Interesting Facts About Elon Musk In Telugu | Elon Musk Life Story In Telugu - Sakshi
Sakshi News home page

పాపం ఎలన్‌ మస్క్‌..! తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు ఏం చేసేవాడో తెలుసా?

Published Sun, Dec 26 2021 8:41 AM | Last Updated on Sun, Dec 26 2021 9:47 AM

Unknown Facts About Elon Musk - Sakshi

మనుషుల విజయాలు, వైఫల్యాలు, చర్యలే కాలాన్ని ప్రభావితం చేస్తాయి. ఆ ఫలితాలే.. అనుకూలమైనా, ప్రతికూలమైనా నమోదవుతాయి. ఆ నమోదే రాబోయే తరాలకు చరిత్రగా కనపడుతుంది.. వినపడుతుంది. అలా ఈ ఏడు అంటే 2021ని కూడా చాలామంది వ్యక్తులు తమ విజయాలతో, విషయాలతో ప్రభావితం చేసి ఆ కాలాన్ని చరిత్రగా మలచి.. ఆ పుటల్లో అధ్యాయాలుగా కనిపించబోతున్నారు. వారిలో స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ ఒకరు.  

ఎవ‌రినైనా ఎలన్ మ‌స్క్ గురించి అడిగితే ఏమ‌ని చెబుతారు ప్ర‌పంచాన్ని మార్చే ఐర‌న్‌మ్యాన్, 8 కంపెనీల‌కు అధినేత‌, ప్ర‌పంచంలోనే  ధ‌న‌వంతుల జాబితాలో మొద‌టి స్థానంలో ఉన్నారు. వేల‌కోట్లకు అధిప‌తి ఇలా ఆయ‌న సాధించిన విజ‌యాలు గురించి మాట్లాడ‌తారు. ఇదంతా నాణేనికి ఒక‌వైపే .. అదే రెండోవైపు చూస్తే అన్నీ విషాదాలే. ఇప్పుడు మనం ఎలన్ మ‌స్క్ గురించి ప్ర‌పంచానికి తెలియ‌ని ర‌హ‌స్యాల గురించి తెలుసుకుందాం.     

టెక్‌ యుగంలో ఈ ఏడాది ప్రఖ్యాత ‘టైమ్స్‌’ మేగజైన్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2021’గా ‘స్పేస్‌ ఎక్స్‌’ అధినేత ఎలన్‌ మస్క్‌ నిలిచారు. మస్క్‌ తండ్రిది దక్షిణాఫ్రికా, తల్లిది కెనడా. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు. ఆ తర్వాత కెనడాలో, అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు. టెస్లా సంస్థ అధిపతిగా  ఈ ఏడాది  ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డ్‌ సృష్టించాడు.

► ఈ ఏడాది ఎలన్‌ ట్యాక్స్‌ పే చేయబోతున్నట్టు  ట్విట్టర్‌లో ప్రకటించారు. అయితే ఆయన ట్యాక్స్‌గా చెల్లించబోయే మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 11 బిలియన్‌ డాలర్లు. ఇండియన్‌ కరెన్సీలో ఇది ఏకంగా రూ. 83,697 కోట్ల రూపాయలుగా ఉంది. ఇంత పన్ను చెల్లిస్తున్నాడంటే ఎలన్‌మస్క్‌ దగ్గర ఎంత సంపద ఉందంటే రమారమీ 335 బిలియన్‌ డాలర్లు. ఇటీవల ప్రపంచ కుబేరులు జెఫ్‌ బేజోస్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు ఎలన్‌మస్క్‌. స్పేస్ ఎక్స్ ప్ర‌యోగాలు విఫ‌లం కావ‌డం, టెస్లా బుల్లెట్ ఫ్రూఫ్ కారు ప‌గిలిపోవ‌డం, ఇలా అనేక ప్ర‌తికూల పరిస్థితుల‌ను మ‌స్క్ ఎదుర్కొన్నాడు. వీటి కార‌ణంగా మ‌స్క్ దివాళా  తీసే ప‌రిస్థితికి చేరాడు. కానీ ప‌ట్టుద‌ల‌తో పోరాడి గెలిచాడు. నిలిచాడు.  
 
ఎలన్ మ‌స్క్ చాలా భ‌య‌స్తుడు. ప‌బ్లిక్ లో స్ప‌ష్టంగా మాట్లాడ‌లేరు. అందుకు కార‌ణం ఎలన్ మ‌స్క్ కు ఆటిజం స‌మ‌స్య ఉంది.  సాటర్డే నైట్ అనే షోలో త‌న‌కు అస్పెర్జ‌ర్ సిండ్రోమ్ ఉంద‌ని చెప్పాడు. "ఆ స‌మ‌స్య‌వ‌ల్ల ఇత‌రుల కంటే భిన్నంగా ఆలోచిస్తా.  ఒక్కోసారి నేను సోష‌ల్ మీడియాలో  వింత పోస్ట్లు పెట్టే విష‌యం గురించి నాకు తెలుసు. కానీ, నా మెదడు అలాగే పనిచేస్తుంది అన్నారు. నా వల్ల ఎవరైనా నొచ్చకుని ఉంటే, వారికి నేను ఎలక్ట్రిక్ కార్లను కొత్తగా కనిపెట్టానని, రాకెట్ ద్వారా మనిషిని అంగారక గ్రహంపైకి పంపించబోతున్నానని మళ్లీ చెప్పాలనుకుంటున్నా. నేను సాధారణ వ్యక్తినని మీకు అనిపిస్తోందా" అని మస్క్ ప్రశ్నించారు.
 
ఎలన్ మ‌స్క్ కు త‌మ్ముడు, చెల్లెలు ఉన్నారు. అతని తమ్ముడు కింబాల్ మ‌స్క్ అమెరికాలో కిచెన్ రెస్టారెంట్ గ్రూప్ కు య‌జ‌మాని,  చెల్లెలు తోస్కా చిత్రనిర్మాత.

ఎలన్ మాస్క్  వాటర్‌క్లూఫ్ హౌస్ ప్రిపరేటరీ స్కూల్, బ్రయాన్‌స్టన్ హై స్కూల్, ప్రిటోరియా బాయ్స్ హై స్కూల్ లో త‌న పాఠ‌శాల విద్య‌ను పూర్తి చేశాడు. క్లాస్ లో అంద‌రికంటే ఎలన్ మ‌స్క్ చాలా పొట్టిగా ఉండేవాడు. ఆటిజం, హైట్ కార‌ణంగా స్కూల్లో త‌న తోటి స్నేహితులు వేధించేవారు. ఓసారి స్నేహితులు కొట్ట‌డం వ‌ల్ల ఆస్ప‌త్రిపాల‌య్యాడు. ఫలితంగా 15 సంవత్సరాల వయసులో కరాటే, జూడో, కుస్తీ నేర్చుకున్నాడు.

టెస్లా పేటెంట్ రైట్స్ ద‌క్కించుకునేంద‌కు మ‌స్క్ చాలానే క‌ష్ట‌ప‌డ్డాడు. పేటెంట్ రైట్స్ హక్కులను పొందలేకపోతే, మస్క్.. టెస్లా కంపెనీకి బ్రిటిష్ సైంటిస్ట్ మైఖేల్ ఫెర‌డే పేరునే టెస్లాకు నామక‌ర‌ణం చేశాడు.  

మస్క్ జిప్ 2, పేపాల్, స్పేస్‌ఎక్స్, టెస్లా, హైపర్‌లూప్, ఓపెన్‌ఐఐ, న్యూరాలింక్ ,ది బోరింగ్ కంపెనీ ఇలా మొత్తం ఎనిమిది సంస్థ‌ల్ని స్థాపించారు.   

అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ సంస్థ‌లో  మాన్యుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఇనిషియేటివ్, స్ట్రాటజిక్ అండ్ పాలసీ ఫోరమ్‌లో పనిచేసేందుకు మస్క్ అంగీకరించారు. కాని వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందం నుండి యూఎస్‌ ఉపసంహరించుకోవడాన్ని నిరసిస్తూ మ‌స్క్ ట్రంప్ తో ప‌నిచేసే అవకాశాన్ని తిర‌స్క‌రించారు.  

మస్క్ కాలేజీ చ‌దివే రోజుల్లో డ‌బ్బుల కోసం చాలా ఇబ్బందిప‌డ్డాడు. తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు  రోజూవారీ ఖ‌ర్చుల కోసం స్థానికంగా ఉండే ధ‌న‌వంతుల కుటుంబాల‌కు చెందిన పిల్ల‌ల‌కు ఈస్ట‌ర్ ఎగ్స్ ను అమ్మేవారు. అలా వచ్చిన కొద్ది మొత్తాన్ని బన్, ఆరెంజ్ ఫ్రూట్స్ తిని క‌డుపు నింపుకునే వాడు. మిగిలిన మొత్తాన్ని కాలేజ్‌ ఫీజు క‌ట్టుకునేవాడు.

మస్క్  2000 లో సైన్స్ ఫిక్షన్ రచయిత జస్టిన్ విల్సన్ ను వివాహం చేసుకున్నాడు. 2002లో వారి మొదటి కుమారుడు నెవాడా ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ తో 10 వారాల వయస్సులో మరణించాడు. 

మస్క్‌కు ఏడుగురు  పిల్లలు ఉన్నారు, వీరంతా అబ్బాయిలే. వారిపేర్లు ఎక్స్ ఏఈ ఏ-12 మస్క్, నెవాడా అలెగ్జాండర్ మస్క్, గ్రిఫిన్ మస్క్, జేవియర్ మస్క్, డామియన్ మస్క్, సాక్సన్ మస్క్, కై మస్క్ వీళ్లంతా కృత్తిమంగా పుట్టారు.  
  
► లాస్ ఏంజిల్స్ మంచి టూరిస్ట్ స్పాట్‌. హాలీవుడ్ సినిమా నిర్మాణాల‌న్నీ ఇక్క‌డి నుంచే జ‌రుగుతాయి. సినిమా, టెలివిజ‌న్ రంగానికి కేంద్ర‌బిందువు. ఇక్క‌డే హాలీవుడ్ పెద్ద పెద్ద నిర్మాణ సంస్థ‌లైన పారా మౌంట్ పిక్చ‌ర్స్‌, యూనివ‌ర్సిల్‌, వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ స్టూడియోలు ఉన్నాయి. దీని వ‌ల్ల ట్రాఫిక్ స‌మ‌స్య త‌లెల్తేది. 2016 డిసెంబ‌ర్ 17న ఎలన్‌ మస్క్‌ కారులో వెళుతుండ‌గా ట్రాఫిక్ స‌మ‌స్య త‌లెత్తింది. అంతే ట్రాఫిక్ స‌మ‌స్య‌ను తీర్చేందుకు భూగ‌ర్భంలో పెద్ద సొరంగ మార్గాల్ని ఏర్పాటు చేసి ప్ర‌యాణాన్ని సుల‌భ‌త‌రం చేసేందుకు  ది బోరింగ్ కంపెనీని ప్రారంభిస్తున్న‌ట్లు ట్వీట్ చేశారు. 

► ఎలన్ మస్క్ కు త‌న తండ్రి ఎర్రోల్ మ‌స్క్ అంటే అస్స‌లు న‌చ్చ‌దు. సౌతాఫ్రికాలో బిజినెస్ మ్యాన్ గా ఉన్న ఎర్రోల్ అత్యంత క్రూరుడు. శారీర‌క సుఖ కోసం ఎంత‌కైనా తెగిస్తాడు. ఎర్రోల్  తొలిసారి ఎలన్ మ‌స్క్ త‌ల్లి మేయ‌ల్ ను వివాహం చేసుకున్నాడు. ఆ త‌రువాత మేయ‌ల్‌కు విడాకులిచ్చి అప్ప‌టికే పెళ్లై 10ఏళ్ల కూతురున్నహెడీని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత రెండో భార్య హెడీకి విడాకులిచ్చి ఆమె కూతురు జానాను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య కుమార్తె జానాకు ఎలన్ మ‌స్క్ తండ్రి ఎర్రోల్ మ‌స్క్ వ‌య‌స్సు వ్య‌త్యాసం 40ఏళ్లు. ఎర్రోల్‌-జానా దంప‌తులకు 2018లో బాబుకు జ‌న్మ‌నిచ్చారు. 

 ► ఎలన్ మ‌స్క్ త‌ల్లి మేయే మ‌స్క్‌. మోడ‌ల్‌, ప్ర‌ముఖ డైటీషియ‌న్, ఆథ‌ర్ ఇలా అన్నీ రంగాల్లో రాణించారు.  

చదవండి: రూ.83,697 కోట్ల పన్ను కట్టబోతున్న వ్యక్తి ఎవరో తెలుసా ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement