దేశంలో రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల ఆసక్తిని గమనించిన కంపెనీలు వారికి తగ్గట్టు సరికొత్త ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక రకాల ఎలక్ట్రిక్ కార్లు రోడ్డు మీద చక్కర్లు కొడుతున్నప్పటికి, వచ్చే ఏడాది 2022లో దిగ్గజ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసేందుకు సిద్దం అవుతున్నాయి. 2022లో ఎలక్ట్రిక్ కారు తయారీ కంపెనీలు తీసుకొనిరాబోతున్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ టెస్లా కంపెనీకి పోటీ ఇచ్చేందుకు ఈక్యూఎస్ అనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారు ఎడ్మండ్స్ చేసిన రియల్ వరల్డ్ రేంజ్ టెస్టులో 422 మైళ్ల దూరం ప్రయాణించింది. టెస్లా ఉత్తమ మోడల్ కంటే దాదాపు 20 మైళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించింది అన్నామట. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 770 కిమీ వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధర $102,310 (రూ.76,07,899) లుగా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది.ఈ కారుకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద 10-80 శాతం చేరుకోవడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనిలో 107.8 kWh బ్యాటరీ సామర్ధ్యం గల ఇంజిన్ ఉంది. ఇది 2022 మొదటి త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది.
(చదవండి: ఒమిక్రాన్ భయాలతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!)
టెస్లా మోడల్ 3 & మోడల్ వై
ఎలక్ట్రిక్ కారు ప్రియులు అందరూ ఈ ఏడాదిలో టెస్లా కారు విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. టెస్లా మోడల్ 3 సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్‌లతో ఉంటుంది. టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ పూర్తి ఛార్జీపై 423 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఈ కారు 6 సెకన్లలోపు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుతుంటుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ వేరియంట్ ఒకే పూర్తి ఛార్జీతో 568 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ వేరియంట్ కేవలం 3 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని ధర సుమారు రూ. 60 - 80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
మోడల్ వై అనేది ఏడు సీట్ల వాహనం. అమెరికాలో దీని ధర 54,000 డాలర్ల(సుమారు 40 లక్షల రూపాయల) పై మాటే. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 326 కిమీ వరకు వెళ్లగలదు. దీని గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్లు. ఇది 4.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు కూడా ఈ రెండవ త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది.
(చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..!)
వోల్వో XC40 రీఛార్జ్
వోల్వో మొట్ట మొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనం ఇదే. రాబోయే వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా వస్తుంది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 408 బిహెచ్‌పి, 660 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని, ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ స్ప్రింట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఒకే ఛార్జీపై 418 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ భారత మార్కెట్లో ధృవీకరించబడిన సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ ప్రీమియం ఎస్‌యూవీ ఆఫర్. దీని ధర సుమారు రూ.50 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఆడి క్యూ4 ఈ-ట్రాన్
జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి.. క్యూ4 ఈ-ట్రాన్ అనే ఎలక్ట్రిక్ కారును 2022లో మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. దీజెనీవాలో జరుగుతున్న మోటార్ షోలో కంపెనీ ఈ కారు కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. క్యూ4 ఇ-ట్రాన్ ఒక 4 డోర్ ఎస్‌యూవీ. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. మాగ్జిమమ్ ఔట్‌పుట్ 302 బీహెచ్‌పీ. ఇందులో క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.3 సెకన్లలో అందుకుంటుంది. కారును ఒకసారి చార్జ్ చేస్తే 450 కిలోమీటర్లు వెళ్లొచ్చు. గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఈ కారు ధర సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చు.
హ్యుందాయ్ అయోనిక్ 5
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ వచ్చే ఏడాది అయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సిద్దం అవుతుంది. ఈ కారును కేవలం 5 నిమిషాల ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అయోనిక్ 5 కార్లు ప్రధానంగా 390 హెచ్పీ అవుట్ పుట్తో.. ఆల్ వీల్ డ్రైవ్ కార్ల రూపంలో చెలామణీలోకి వచ్చే అవకాశం ఉంది. 5 సెకన్లలో సున్నా నుంచి 100 కేఎంపీహెచ్ స్పీడును అందుకొనున్నాయి. పలు రిపోర్టుల ప్రకారం అయోనిక్ 5 కారును ఫుల్ ఛార్జ్ చేస్తే 450 కిలో మీటర్లు వరకు వెళ్లనుంది. దీని ధర సుమారు రూ- 25-30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
మినీ కూపర్ ఎస్ఈ
జర్మన్ లగ్జరీ కారు బ్రాండ్ బీఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ కూపర్, భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఎలక్ట్రిక్ కార్లు అప్పుడే పూర్తిగా అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్ఈ 32.6కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ చేత పని చేస్తుంది.ఈ కారు 181 బిహెచ్పీ పవర్, 270ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 7.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 150 కి.మీ. డబ్ల్యుఎల్ టీపీ ప్రకారం.. కూపర్ ఎస్ఈను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 270 కిలోమీటర్ల వెళ్లగలదు అని కంపెనీ తెలిపింది.
ఈ కారు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడిడిఆర్ఎల్ ఓవల్ హెడ్ ల్యాంప్, షడ్భుజి ఆకారంలో ఉండే గ్రిల్, కాంట్రాస్ట్ కలర్ ఓఆర్ విఎమ్ లతో వస్తుంది. ఈ కారు లోపల 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది. కస్టమర్లు మినీ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ కారుని 11కెడబ్ల్యు(2.5 గంటలు) లేదా 50కెడబ్ల్యు ఛార్జర్ తో ఛార్జ్ చేయవచ్చు. ఇది బ్యాటరీని 35 నిమిషాల్లో 0-80 శాతం నుంచి ఛార్జ్ చేస్తుంది. ఈ కారు ధర సుమారు రూ.50 లక్షలు ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది.
(చదవండి: 2021 రౌండప్: అత్యంత చెత్త కంపెనీ ఏదంటే..)
Comments
Please login to add a commentAdd a comment