Wooden Car
-
మస్క్‌కు తెగ నచ్చేసిన సరికొత్త సైబర్ ట్రక్: వీడియో చూస్తే మీరూ ఫిదా!
ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సైబర్ట్రక్పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా వియత్నాంకు చెందిన యూ ట్యూబర్ టెస్లా సైబర్ ట్రక్ ప్రతిరూపాన్ని చెక్కతో అద్భుతంగా రూపొందించాడు. చెక్కతో పూర్తిగా పనిచేసేలా ఈ సైబర్‌ట్రక్ రూపొందించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో కోసం నెట్లో సెర్చ్ చేసి, డిజైన్ చేసుకొని మరీ మెటల్ ఫ్రేమ్మీద చెక్కతో దీన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. ఎలక్ట్రిక్ మోటారు , బ్యాటరీలపై చెక్క పలకలను ఉపయోగించాడు. లైట్లను కూడా అందంగా పొందుపరిచాడు అలాగే X లోగోతో సైడ్ ప్యానెల్‌ను కూడా డిజైన్ చేశాడు. చివరికి తన వుడెన్ కారును కొడుకుతో కలిసి రైడ్‌కి తీసుకెళ్లడంతో క్లిప్ ముగుస్తుంది. దీనికి సంబంధించి వుడ్‌వర్కింగ్ ఆర్ట్ అనే YouTube ఛానెల్లో మస్క్ కోసం వందరోజుల్లో టెస్లా సైబర్ ట్రక్ తయారీ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో పాటు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు ఒక నోట్ పెట్టాడు. తనకు చెక్క వాహనాలంటే చాలా ఇష్టమని,అందులోనూ టెస్లాపై ఉన్న విపరీతమైన అభిమానంతో దీన్ని తయారు చేశానని చెప్పారు. ఇందులో అనుభవం సాధించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా అనేక చెక్క కార్లను రూపొందించా.. ఇపుడు ఈ సైబర్‌ట్రక్ పూర్తి చేశా అన్నాడు. తన వ్యూయర్లలో చాలామందికి నచ్చిన, తాను మెచ్చిందీ, నిర్మించాలని కోరుకుంటున్న కారు కూడా ఇదే అంటూ యూట్యూబర్ వెల్లడించాడు. సైబర్‌ట్రక్ కోసం టెస్లా తన సవాళ్లను ఎదుర్కొందో తెలుసు. అయినా కూడా మస్క్ పైనా, టెస్లా సామర్థ్యాలపై అచంచలమైన విశ్వాసం ఉంది. ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పడమే కాదు. టెస్లా చెక్క సైబర్‌ట్రక్‌ను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చాడు. అయితే దీనిపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పందించడం విశేషం. సూపర్.. చాలా అభినందించదగ్గదే అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 9 లక్షలకు పైగా వ్యూస్ 14 వేల లైక్స్ సాధించింది. వాట్ ఎ లెజెండ్ అంటూ అతనిపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. ఖచ్చితంగా మస్క్ మీ దగ్గరికి వస్తారు అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, టెస్లా సైబర్ ట్రక్ అంటే అత్యుత్తమంగా ఉండాలి తప్ప ఇలా కాదు.. దీన్ని టెస్లా హెడ్ క్వార్టర్ లో ఉంచితే బెటర్ అని ఒక యూజర్ కమెంట్ చేశాడు. -
చుక్కలు తాకిన చెక్క కారు ధర - ఎంతో తెలుసా?
Wooden Citroen 2CV: వాహన ప్రపంచం రోజు రోజుకి కొత్త రంగులు పులుముకుంటోంది. ఇందులో భాగంగా అనేక ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఎక్కువ మంది ప్రజలు కూడా లేటెస్ట్ వాహనాలను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవల చెక్కతో తయారైన కారు అందరిని ఆశ్చర్యపరిచే విధంగా భారీ ధరకు అమ్ముడుపోయింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఇంతకీ అది ఏ కారు? ఎంత ధరకు అమ్ముడైందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దాదాపు రెండు కోట్లు.. చెక్కతో తయారైన కారు పేరు 'సిట్రోయెన్ 2సీవీ' (Citroen 2CV). చాలా మంది చెక్క కారుని ఎవరు కొంటారు అనుకోవచ్చు, కానీ ఇది వేలం పాటలో 2.1 లక్ష యూరోలకు అమ్ముడైంది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.85 కోట్లు. ఇది కేవలం ఒక యూనిట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని 'మిచెల్ రాబిల్లార్డ్' అనే వ్యక్తి రూపొందించాడు. ఈయన ఈ కారుని తయారు చేయడానికి వివిధ రకాల చెట్ల కలపను ఉపయోగించారు. చాసిస్ కోసం పియర్, యాపిల్ చెట్టును.. బోనెట్ అండ్ బూట్ కోసం చెర్రీ చెట్టుని ఉపయోగించినట్లు తెలిపాడు. ఈ వుడెన్ కారుని తయారు చేయడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టిందని తెలుస్తోంది. ఈ కారుని రూపొందించడం 2011లో ప్రారంభించాడు. దాదాపు 5వేల గంటకు కృషి చేసి మొత్తానికి అనుకున్నట్లుగా కారుని తయారు చేసాడు. చెక్కతో తయారు చేసిన ఈ కారుని గత ఆదివారం ఫ్రాన్స్ సెంట్రల్ సిటీ ఆఫ్ టూర్స్ వేలం పాటలో 'జీన్ పాల్ ఫావాండ్' అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఈయన పారిస్ లోని మ్యూజియం ఆఫ్ వింటేజ్ పెయిర్ గ్రౌండ్ అట్రాక్షన్ యజమాని, కావున ఈ అరుదైన కారు త్వరలోనే ఆ మ్యూజియంలో దర్శనమిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన టాటా మోటార్స్.. ఏ కారుపై ఎంతంటే?) ఈ కారుని తయారు చేసిన మిచెల్ రాబిల్లార్డ్ మాట్లాడుతూ తనకు ముగ్గురు కొడుకులున్నరాని, ఈ కారు తన కూతురు అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా త్వరలోనే సిట్రోయెన్ కంపెనీకి చెందిన మరో కారు 'సిట్రోయెన్ డిఎస్'ను కూడా చెక్కతో రూపొందించాలనుకున్నట్లు చెప్పాడు. -
మొత్తం చెక్కతోనే.. టయోటా కారు!
షింటో మతస్థులు ఆరాధ్య దైవం అమటిరస్. ఆమె కోసం ఆ మతస్థులు ది ఐసీ గ్రాండ్ దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయం పూర్తిగా 20 ఏళ్లకొక్కసారి పునర్ నిర్మిస్తారు. అది కూడా పూర్తిగా చెక్కతో. అందులో ఒక్క మేకు కూడా వాడరు. అసలు డిజైన్ ఏ మాత్రం చెడగొట్టకుండా ఈ దేవాలయాన్ని నిర్మిస్తారు. గత 1300 ఏళ్లగా ఇదే ఆచారం కొనసాగుతుంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ దేవాలయాన్ని మళ్లీ మళ్లీ నిర్మిస్తున్నారు. ఎలాంటి విపత్తులు సంభవించినా.. దేవాలయం మాత్రం ఎక్కడా 'చెక్క' చెదరడం లేదు. ఇదే స్ఫూర్తితో ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కూడా ఓ కారును తయారు చేయాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఇటలీలోని మిలాన్ నగరంలో పూర్తిగా చెక్కతో కారు తయారుచేసింది. ఈ కారులోని ప్రతి భాగాన్ని చెక్కతోనే తయారు చేశారు. ఇటాలియన్ రివా స్పీడ్ బోటు గుర్తుతెచ్చేలా తయారుచేసిన ఈ కారుకు సెట్సునా అని పేరు పెట్టారు. సెట్సునా అంటే జపాన్ భాషలో పర్వతం అని అర్థం. కొండరావి చెట్టు నుంచి తయారు చేసిన చెక్కతో కారు ఫ్రేమ్ నిర్మిస్తే... ఎల్మ్ చెక్కతో కారు అడుగు భాగాన్ని తయారు చేశారు. ఆముదపు చెట్టు చెక్కతో ముందు సీట్లతోపాటు పనిముట్ల ప్యానల్ తయారు చేశారు. సైప్రెస్ చెట్లతో కారు స్టీరింగ్ రూపొందించారు. కారు తయారీలో ఎక్కడా ఒక్క స్క్రూ వాడలేదు. కారు అద్దాల కోసం పుటాకార, కుంభాకార దర్పణాలను మాత్రం ఉపయోగించారు. చివరికీ కారులోని అల్యూమినియం భాగాలు, సీట్లపై వేసిన లెదర్ వస్తువులు కూడా చెక్కను ఉపయోగించే తయారుచేశారు. అలాగే కారు కాక్‌పిట్‌లోని మీటర్ మాత్రం 100 ఏళ్లు పాటు నిరంతరాయంగా పనిచేసేలా మీటర్‌ను ఏర్పాటుచేశారు. ఈ కారుని కొట నెజు డిజైన్ చేశారు. ఈ కారు టోయోటో కంపెనీ బ్రెయిన్ చైల్డ్ అని ఆ సంస్థ చీఫ్ ఇంజినీర్ కెంన్జీ సుజీ కితాబు ఇచ్చారు. మూడేళ్ల క్రితం వచ్చిన ఆలోచనే ఇప్పుడు సెట్ సునాగా కళ్ల ముందు నిలిచింది. ఈ కారులో పెడల్, సీట్ల పొజిషన్ కూడా మామూలు కార్లలాగే మార్చుకునేలా రూపొందించారు. ఈ కారును చిన్న పిల్లలు డ్రైవ్ చేసినా, వాళ్లకు తగ్గట్లుగా సీట్లు ఎత్తును మార్చుకోవచ్చు. ఈ కారు విద్యుత్ ఆధారంగా నడుస్తుంది. 12 ఓల్టుల బ్యాటరీలను ఆరింటిని దీనికోసం వాడారు. వీటిని ఒకసారి చార్జి చేస్తే.. 25 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. కానీ ఈ కారు రోడ్లపై నడిచేందుకు ఇంకా అనుమతి లభించలేదు. అలాగే ఈ కారు అమ్మకానికి పెట్టలేదని కూడా ఆ సంస్థ స్పష్టం చేసింది. ఈ కారు గురించి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు టోక్యోకు చెందిన టయోటా కంపెనీ ప్రతినిధి లీలా మెక్‌మిలన్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్ల తయారీ అభివృద్ధికి ప్రజల అభిప్రాయాలు... సూచనలు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు తెలిపారు.