ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సైబర్‌ట్రక్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా వియత్నాంకు చెందిన యూ ట్యూబర్ టెస్లా సైబర్ ట్రక్ ప్రతిరూపాన్ని చెక్కతో అద్భుతంగా రూపొందించాడు. చెక్కతో పూర్తిగా పనిచేసేలా ఈ సైబర్‌ట్రక్ రూపొందించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
ఇందులో కోసం నెట్‌లో సెర్చ్ చేసి, డిజైన్ చేసుకొని మరీ మెటల్ ఫ్రేమ్‌మీద చెక్కతో దీన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. ఎలక్ట్రిక్ మోటారు , బ్యాటరీలపై చెక్క పలకలను ఉపయోగించాడు. లైట్లను కూడా అందంగా పొందుపరిచాడు అలాగే X లోగోతో సైడ్ ప్యానెల్‌ను కూడా డిజైన్ చేశాడు. చివరికి తన వుడెన్ కారును కొడుకుతో కలిసి రైడ్‌కి తీసుకెళ్లడంతో క్లిప్ ముగుస్తుంది. దీనికి సంబంధించి వుడ్‌వర్కింగ్ ఆర్ట్ అనే YouTube ఛానెల్‌లో మస్క్ కోసం వందరోజుల్లో టెస్లా సైబర్ ట్రక్ తయారీ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో పాటు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు ఒక నోట్ పెట్టాడు.
తనకు చెక్క వాహనాలంటే చాలా ఇష్టమని,అందులోనూ టెస్లాపై ఉన్న విపరీతమైన అభిమానంతో దీన్ని తయారు చేశానని చెప్పారు. ఇందులో అనుభవం సాధించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా అనేక చెక్క కార్లను రూపొందించా.. ఇపుడు ఈ సైబర్‌ట్రక్ పూర్తి చేశా అన్నాడు. తన వ్యూయర్లలో చాలామందికి నచ్చిన, తాను మెచ్చిందీ, నిర్మించాలని కోరుకుంటున్న కారు కూడా ఇదే అంటూ యూట్యూబర్ వెల్లడించాడు.
సైబర్‌ట్రక్ కోసం టెస్లా తన సవాళ్లను ఎదుర్కొందో తెలుసు. అయినా కూడా మస్క్ పైనా, టెస్లా సామర్థ్యాలపై అచంచలమైన విశ్వాసం ఉంది. ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పడమే కాదు. టెస్లా చెక్క సైబర్‌ట్రక్‌ను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చాడు.
అయితే దీనిపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పందించడం విశేషం. సూపర్.. చాలా అభినందించదగ్గదే అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 9 లక్షలకు పైగా వ్యూస్ 14 వేల లైక్స్ సాధించింది. వాట్ ఎ లెజెండ్ అంటూ అతనిపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. ఖచ్చితంగా మస్క్ మీ దగ్గరికి వస్తారు అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, టెస్లా సైబర్ ట్రక్ అంటే అత్యుత్తమంగా ఉండాలి తప్ప ఇలా కాదు.. దీన్ని టెస్లా హెడ్ క్వార్టర్ లో ఉంచితే బెటర్ అని ఒక యూజర్ కమెంట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment