసింది. షాంఘైలో టెస్లా గిగాఫ్యాక్టరీని స్థాపించింది. 2023లో ఈ ఫ్యాక్టరీలో దాదాపు 9,47,000 కార్లు తయారు చేసింది. వీటిలో చాలా వరకు స్థానికంగా విక్రయించింది. మిగతావాటిని యూరప్‌కు ఎగుమతి చేసింది. చైనాకు చెందిన బీవైడీ కంపెనీ తయారు చేస్తున్న ఈవీ కార్లు టెస్లాకు పోటీగా నిలుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment